Nov 13,2023 11:37

న్యూఢిల్లీ   :   దీపావళి తర్వాత ఢిల్లీ మరియు సమీప నగరాల్లో కాలుష్యం సోమవారం ఉదయం మళ్లీ ప్రమాదకర స్థాయికి చేరుకుంది. దీపావళి సందర్భంగా ప్రజలు బాణా సంచా పేల్చడంతో కాలుష్యం, పొగ కమ్మేశాయి. ఢిల్లీతో పాటు రాజధాని ప్రాంతాల్లో (ఎన్‌సిఆర్‌) సోమవారం ఉదయం గాలి కాలుష్యం ఆందోళనకర స్థాయికి చేరింది.  ఉదయం 6.00 గంటల సమయంలో ఢిల్లీ వాయు నాణ్యతా ప్రమాణం (ఎక్యూఐ) 500 కంటే అధికంగా ఉంది. కొన్ని ప్రదేశాల్లో 900 కి చేరుకుంది. జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియంలో ఎక్యూఐ 910, కరోల్‌బాగ్‌ 779గా నమోదయ్యాయి.

గతవారం కురిసిన వర్షాలు కాలుష్యం నుండి కొంతమేర ఉపశమనం కలిగించినప్పటికీ.. బాణా సంచాతో గాలి నాణ్యతా మళ్లీ క్షీణించింది. పలు ప్రాంతాల్లో విషపూరిత పొగమంచుకమ్మేయడంతో ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయి. రోహణీ, ఐటిఒ మరియు ఢిల్లీ విమానాశ్రయ ప్రాంతంతో సహా పగటి పూట చాలా ప్రదేశాలలో పిఎం 2.5 మరియు పిఎం 10 కాలుష్య స్థాయిలు 500కి చేరుకున్నాయని సెంట్రల్‌ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డ్‌ (సిపిసిబి) ప్రకటించింది.

డిఫెన్స్‌ కాలనీలో కూడా బాణాసంచా పేల్చారని, స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా ఎలాంటి మార్పు రాలేదని పర్యావరణ వేత్త భవ్రీన్‌ కంధారి తెలిపారు. హెచ్చరికలు మరియు నిషేధం ఉన్నప్పటికీ అమలు చేయడంలో అధికారులు మళ్లీ విఫలయ్యారని అన్నారు.