
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : ఇనామ్ భూములకు సంబంధించి సర్వీస్ ఇనామ్స్ (దేవాదాయశాఖ ఇనామ్స్ కాకుండా)ను క్రమబద్ధీకరిస్తూ ప్రభుత్వం శాసనసభలో సవరణల బిల్లును తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర స్థాయిలో సర్వీస్ ఇనామ్‌లు ఇప్పటి వరకు 22(ఎ) నిషేధిత భూముల జాబితాలో ఉన్నవాటిని ఆ జాబితా నుంచి తొలగించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశిస్తూ సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు సంబంధించి విలేజ్ ఆర్టిజన్/ విలేజ్ సర్వీస్ ఇనామ్‌లను క్షుణ్ణంగా పరిశీలించి, అర్హత కలిగిన వారిని గుర్తించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇందుకోసం ప్రభుత్వం కొన్ని సూచనలు చేసింది. 1908 రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 22(ఎ)(1)ఎ, బి లేదా డి కింద నిషేధిత జాబితాలో చేర్చిన అర్హత ఉన్న భూములను గుర్తించి ఆ జాబితా నుంచి తొలగించి జిల్లా కలెక్టర్లకు అనంతరం జిల్లా రిజిస్ట్రార్లకు పంపాల్సి ఉంటుంది. దేవాదాయ, వక్ఫ్ ఆస్తులకు సంబంధించి ఈ మినహాయింపులు వర్తించవని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. నిషేధిత జాబితాలో ఉండే అర్హులకు సంబంధించిన భూముల వివరాలను కలెక్టర్లు ప్రభుత్వానికి పంపాలని సూచించారు.