Oct 26,2023 14:11

జైపూర్‌ : కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఈడి, సిబిఐలు దేశంలో భయాందోళనలు రేకెత్తిస్తున్నాయని రాజస్తాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌గెహ్లాట్‌ వ్యాఖ్యానించారు.  కేంద్ర దర్యాప్తు సంస్థలకు విశ్వసనీయతలేదని, ఇది ఆందోళనకరమైన పరిస్థితి అని పేర్కొన్నారు. తాను తన కుమారుడు లేదా రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడి గురించి మాట్లాడటం లేదని, ఈ సంస్థలు దేశంలో భయాందోళనలను సృష్టిస్తున్నాయని మండిపడ్డారు. అక్టోబర్‌ 25న కాంగ్రెస్‌ మహిళలకు గృహలక్ష్మీ గ్యారెంటీ పథకాన్ని ప్రకటించిందని, మరుసటి రోజు రాజస్తాన్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు గోవింద్‌ సింగ్‌ జీ దోతస్రా, తనకుమారుడు వైభవ్‌లకు విచారణకు హాజరుకావాలని ఈడి సమన్లు ఇచ్చిందని అన్నారు. అంటే రాజస్తాన్‌లో మహిళలు, రైతులు, పేదలు కాంగ్రెస్‌ హామీల ద్వారా ప్రయోజనం పొందడం బిజెపికి ఇష్టం లేదని, అందుకే రాష్ట్రంలో ఈడి దాడులు జరుగుతున్నాయని అన్నారు.

ఎన్నికల ప్రకటన వెలువడగానే ఈడి, సిబిఐ , ఐటి శాఖలు బిజెపికి నిజమైన '' పన్నా ప్రముఖ్‌ '' గా మారతయాని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే ఎద్దేవా చేశారు. రాజస్తాన్‌లో ఓటమిపాలవుతామన్న భయంతో బిజెపి తన చివరి పాచికను ప్రయోగించిందని అన్నారు. ఛత్తీస్‌గఢ్‌ తర్వాత రాజస్తాన్‌లోనూ కాంగ్రెస్‌నేతలపై దాడులకు దిగిందని మండిపడ్డారు.

రాజస్తాన్‌లో ఈడి  గురువారం ఉదయం నుండి సోదాలు చేపడుతోంది. మరో నెల రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా ఈ దాడులు చోటు చేసుకోవడం గమనార్హం. పరీక్షా పత్రం లీక్‌కు సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో   కాంగ్రెస్‌ నేతల నివాసాల్లో సోదాలు చేపడుతున్నట్లు ఈడి తెలిపింది.  రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు గోవింద్‌ సింగ్‌ దోతస్రా, మహువా నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్‌ అభ్యర్థి నివాసాల్లో ఈడి తనిఖీలు చేపడుతోంది.  సీకర్‌, జైపుర్‌లో గోవింద్‌ సింగ్‌కు చెందిన ఇళ్లు, కార్యాలయాలు, మహువా కాంగ్రెస్‌ అభ్యర్థి ఓం ప్రకాశ్‌ హుడ్లా నివాసంతో సహా పలు ప్రాంతాల్లో ఈ తెల్లవారుజాము నుంచి ఈడి తనిఖీలు కొనసాగుతున్నాయి. మొత్తం ఏడు ప్రాంతాల్లో ఏకకాలంలో ఈ సోదాలు చేపట్టినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.

రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ కుమారుడు వైభవ్‌కు కూడా ఈడి సమన్లు జారీ చేసింది. ఫెమా నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించిన కేసులో వైభవ్‌కు ఈ సమన్లు జారీ చేసినట్లు సమాచారం. అక్టోబరు 27న దర్యాప్తు సంస్థ ఎదుట హాజరుకావాలని ఈడి పేర్కొన్నట్లు అధికారులు వెల్లడించారు.