Sep 21,2023 07:46
  • గన్నవరంలో సభలో సిఎంపై అనుచిత వ్యాఖ్యలపై పోలీసు

ప్రజాశక్తి - హనుమాన్‌ జంక్షన్‌ : రాష్ట్రంలో ప్రస్తుతం రావణాసురుడి పాలన సాగుతోందని, ఆ పరిపాలనలో భాగంగానే ప్రతిపక్షాలపై, ప్రజలపై నిత్యం వేధింపులు పెరిగిపోతున్నాయని టిడిపి సీనియర్‌ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. యువగళం పాదయాత్రలో భాగంగా కృష్ణాజిల్లా గన్నవరంలో నిర్వహించిన బహిరంగ సభలో సిఎంపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆత్కూరు పోలీస్‌స్టేషన్‌లో మాజీ మంత్రి పేర్ని నాని ఫిర్యాదు చేశారు. దీంతో అయ్యన్నపై హనుమాన్‌ జంక్షన్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఫిర్యాదుకు సంబంధించి ఆయనను గతంలో హనుమాన్‌ జంక్షన్‌ పోలీసులు విశాఖపట్నం విమానాశ్రయంలో అరెస్టు చేసి మార్గమధ్యంలో 41 ఏ నోటీసు ఇచ్చి విడిచిపెట్టిన విషయం తెలిసిందే. తాజాగా బుధవారం ఆ నోటీసుకు సంబంధించి తన వాదన వినిపించేందుకు అయ్యన్నపాత్రుడుతోపాటు టిడిపి కృష్ణాజిల్లా అధ్యక్షుడు, మాజీ ఎంపి కొనకళ్ళ నారాయణరావు కలిసి హనుమాన్‌ జంక్షన్‌ సర్కిల్‌ కార్యాలయానికి వచ్చారు. వారిని జంక్షన్‌ సిఐ అల్లు నవీన్‌ నరసింహమూర్తి, ఆత్కూరు ఎస్‌ఐ శ్రీనివాసరావు, గన్నవరం డిఎస్‌పి జయసింహా వేర్వేరుగా విచారించారు. దాదాపు రెండు గంటలపాటు విచారణ సాగింది. రాష్ట్ర ప్రజలు అనుకుంటున్న మాటలను ప్రతిపక్ష నేత హోదాలో గన్నవరం బహిరంగ సభలో తాను మాట్లాడినట్లు అయ్యన్నపాత్రుడు పోలీసులకు స్పష్టం చేశారు. అయ్యన్నపాత్రుడు చెప్పిన వివరణను కోర్టుకు నివేదిస్తామని జంక్షన్‌ సిఐ తెలిపారు.
అనంతరం అయ్యన్నపాత్రుడు మీడియాతో మాట్లాడుతూ ప్రజల హక్కులను కాలరాయటమే జగన్‌ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశంగా ఉందని విమర్శించారు. తప్పులను ప్రశ్నిస్తే ప్రతిపక్ష నేతలపైన, ప్రజలపైన, సహకరించని అధికారులపైన కేసులు పెట్టడం జగన్‌కే చెల్లిందన్నారు. ప్రతిపక్ష నేతలను దూర్భాషలాడుతూ కేసులు పెట్టి ఆనందం పొందుతున్న వైసిపి నేతలకు రివర్స్‌ ట్రీట్‌మెంట్‌ ఉంటుందని హెచ్చరించారు.