ప్రజాశక్తి - యు.కొత్తపల్లి (కాకినాడ) : నాగులపల్లి పంచాయతీలో శనివారం నిర్వహించిన 'జగనన్న సురక్ష' కార్యక్రమం రసాభాసగా మారింది. పిఠాపురం ఎమ్మెల్యే నాగులపల్లి గ్రామానికి మాత్రమే ఇళ్ల స్థలాలు కేటాయించకుండా ఎందుకు అడ్డుకుంటున్నారో చెప్పాలంటూ.. గ్రామస్తులు అధికారులను అడ్డుకున్నారు. వారిని బయటకు వెళ్లనీయం అంటూ.. కార్యాలయ తలుపులను వేసేందుకు ప్రయత్నించారు.
నాగులపల్లిలోని గ్రామంలో ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా అధికారులు, నాయకులు కాలయాపన చేస్తున్నారని వైసిపి నాయకులు వడిశెట్టి నారాయణరెడ్డి ఆరోపించారు. ఈరోజు నాగులపల్లి పంచాయతీలో జగనన్న సురక్ష కార్యక్రమం సర్పంచ్ వడిశెట్టి గౌరీ రాజేశ్వరి, నారాయణరెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో అబ్రహం లింకన్ పలువురు అధికారులు పాల్గన్నారు. ఈ సందర్భంగా ఒడిశెట్టి నారాయణరెడ్డి, గ్రామ ప్రజలు కలిసి అధికారులను నిలదీశారు. ఇళ్ల స్థలాలు కేటాయించేవరకు నాగులపల్లి నుండి అధికారులను పంపేది లేదని హెచ్చరించారు. ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రులు వచ్చినా సరే ఇళ్ల స్థలాలను కేటాయించే వరకు పంపించేదిలేదని తేల్చి చెప్పారు. పిఠాపురం ఎమ్మెల్యే నాగులపల్లి గ్రామానికి మాత్రమే ఇళ్ల స్థలాలు కేటాయించకుండా ఎందుకు అడ్డుకుంటున్నారో సురక్ష కార్యక్రమంలో చెప్పాలని డిమాండ్ చేశారు. పిఠాపురం నియోజకవర్గంలో వైసిపికి అత్యధిక మెజార్టీ తీసుకొచ్చిన నాగులపల్లి గ్రామాన్ని విస్మరించారని మండిపడ్డారు. ఈ కార్యక్రమం ముగించుకొని అధికారులు వెళ్లే ప్రయత్నం చేయగా గ్రామస్తులు అడ్డుకొని కార్యాలయానికి తలుపులు వేసేందుకు ప్రయత్నించారు. ఇళ్ల స్థలాల విషయం తేలే వరకు వదిలేది లేదని అడ్డుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ చిరంజీవి, నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్తతగా ఉంది.










