Sep 04,2023 15:51

ప్రముఖ క్రికెటర్‌, స్టార్‌ పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా తండ్రి అయ్యాడు. బుమ్రా భార్య సంజనా గణేశన్‌ సోమవారం ఉదయం మగ శిశువుకు జన్మనిచ్చింది. బుమ్రా దంపతులకు ఇదే తొలి సంతానం. పట్టరాని సంతోషంతో బుమ్రా ఈ విషయాన్ని ట్విట్టర్‌ ప్లాట్‌ ఫామ్‌ పై (ఎక్స్‌) పంచుకున్నాడు. ఆసియా కప్‌ కోసం శ్రీలంకకు వెళ్లిన బుమ్రా, భార్య ప్రసవం నేపథ్యంలో తిరిగి వెనక్కి వచ్చేశాడు. ''మా చిన్న కుటుంబం పెద్దగా మారింది. మా హృదయాలు నిండుదనాన్ని సంతరించుకున్నాయి. ఈ ఉదయం మేము మా చిన్నారి బాలుడిని (అంగద్‌ జస్ప్రీత్‌ బుమ్రా) ఈ ప్రపంచంలోకి ఆహ్వానం పలికాం. మేం ఆనందడోలికల్లో విహరిస్తున్నాం. మా జీవితంలో ఈ కొత్త అధ్యాయం గురించి మరింత వేచి చూడలేం'' అంటూ జస్ప్రీత్‌ బుమ్రా పోస్ట్‌ పెట్టాడు. తమ కుమారుడి చేతి పక్కనే బుమ్రా దంపతులు చేతులు ఉంచి తీసిన ఫొటోను పంచుకున్నాడు.