
- జింక్ ఇండిస్టీ భూ పరిరక్షణ రైతు కమిటీ డిమాండ్
- '350 ఎకరాల స్వాహా'పై జింక్ భూ రైతులు, పారిశ్రామిక వర్గాల్లో చర్చ!
ప్రజాశక్తి- గ్రేటర్ విశాఖ బ్యూరో : '350 ఎకరాల స్వాహా' పేర బుధవారం ప్రజాశక్తి దినపత్రిక ప్రధాన సంచికలో వెలువడిన కథనంపై విశాఖపట్నం పారిశ్రామిక వర్గాల్లో తీవ్ర చర్చ రేపింది. వివిధ పరిశ్రమలకు చెందిన వారు దీనిపై పలు రకాలుగా స్పందించారు. హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ (హెచ్‌జెడ్‌ఎల్) స్థలసేకరణ కోసం 1971-74 సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వానికి సుమారు 350 ఎకరాలను మింది, చుక్కవానిపాలెం, ములగాడ, నక్కవానిపాలెం రైతులు కారుచౌకగా ఎకరా రూ.800కే ఇచ్చేశారు. వీరంతా ప్రస్తుత ఈ వార్తా కథనంతో ఆందోళనకు సిద్ధమవుతున్నారు. పరిశ్రమైనా పెట్టండి... లేదంటే మా భూములైనా వెనక్కి ఇవ్వండి' అనే నినాదంతో పోరాటానికి సిద్ధమవుతున్నట్లు జింక్ భూ పరిరక్షణ కమిటీ కన్వీనర్ పిట్టా నారాయణమూర్తి, కార్యదర్శి ఒ.వెంకటరావు సంయుక్తంగా ప్రకటన విడుదల చేశారు. పరిశ్రమ కోసం తామిచ్చిన భూములను రియల్ ఎస్టేట్ చేయడానికిగానీ, అదానీ పోర్టు బొగ్గు నిల్వల యార్డుకు ఇచ్చేందుకుగానీ అంగీకరించేదిలేదని రైతులు తేల్చి చెప్తున్నారు. రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్... మింది ప్రాంతానికి చెందిన వారేనని, త్వరలో ఆయనను కలుస్తామని నారాయణమూర్తి తెలిపారు.
- 178 మంది కార్మికులకు రూ.10 కోట్లు బకాయి
జింక్ భూ పరిరక్షణ కమిటీ వెల్లడించిన వివరాల ప్రకారం... 2002 సంవత్సరంలో వాజ్‌పేయి (బిజెపి) ప్రభుత్వ హయాంలో అమ్మేసిన నాటికే హిందుస్థాన్ జింక్ పరిశ్రమ మూడు స్మెల్టర్లు, ఐదు గనులు కలిగి ఉంది. 1977లో ఉత్పత్తి ప్రారంభించింది. లెడ్ ప్లాంట్‌ను మూసేయడమే కాకుండా 178 మంది కార్మికులకు సుమారు రూ.10 కోట్ల బకాయిలు యాజమాన్యం ఎగ్గొట్టింది. మొత్తంగా 265 మంది కార్మికులకు ఫైనల్ సెటిల్‌మెంట్‌ను జింక్ యాజమాన్యం చేయలేదు. వీరిలో 210 మంది కార్మికులు లేబర్ కోర్టులో కేసు వేయగా, వారికి అనుకూలంగా తీర్పు వచ్చింది. కానీ, జింక్‌ను స్వాధీనం చేసుకున్న వేదాంత యాజమాన్యం హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకుని నేటికీ కాలయాపన చేస్తోంది. భూముల స్వాహాపై ఏ స్థాయి పోరాటానికైనా వెనుకాడబోమని జింక్ భూ పరిరక్షణ కమిటీ పేర్కొంది. వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌ను ప్రయివేట్ వాళ్ల చేతుల్లో పెడితే రూ.లక్షల కోట్లు విలువైన 23 వేల ఎకరాల పరిస్థితి కూడా హిందుస్థాన్ జింక్‌లా మారిపోవడం ఖాయమని రైతులు అంటున్నారు. జింక్‌లో భూమిపోకుండా అడ్డుకుని తీరుతామని, భూ బాధిత రైతులు ఆందోళనకు సిద్ధం అవుతున్నారని కమిటీ ప్రతినిధులు తెలిపారు.
- పారిశ్రామిక వర్గాలేమంటున్నాయంటే...
హిందుస్థాన్ జింక్ లిమిటెడ్‌ను స్వాధీనం చేసుకున్న వేదాంత (స్టెరిలైట్ కంపెనీ) 350 ఎకరాలను ల్యాండ్ కన్వర్షన్ కింద (రియల్ ఎస్టేట్‌గా మార్చేందుకు) ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించింది. ప్రభుత్వం ఈ ప్రతిపాదనకు అవుననిగానీ, కాదనిగానీ చెప్పలేదు. రెండేళ్లుగా జాప్యం చేస్తూ కిమ్మనకపోవడంపై కేంద్రంలోని బిజెపి పెద్దల సమక్షంలో రహస్య ఒప్పందం చేసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వేదాంత... అదానీతో జత కలిసి వ్యవహారాన్ని సెటిల్ చేసినట్లు తాజాగా పలువురు పారిశ్రామికవేత్తలు చెబుతున్నారు.