న్యూఢిల్లీ : ఢిల్లీలో గాలి కాలుష్య స్థాయిలు పెరుగుతుండటంతో .. కేజ్రీవాల్ ప్రభుత్వం మరోసారి సరి - బేసి విధానాన్ని ప్రవేశపెట్టింది. దీపావళి తరువాతి రోజు నుండి ఈ విధానం అమల్లోకి రానుందని రాష్ట్ర పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ సోమవారం తెలిపారు. నవంబర్ 20 వరకు ఈ విధానం అమల్లో ఉంటుందని .. అనంతరం పరిస్థితిని సమీక్షించి పొడిగిస్తామని ప్రకటించారు. అలాగే 11 వ తరగతి వరకు పాఠశాలల సెలవులను పొడిగిస్తున్నట్లు ప్రకటించారు.
గత వారం రోజులుగా రాజధాని ఢిల్లీతో పాటు ఎన్‌సిఆర్ పరిధిలో దట్టమైన పొగమంచు కమ్మేసింది. దీంతో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నేడు అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సమావేశం అనంతరం పర్యావరణ మంత్రి గోపాల్ రారు మీడియాతో మాట్లాడారు. ఢిల్లీ వ్యాప్తంగా అన్ని పాఠశాలలను నవంబర్ 10 వరకు మూసివేయాల్సిందిగా తెలిపారు. అయితే 10, 12 తరగతులకు మినహాయింపునిస్తున్నట్లు ప్రకటించారు. గతంలో ప్రాథమిక పాఠశాలలకు మాత్రమే సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే. బాణాసంచా కాల్చడంపై నిషేధం, స్మాగ్ గన్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. బిఎస్3 పెట్రోల్, బిఎస్4 డీజిల్ వాహనాలపై నిషేధాన్ని పొడిగిస్తున్నామని పేర్కొన్నారు.
డీజిల్ ట్రక్కులను అనుమతించకూడదని, నిర్మాణ కార్యకలాపాలపై నిషేధం విధించేలా ఢిల్లీ వ్యాప్తంగా స్టేజ్ -4 చర్యలు అమలు చేయాలని గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (జిఆర్‌ఎపి) ఆదేశించింది.