న్యూఢిల్లీ : మరో ఆప్ నేత ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడి) దాడికి దిగింది. ఢిల్లీ సామాజిక సంక్షేమ శాఖ మంత్రి రాజ్ కుమార్ ఆనందర్ నివాసంపై ఈడి దాడికి దిగింది. మనీలాండరింగ్ కేసుకు సంబంధించి గురువారం తెల్లవారుజాము నుండి ఈడి అధికారులు సోదాలు జరుపుతున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు సమన్లు జారీ చేసిన నాలుగు రోజుల వ్యవధిలోనే ఈ దాడులు చోటుచేసుకోవడం గమనార్హం. హవాలా లావాదేవీలతో పాటు దిగుమతులలో తప్పుడు ప్రకటనలతో రూ.7 కోట్లకు పైగా పన్ను ఎగవేతలకు పాల్పడినట్లు నివేదికల్లో పేర్కొంది. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ చేసిన ఫిర్యాదును స్థానిక కోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఆ తర్వాత ఈడి ఆనంద్‌పై ఫిర్యాదు చేసింది.
ఈ సోదాలపై ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆప్ నేత కావడమే ఆనంద్ తప్పు అని ధ్వజమెత్తారు. బ్రిటీష్ కాలంలో ఎవరి నివాసాల్లోనైనా సోదాలు చేయాల్సి వస్తే ముందుగా కోర్టు నుండి సెర్చ్ వారెంట్ ఇచ్చేవారి, కానీ నేడు ఈడికి వారెంట్ కూడా అవసరం లేదని విమర్శించారు. ఎవరి ఇంటిపై దాడిచేయాలో వారి అధికారులు నిర్ణయిస్తారని అన్నారు. ఆ అధికారులు ప్రతిపక్ష నేతల ఇళ్లపై మాత్రమే దాడులు చేపట్టాలని ఆదేశిస్తారని మండిపడ్డారు.