Nov 21,2023 10:42
  • అదానిపై విచారణలో జాప్యం
  • సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు

న్యూఢిల్లీ : అదాని గ్రూపు అక్రమాలపై దర్యాప్తును పూర్తి చేయడంలో విఫలమైన సెబీపై చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు అయ్యింది. అదాని స్టాక్స్‌ ధరల తారుమారు ఆరోపణలపై సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్సేంజీ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా (సెబీ) దర్యాప్తును పూర్తి చేసి నివేదికను సమర్పించేందుకు గడువును ఉల్లంఘించిందని పిటిషనర్‌ విశాల్‌ తివారీ కోర్టు దృష్టికి తెచ్చారు. సెబీకి గడువు ఇచ్చినప్పటికీ కోర్టు ఆదేశాలను పాటించడంలో విఫలమైందన్నారు. అదాని గ్రూపు కంపెనీలు తీవ్ర ఆర్థిక అవకతవకలకు పాల్పడుతున్నాయని.. కృత్రిమంగా షేర్ల ధరలను పెంచుతున్నాయని ఈ ఏడాది జనవరిలో అమెరికన్‌ సంస్థ హిండెన్‌బర్గ్‌ ఓ కీలక రిపోర్ట్‌ను విడుదల చేసింది. దీంతో భారత స్టాక్‌ మార్కెట్‌లో అదాని కంపెనీల షేర్లు అమాంతం పడిపోవడంతో ఇన్వెస్టర్లు లక్షల కోట్ల రూపాయలు నష్టపోయారు. దీంతో ఇన్వెస్టర్లకు రక్షణ కల్పించాలని సుప్రీంకోర్టులో కేసు నమోదు కాగా.. సెబీని విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే.
సెబీ తన దర్యాప్తును పూర్తి చేసి.. 2023 ఆగస్ట్‌ 14 కల్లా తమకు అందించాలని మే 17న అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. మొత్తం 24 పరిశోధనలు చేశామని ఆగస్టు 25న సెబీ తన దర్యాప్తుకు సంబంధించిన స్టేటస్‌ రిపోర్ట్‌ను దాఖలు చేసింది. వీటిలో 22 పరిశోధనలు పూర్తిగా విచారించామని.. మరో రెండు తాత్కాలికంగా పూర్తి అయ్యాయని పేర్కొంది. ఇందులో కొన్ని కీలకమైన అంశాల విచారణను విస్మరించిందనే విమర్శలు ఉన్నాయి. అదే విధంగా అదాని గ్రూపునకు వ్యతిరేకంగా ఆర్గనైజ్డ్‌ క్రైమ్‌ అండ్‌ కరప్షన్‌ రిపోర్టింగ్‌ ప్రాజెక్టు (ఒసిసిఆర్‌పి) విడుదల చేసిన రిపోర్టులోనూ అదాని కంపెనీల్లో మారిషస్‌ దొడ్డిదారి నిధుల అరోపణలను పిటిషనర్‌ సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చారు. పెట్టుబడిదారులను రక్షించేందుకు, స్టాక్‌ మార్కెట్‌లో వారి ఇన్వెస్ట్‌మెంట్‌లను సురక్షితంగా ఉండేలా సెబీ భవిష్యత్తులో ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చెప్పాలని కోరారు. రెగ్యులేటరీ అథారిటీ నిర్దేశించిన అవసరమైన నియమ, నిబంధనలను కార్పొరేట్‌ కంపెనీలు పాటిస్తున్నాయా.?, కంపెనీల ప్రవర్తన, పద్ధతులపై నిఘా ఉంచడానికి బలమైన యంత్రాంగం కూడా అవసరమని తివారీ తన దరఖాస్తులో పేర్కొన్నారు. ఇన్వెస్టర్ల రక్షణకు నిపుణుల కమిటీ తన నివేదికలో ఇచ్చిన సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం దానికి అనుగుణంగా ఎటువంటి బలమైన చర్య తీసుకోలేదని, భవిష్యత్తులో పెట్టుబడిదారుల రక్షణ కోసం ఎటువంటి సురక్షితమైన విధానాన్ని కోర్టుకు తెలియజేయలేదన్నారు. దర్యాప్తు పూర్తి చేయడానికి అవసరమైన గడువు సమయాన్ని సూచించడాన్ని సెబీ తన దరఖాస్తులో అభ్యంతరం వ్యక్తం చేసిందని తివారీ అన్నారు.
ఇది మార్కెట్‌పై పెట్టుబడిదారుల విశ్వాసాన్ని కూడా తగ్గిస్తుందన్నారు. ఆగస్టు 14 వరకు కోర్టు గడువు విధించినప్పటికీ సెబీ తన నివేదికను దాఖలు చేయడంలో విఫలమైందని పేర్కొన్నారు. విచారణలో విపరీతమైన జాప్యం దర్యాప్తుపై ప్రభావం చూపుతుందని.. ఇది పెట్టుబడిదారుల మనస్సులలో అనుమానాన్ని పెంచుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. దర్యాప్తులో జాప్యం వల్ల కీలకమైన అంశాలు, సాక్ష్యాల అవకతవకలు, నష్టానికి దారి తీస్తుందన్నారు. అదాని అక్రమాలపై స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందన్నారు. గడువులోగా దర్యాప్తును పూర్తి చేయలేని సెబీని వివరణ కోరాలని పిటిషనర్‌ కోర్టుకు విజ్ఞప్తి చేశారు.