May 29,2023 12:49

జంగారెడ్డిగూడెం (ఏలూరు) : ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం లక్కవరంలో పురుగుమందు డబ్బాతో కుటుంబం సోమవారం ఆందోళన చేపట్టింది. సదరు స్థలంలో టెంటు వేసి బాధితులు నిరసన తెలిపారు. ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూమిని ప్రభుత్వం ఇళ్ల స్థలాలకు కేటాయించడం పై కుటుంబీకులు అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. దళిత ఎమ్మెల్యే ఇలకలో దళితులకే రక్షణ లేకపోతే ఎలా అంటూ వారు ప్రశ్నించారు. వివాదంలో ఉన్న స్థలంపై ఎస్సీ ఎస్టీ కమిషన్‌ విక్టరీ ప్రసాద్‌ ఆదేశాలు సైతం తహశీల్దార్‌ బేఖాతరు చేస్తున్నారని ఆరోపించారు. తమ భూములను లాక్కుంటే తమకు ఆత్మహత్యమే శరణ్యం అంటూ కుటుంబీకులు రోదించారు. ఇదే గ్రామంలో అగ్రవర్ణ కులాలకు చెందిన భూములను వదిలేసి దళితుల భూములను తీసుకోవడం పై బాధితులు వాపోయారు. ప్రభుత్వానికి కేవలం దళితుల భూములే కావాలా ? అంటూ కంటతడిపెట్టారు. దళితులమైన మా గోడు ప్రభుత్వం వింటుందా ? అని ఆవేదన వ్యక్తం చేశారు. తాము దళితులం కాబట్టే తమపై దౌర్జన్యం చేసి తమ భూములు లాక్కుంటున్నారని చెప్పారు. ఇది దళితుల ప్రభుత్వం అని చెబుతూనే ప్రభుత్వమే దళితులకు తీరని అన్యాయం చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.