Sep 07,2023 10:52

మారిషస్‌ నుంచి ఆరు మాయం
సెబీకి సవాల్‌
న్యూఢిల్లీ : 
 అదానీ కంపెనీల్లో డొల్ల సంస్థల పెట్టుబడులు మరోమారు నిరూపేతమయ్యాయి. అదానీ లిస్టెడ్‌ కంపెనీల్లో షేర్లను కొనుగోలు చేస్తూ.. కృత్రిమ ధరల పెంపునకు పాల్పడుతోన్న విదేశాల్లోని ఇన్వెస్టర్లు అదృశ్యమయ్యారు. అదానీ సంస్థలలో షేర్లను కొనుగోలు చేస్తోన్న ఎనిమిది విదేశీ ఫండ్‌లలో ఆరు సంస్థలు మాయమయ్యాయని మింట్‌ ఓ కథనంలో వెల్లడించింది. ఇందులో బెర్ముడా, మారిషస్‌ ఫండ్‌ సంస్థలున్నాయి. గతేడాది మారిషస్‌ ఆధారిత రెండు సంస్థలు మూత పడ్డాయి. మూడోది మూసివేసే ప్రక్రియలో ఉందని మిట్‌ రిపోర్ట్‌ చేసింది. 2020లో అదానీ గ్రూప్‌ కంపెనీలలో విదేశీ సంస్థల హోల్డింగ్‌లపై మార్కెట్స్‌ రెగ్యులేటర్‌ దర్యాప్తు ప్రారంభించిన తర్వాత అవి మూతపడటంతో అదానీ కంపెనీల్లో విదేశీ పెట్టుబడులకు మరింత బలం చేకూరినట్లయ్యింది. ఈ పరిణామం ఈ పెట్టుబడి సంస్థల అంతిమ లబ్ధిదారు లను గుర్తించడంలో సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్సేంజీ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా (సెబీ)కి సవాలుగా మారింది. మింట్‌ కథనం ప్రకారం.. మారిషస్‌ నుంచి అదానీ కంపెనీల షేర్లలో పెట్టుబడులు పెట్టిన అసెంట్‌ ట్రేడ్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ జూన్‌ 2019 నుంచి అదృశ్యమయ్యింది. లింగో ట్రేడింగ్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ మార్చి 2015లో మూసివేయబడింది. మిడ్‌ ఈస్ట్‌ ఓషన్‌ ట్రేడ్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ గతేడాది ఆగస్టులో చిరునామా లేకుండా పోయింది. ఇఎం రిసర్జెంట్‌ ఫండ్‌ గతేడాది ఫిబ్రవరిలో మూసివేయబడింది. ఆసియా విజన్‌ ఫండ్‌ మూసివేసే ప్రక్రియలో ఉంది. అదానీ గ్రూపులో డొల్ల, దొంగ పెట్టుబడులపై ఇటీవల ఆర్డనైజ్డ్‌ అండ్‌ కరప్షన్‌ రిపోర్టింగ్‌ ప్రాజెక్ట్‌ (ఒసిసిఆర్‌పి) ఓ రిపోర్ట్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే.

అదానీ గ్రూప్‌లో రహస్యంగా పెట్టుబడి పెట్టిన ఇద్దరు వ్యక్తులు.. అదానీ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారని వెల్లడించింది. గౌతం అదానీ సోదరుడు వినోద్‌ అదానీ సంస్థల్లో పెట్టుబడులు కలిగి ఉన్నారని పేర్కొంది. సెబీ నిబంధనలను ఉల్లంఘించినట్లు తెలిపింది. అదానీ అక్రమాలపై హిండెన్‌బర్గ్‌ ఇచ్చిన రిపోర్ట్‌పైనా సుప్రీంకోర్టు విచారిస్తున్న విషయం తెలిసిందే. కాగా.. సుప్రీం ఆదేశాల మేరకు అదానీ కంపెనీల్లో విదేశీ పెట్టుబడులపైనా సెబీ దర్యాప్తు జరుపుతోంది. విదేశీ పెట్టుబడులకు సంబంధించి మరింత సమాచారం దొరకాల్సి ఉందని సెబీ ఇటీవల అత్యున్నత న్యాయస్థానానికి సమర్పించిన అఫిడవిట్‌లోనూ పేర్కొంది. కాగా.. అదానీ కంపెనీ షేర్లలో విదేశీ పెట్టుబడులపై విచారిస్తోన్న సెబీకి అదృశ్య ఇన్వెస్టర్లను కనుగొనడం పెద్ద సవాల్‌గా మారనుంది. ప్రధాని నరేంద్ర మోడీకి అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందిన గౌతం అదానీ ఆర్థిక అక్రమాలు, షేర్ల ధరల కృత్రిమ పెంపునపై అనేక రిపోర్టులుగా రాగా.. ఇప్పటికీ ఎక్కడా కూడా పారదర్శకంగా విచారణ జరగడం లేదని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తోన్న విషయం తెలిసిందే.