
- అనంతపురం జిల్లాలో కేటాయింపు
- వివాదాలు పట్టించుకోని రాష్ట్ర సర్కారు
- కర్నూలులో జాతీయ న్యాయ విశ్వ విద్యాలయం
- 1998 డిఎస్‌సి క్వాలిఫైడ్ అభ్యర్ధులకు మినిమం టైం స్కేలు
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : అదాని అక్రమాలపై దేశ వ్యాప్తంగా వ్యక్తమవుతున్న ఆందోళనను రాష్ట్ర ప్రభుత్వం బేఖాతరు చేసింది. పార్లమెంటులో చర్చకు విపక్షాలు పట్టుబడుతున్న సమయంలోనే అనంతపురం జిల్లాలో మరో 406.40 ఎకరాల భూమిని అదాని సంస్థలకు అప్పగించడానికి రంగం సిద్ధం చేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అధ్యక్షతన బుధవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అదానిగ్రీన్ ఎనర్జీ లిమిటెడ్‌కు 500మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటుకు 406.40 ఎకరాల భూమిని ఎకరం రూ.5లక్షల వంతున ఇవ్వాలన్న ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది. అనంతపురం జిల్లా తాడిమర్రిమండలం పెద్దకోట్ల దాడితోట గ్రామాల పరిధిలో ఈ భూములు కేటాయించనున్నారు. దీంతో పాటు కర్నూలులో 50 ఎకరాల విస్తీర్ణంలో న్యాయ విశ్వ విద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని, 1998 డిఎస్‌సి క్వాలిఫైడ్ అభ్యర్థులు 4,534మందికి మినిమం టైమ్ స్కేల్ వర్తింపజేస్తూ ఎస్‌జిటి పోస్టులను భర్తీ చేయాలని క్యాబినెట్ ఆమోదించింది. ఉగాదికి అందించే సంక్షేమ పథకాలకు కూడా మంత్రిమండలి గ్రీన్‌సిగల్ ఇచ్చింది. ఈ సమావేశంలో 70 అంశాలకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. క్యాబినెట్ నిర్ణయాలను రాష్ట్ర సమాచార, పౌరసంబంధాలశాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మీడియాకు వివరించారు. వైఎస్‌ఆర్ లా నేస్తం, వైఎస్‌ఆర్ ఆసరా, ఇబిసి నేస్తం, వైఎస్‌ఆర్ కళ్యాణమస్తు, జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెనలకు మంత్రి మండలి ఆమోదం తెలిపినట్టు ఆయన చెప్పారు. .ఈనెల10న కళ్యాణమస్తు, షాదీతోఫాలను ప్రారంభిస్తామని, కళ్యాణమస్తుకు దరఖాస్తు చేసుకునే వార పదవతరగతి పాసై ఉండాలని తెలిపారు. ఏ సీజన్‌లో పంట నష్టపోతే అదే సీజన్‌లోనే ఇన్‌పుట్ సబ్సిడీ ఇచ్చేందుకు కూడా ఆమోదం తెలిపినట్లు మంత్రి వెల్లడించారు. 28న జగనన్న విద్యా దీవెన పూర్తి స్దాయి రీ ఎంబర్స్‌మెంట్ రూ.700కోట్లు విద్యార్ధులకు అందచేస్తామన్నారు. ఉగాది సందర్భంగా మహిళా సంఘాలకు 79లక్షల మంది మహిళలకు మూడో విడత సుమారు 6,500కోట్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఉగాది వేడుకలు వారం రోజుల పాటు చేసుకునేందుకు వీలుగా ఆసరా మూడో విడత పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఆరోగ్యశ్రీ కింద 3,255 ప్రొసీజర్స్‌ను ఎక్కడ వైద్యం చేయించినా పథకం వర్తించేలా మార్పులు చేస్తున్నట్లు తెలిపారు. విలేజ్ హెల్త్ నెస్ సెంటర్ రెఫరెల్ సెంటర్‌గా పనిచేస్తుందన్నారు.. కస్తూరిబాలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు గౌరవ వేతనానికి 23శాతం అదనంగా జీతాలు పెంచుతూ తీర్మానం చేసినట్లు తెలిపారు. విశాఖలో 100 మెగా వాట్ల డేటా సెంటర్ ,రిక్రియేషన్‌కు 60.29ఎకరాల భూమిని కేటాయించేందుకు మంత్రిమండలి ఆమోదం తెలిపినట్టు చెప్పాఉ. 1965 మునిసిపాలిటీస్ యాక్ట్, ఆంద్రప్రదేశ్ మున్సిపల్ కార్పొరేషన్స్ యాక్ట్ -1955లకు సవరణలకు సంబందించిన డ్రాప్ట్ బిల్లుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. సర్వే సెటిల్‌మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్సు, రెవెన్యూశాఖల సహకారంతో అర్భన్ లోకల్ బాడీస్‌లో సమగ్ర భూముల రీసర్వేపనుల కోసం అవసరమైన సవరణలకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఎపి మునిసిపల్ అకౌంట్స్‌సబార్డినేట్ సర్వీసెస్ కింద పరిపాలనా సౌలభ్యం కోసం డిప్యూటీ డైరెక్టర్ పోస్టు ఏర్పాటుకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. రామాయపట్నం పోర్టు కు 250 ఎకరాల భూమిని లీజుకు ఇవ్వాలని, గ్రానైట్ పరిశ్రమల కోసం విద్యుత్తు యూనిట్ రూ.2లకు అందించాలని నిర్ణయించింది. తాడేపల్లిలో కొత్తగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు, కొత్త జిల్లాల నేపధ్యంలో అవసరమైన చోట మండల కేంద్రాలు ఏర్పాటు, మచిలీపట్నం పోర్టు 3940.42కోట్లు రుణం తీసుకునేందుకు పవర ్‌ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రుణం తీసుకు నేందుకు బ్యాంకు గ్యారెంటీకి ఆమోదం తెలిపింది. నెల్లూరు బ్యారేజీకి నల్లపురెడ్డి శ్రీనివాసులరెడ్డి బ్యారేజీగా పేరుమార్చాలని నిర్ణయించారు. వైద్యఆరోగ్యశాఖలో రిక్రూట్‌మెంట్లకు ప్రత్యేక బోర్డు ఏర్పాటుకు మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్‌కు రామాయపట్నం పోర్టులో 2క్యాప్టివ్ బెర్తులను నామినేషన్ పద్దతిలో కేటాయించేందుకు , టిటిడిలో సేవల నిర్వహణకు 34మంది సిబ్బందితో ఐటి విభాగానికి ఆమోదం తెలిపింది. ఒంగోలు మ ండలాన్ని రూరల్ అర్భన్ మండలాలుగా, విభజించేందుకు అంగీకారం తెలిపింది. ఏలూరు, మచిలీపట్నం, విజయనగరం, నంద్యాల, అనంతపురం, చిత్తూరు మండలాలు అర్భన్, రూరల్ మండలాలుగా విభజనకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.నిషేధిత సంస్థలపై నిషేదం గడువును ఏడాది పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇటీవల మృతి చెందిన సినీ ప్రముఖులు కె. విశ్వనాథ్, కృష్ణ, కృష్ణంరాజు, కైకాల సత్యనారాయణ, చలపతిరావు, ఎం. బాలయ్య, వాణి జయరామ్, డైరెక్టర్ సాగర్‌కు నివాళి అర్పిస్తూ మంత్రిమండలి రెండు నిమిషాలు మౌనం పాటించింది.
- విభేదాలు విడనాడాల్సిందే : మంత్రులపై సిఎం అసహనం
మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య ఏమైనా విభేదాలుంటే కూర్చొని పరిష్కరించుకోవాలని, లేనిపక్షంలో పార్టీకి నష్టం జరుగుతుందని, ఈ విషయంలో ఎవరినీ ఉపేక్షించేది లేదని సిఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కొంత కటువుగానే మాట్లాడినట్లు సమాచారం. సచివాలయంలో బుధవారం క్యాబినెట్ సమావేశం ముగిసిన అనంతరం అధికారులు బయటకు వెళ్లిన తర్వాత సుమారు 40 నిమిషాల పాటు మంత్రులతో సిఎం ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. కొన్ని జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య ఆధిపత్యపోరు జరుగుతున్నట్లు పత్రికల్లో వార్తలు వస్తున్నాయని, మీడియాకు ఎక్కకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఒకరిద్దరు మంత్రులకు సిఎం క్లాస్ పీకినట్లు తెలిసింది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఫోన్ ట్యాఫింగ్ అంటూ కేంద్ర హోంమంత్రిత్వశాఖకు లేఖ రాసిన విషయంపై కూడా కొద్దిసేపు చర్చ జరిగినట్లు తెలిసింది. గడప గడప కార్యక్రమంలో కొందరు మంత్రులు సక్రమంగా పాల్గొనడం లేదని, సర్వేల్లో ఈ విషయం తేటతెల్లమవుతోందని, గడప గడప కార్యక్రమంపై ఎందుకు సీరియస్‌గా తీసుకోలేక పోతున్నారని ఒకరిద్దరు మంత్రులను గట్టిగా మందలించినట్లు సమాచారం. జిల్లాల్లో నేతలు ఎవరైనా అసంతృప్తిగా ఉన్నట్లు తెలిసిన వెంటనే ఆ జిల్లా మంత్రులు, ఇన్‌ఛార్జి మంత్రులు వారి వద్దకు వెళ్లి సమస్యకు పరిష్కారాన్ని చూపాలని సిఎం ఆదేశించినట్లు తెలిసింది. జిల్లాల్లో పార్టీపై విపక్షాలు చేస్తున్న విమర్శలను అదే స్థాయిలో తిప్పికొట్టాలని, ప్రభుత్వ పరంగా ఏమైనా ప్రతిపాదనలు పెండింగ్‌లో ఉంటే తమ దృష్టికి వెంటనే తీసుకు రావాలని మంత్రులకు సూచించారు. కేబినెట్‌లో ప్రస్తుతం సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ, వైద్యారోగ్యశాఖ మంత్రి విడదల రజని, పౌరసరఫరాలశాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు వారి శాఖలపై పట్టు సాధించారని, మిగిలిన మంత్రులు కూడా శాఖలపై పట్టు సాధించాలని సిఎం సూచించినట్లు సమాచారం.