న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం స్థాయిలు తీవ్రస్థాయికి చేరాయి. దీంతో ప్రాథమిక పాఠశాలలకు (ఐదవ తరగతి వరకు) ఈ నెల 10 వరకు సెలవులను పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. 6-12వ తరగతులను ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించవచ్చని ఢిల్లీ విద్యాశాఖ మంత్రి అతిషి ఓ ప్రకటనలో తెలిపారు.
గతంలో నవంబర్ 5 వరకు ప్రాథమిక పాఠశాలలను మూసివేయాల్సిందిగా ఢిల్లీ ప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే ఢిల్లీలో కాలుష్య స్థాయిలు మరింత తీవ్రం కావడంతో సెలవులను పొడిగిస్తున్నట్లు పేర్కొన్నారు. వరుసగా ఆరో రోజైన ఆదివారం కూడా ఢిల్లీ వ్యాప్తంగా పొగమంచు కమ్మేసింది. ఆదివారం ఉదయం నాటికి వాయు నాణ్యతా ప్రమాణం (ఎక్యూఐ) సూచీ 460గా ఉంది. దీంతో వృద్ధులు, చిన్నారుల ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.