- 'జగనన్న శాశ్వత భూహక్కు' లో నిబంధనలు బేఖాతరు - ఆర్భాటానికే పరిమితమవుతున్న సాంకేతికత
ప్రజాశక్తి- ఒంగోలు బ్యూరో : 'జగనన్న శాశ్వత భూహక్కు - భూ రక్ష' కార్యక్రమంలో భాగంగా చేపట్టిన భూముల రీసర్వే నిబంధన ప్రకారం జరగడం లేదు. 45 రోజుల్లోనే సర్వే పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్దేశించడంతో సర్వేలో పెద్ద ఎత్తున హడావిడి చోటుచేసుకుంటోంది. రాష్ట్ర ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం చేసుకున్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కూడా ఆర్భాటానికే పరిమితమౌతోంది. దీంతో పాత కష్టాలకు తోడు కొత్త తప్పులు చోటుచేసుకుంటున్నాయన్న అభిప్రాయం రైతుల్లో వ్యక్తమవుతోంది భూముల రీ సర్వే కోసం ప్రభుత్వం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తోంది. అందుకోసం కార్స్ అనే సాంకేతిక పద్దతిని ఎంచుకుంది. శాటిలైట్ ద్వారా తీసిన చిత్రాలను ఇప్పటికే ఉన్న భూముల చిత్రాలతో పోల్చి చూశాక, అన్నీ సరిపోయాక తనిఖీలు చేసి ఆమోదించాల్సి ఉంది. ఇందుకోసం అనేక దొంతర్లు కూడా ఉన్నాయి. ఇవన్నీ సక్రమంగా అమలు జరిగితేనే భూముల రికార్డులు సక్రమంగా వస్తాయి. ఈ నిబంధనల మేరకు సర్వే జరగనందునే తప్పిదాలు వస్తున్నాయని రైతు సంఘాల సమన్వయ సమితి విజయవాడలో సిసిఎల్‌ఆర్‌కు వినతిపత్రం ఇచ్చింది. జిల్లాల్లో ఎక్కడా జరగాల్సిన పద్దతిలో జరగనందునే పాసుపుస్తకాల్లో తప్పిదాలు వస్తున్నాయని రైతు సంఘాల సమన్వయ సమితి నేత చుండూరి రంగారావు పేర్కొన్నారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా సరిచేయడం లేదని తెలిపారు.
- ఇలా చేయాలి...
భూములపై సర్వేకు డ్రోన్‌లు వినియోగించి ఛాయాచిత్రాలు తీస్తున్నారు. ఈ చిత్రాలను రోవర్‌తో తీసిన చిత్రాలతోనూ, ఆ తర్వాత కార్స్ సాంకేతికతో తీసిన చిత్రాలతోనూ సూపర్ ఇంపోజ్ చేయాలి. మ్యాపులు అన్ని సక్రమంగా సరిపోతేనే ఓకే చేయాలి. ఈ ప్రక్రియను దిగువ స్థాయిలో సక్రమంగా చేయడం లేదు. విఆర్‌ఒలు, విఆర్‌ఎలు, డిప్యూటీ తహశీల్దార్లు తనిఖీ చేసి నమోదు చేయాలి. వీటిని ఉన్నతాధికారులైన ఆర్‌డిఓ, సబ్‌కలెక్టర్, జాయింట్ కలెక్టర్లు క్వాలిటీ చెక్ చేయాల్సి ఉంది. ఇది ఎంత మేరకు జరుగుతుందో కూడా స్పష్టత లేదు. తర్వాత రైతుల నుంచి పాసుపుస్తకాలు, 1-బి తీసుకుని తహశీల్దార్ కార్యాయంలోని ఎఫ్‌ఎంబితో సరిచూసి రికార్డు తయారు చేయాలి. దీన్ని మళ్లీ ఆర్‌డిఒ, సబ్‌కలెక్టర్, జాయింట్ కలెక్టర్ చెక్ చేయాలి. సరిగా లేకుంటే మళ్లీ రీసర్వే చేసి తప్పులను సరిచేయాలి. వీటిపై ఏం జరుగుతుందనేదీ తెలియజేయడానికి రైతులకు నోటీసులు ఇవ్వాలి. గ్రామసభలు పెట్టి రైతులను హాజరు పరిచి రికార్డులు సరిగా ఉన్నాయా? లేదా? అని అభిప్రాయసేకరణ చేయాలి. రైతుల నుంచి సంతకాలు కూడా తీసుకోవాలి. తప్పులు వస్తే వాటిని సరిచేశాక కూడా మళ్లీ గ్రామసభ పెట్టాలి. రైతుల ముందు రికార్డులను ఉంచాలి. వారికి పూర్తిగా అవగాహన వచ్చేలా వివరించాలి. ఎటువంటి తప్పులూలేని భూ పత్రాలు ఇస్తున్నామని రైతులకు గ్రామసభలోనే చెప్పాల్సి ఉంది. రైతులు ఆమోదించాకే అన్ని సరిగా ఉంటేనే పాసుపుస్తకంపై రైతుల వివరాలు ఎక్కించాలి.
- ఇలా జరుగుతోంది...!
అనేక చోట్ల ఈ ప్రక్రియ అంతా జరగడం లేదు. . అందుబాటులో ఉన్న రికార్డులను తీసుకుని నమోదు చేస్తున్నారు. డోన్‌లు తీస్తున్న చిత్రాలను మ్యాపులతో సరిపోల్చడం అరకొరే! ఇక అధికార యంత్రాంగమూ తనిఖీ చేయడం నామమాత్రమే!
రైతులతో ఎక్కడా గ్రామసభలు పెట్టడం లేదు. పాసుపుస్తకం వచ్చాక వేలిముద్ర వేయించుకుని పుస్తకం చేతిలో పెడుతున్నారు. దీంతో ఇప్పటి వరకూ జారీ చేసిన పుస్తకాల్లో 60 నుంచి 70 శాతం పుస్తకాల్లో తప్పిదాలు దొర్లినట్లు కనిపిస్తున్నారు.
- ఆచరణలో కనిపించని ఎడిట్ ఆప్షన్
పాసుపుస్తకాల్లో తప్పిదాలను రైతు సంఘాల సమన్వయ సమితి నేతలు సిసిఎల్‌ఆర్ దృష్టికి తీసుకెళ్లారు. ఎడిట్ ఆప్షన్ ఉందని, దాన్ని వినియోగించి పాసుపుస్తకాల్లో తప్పిదాలను సరిచేస్తామని హామీ ఇచ్చారు. అయితే, ఈ ఆప్షన్‌ను వినియోగించి పాసుపుస్తకాల్లో జరిగిన తప్పిదాలను ఎక్కడా పరిష్కారం చేయలేదు. ఒక్కో పాసుపుస్తకంలో పదుల సంఖ్యలో పేర్లు వచ్చినా అలాగే ఉన్నాయి. దీనిపై కలెక్టర్ల సమీక్షలోనూ సిసిఎల్‌ఎ ఆర్ సాయిప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మ్యుటేషన్లు చేయకుండా పాసుపుస్తకాలు ఎలా జారీ చేస్తున్నారని ప్రశ్నించారు. అయినా, మార్పు కనపడటం లేదు.










