న్యూఢిల్లీ : ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడి ) విచారణకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గైర్హాజరయ్యారు. కేజ్రీవాల్ ఉదయం 11 గంటలకు ఈడి కార్యాలయం ముందు హాజరుకావాల్సి వుంది. దీంతో ఈడి కార్యాలయం వద్ద భారీ సంఖ్యలో పోలీసులు, పారా మిలిటరీ బలగాలను మోహరించినట్లు అధికారులు తెలిపారు. విచారణకు హాజరు కావాల్సిందిగా గతవారం ఈడి కేజ్రీవాల్ కు సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే.
అయితే ఈ సమన్లను వెనక్కి తీసుకోవాలంటూ కేజ్రీవాల్ ఈడి అధికారులకు రెండు పేజీల లేఖ రాశారు. ఈ సమన్లు చట్ట విరుద్ధం మరియు రాజకీయ ప్రేరేపితమని పేర్కొన్నారు. రాజకీయ కక్షతో బిజెపి ఆదేశాను సారం ఈడి సమన్లు జారీ చేసిందని ఆ లేఖలో పేర్కొన్నారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి నన్ను దూరం చేసేందుకు వీటిని జారీ చేశారు. తక్షణమే సమన్లను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి వెళ్లనున్న కేజ్రీవాల్‌కు మరో సారి ఈడి సమన్లు జారీ చేసే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. సాధారణంగా ఓ వ్యక్తి గరిష్టంగా మూడుసార్లు ఈడి సమన్లను దాటవేసే అవకాశం ఉంది. ఆ తర్వాత ఈడి నాన్‌బెయిలబుల్ వారెంట్ పొందవచ్చని ఆవర్గాలు తెలిపాయి. అదే సమయంలో కేజ్రీవాల్ ముందస్తు అరెస్ట్ బెయిల్ కోసం అభ్యర్థించడానికి మరియు సమన్లను కోర్టులో సవాలు చేసేందుకు అవకాశం ఉందని పేర్కొన్నాయి.