Oct 05,2023 13:40

టోక్యో :   జపాన్‌లో భారీ భూకంపం సంభవించింది. ఫసిఫిక్‌ మహాసముద్రం  వెలుపలి దీవుల సమీపంలో బలమైన ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. రిక్టర్‌ స్కేలుపై దాని 6.1 తీవ్రతగా నమోదైనట్లు అధికారులు తెలిపారు. దీంతో అధికారులు  తొలుత సునామీ హెచ్చరికలు జారీ చేశారు.  ఎలాంటి నష్టం వాటిల్లకపోవడంతో ..   రెండు గంటల అనంతరం ఆ హెచ్చరికలను ఉపసంహరించుకున్నట్లు పేర్కొన్నారు.

గురువారం ఉదయం 7 గంటల ప్రాంతంలో ఈస్ట్‌ కోస్ట్‌ ఏరియాలోని ఇజూ ఐస్‌ల్యాండ్స్‌లో సముద్రంలో భూ ప్రకంపనలు నమోదయ్యాయి. ఈ ప్రాంతంలో వరుస భూప్రకంపనలు చోటు చేసుకున్నాయని యుఎస్‌ జియోలాజికల్‌ సర్వే తెలిపింది. 10 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రాన్ని గుర్తించినట్లు  పేర్కొంది.  రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 6.1గా నమోదైనట్లు తెలిపింది.

సముద్రంలో భారీ భూకంపం నేపథ్యంలో అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ఇజూ ఐస్‌ల్యాండ్స్‌లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఒక మీటర్‌ (3.2 అడుగులు) ఎత్తులో సునామీ తీరాలను తాకవచ్చని జపాన్‌ వాతావరణ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. . అయితే హచిజో ద్వీపంలోని యానే సమీపంలో 30 సెం.మీ (ఒక అడుగు) పరిమాణంలో చిన్న సునామీ వచ్చినట్లు ఏజన్సీ తెలిపింది. ఎటువంటి నష్టం జరగలేదని, దీంతో రెండు గంటల తర్వాత సునామీ హెచ్చరికలను ఎత్తివేసినట్లు వెల్లడించింది.