Oct 11,2023 09:50

బీజింగ్‌ : హమాస్‌ దాడి చేసిన వెంటనే ఇజ్రాయిల్‌కు ఆయుధాలు, యుద్ధ నౌకలు పంపాలని అమెరికా ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయంతో ఉద్రికత్తలకు మరింత ఆజ్యం పోసినట్లైందని, మానవతా సంక్షోభం మరింతగా పెచ్చరిల్లిందని చైనా పరిశీలకులు వ్యాఖ్యానించారు. పైగా, ఈ ఆకస్మిక దాడికి అమెరికా తప్పుడు రీతిలో స్పందించడం చూస్తుంటే మధ్యప్రాచ్యంలో విధానాల రూపకల్పనలో విఫలమైనట్లు అర్ధమవుతోందని అన్నారు. రష్యా-ఉక్రెయిన్‌ సంక్షోభంలో చేసినట్లుగానే ఇక్కడ కూడా ఉద్రిక్తతలను రెచ్చగొట్టడమే అమెరికా లక్ష్యంగా వుందన్నారు. ఇజ్రాయిల్‌కు అమెరికా మిలటరీ సామాగ్రిని తరలించడంపై చైనా విదేశాంగ వ్యవహారాల ప్రతినిధి మావో నింగ్‌ స్పందిస్తూ, దీనిని చర్చలు, సంప్రదింపుల ద్వారానే పరిష్కరించుకోవాలని చైనా గట్టిగా విశ్వసిస్తోందని అన్నారు. తక్షణమే కాల్పుల విరమణ జరిపి, యుద్ధాన్ని ఆపి, పరిస్థితిని మరింత క్షీణించకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అంతర్జాతీయ ఘర్షణలు తలెత్తినపుడు సాధారణంగా అమెరికా వ్యవహరించే పక్షపాత ధోరణి అంతిమంగా ఉద్రిక్తతలకు ఆజ్యం పోస్తుందని చైనా పరిశీలకులు వ్యాఖ్యానించారు. సైనిక సంపత్తి దృష్ట్యా చూసినట్లైతే పాలస్తీనా కన్నా ఇజ్రాయిల్‌ పై స్థానంలో వుంటుందని, అమెరికా నిజంగా శాంతిని కోరుకున్నట్లైతే, ఏకపక్షంగా వ్యవహరించడానికి బదులు ఉద్రిక్తతలను చల్లార్చే చర్యలు చేపట్టాల్సి వుందని చైనా సమకాలీన అంతర్జాతీయ సంబంధాల సంస్థకు చెందిన రీసెర్చ్‌ఫెలో తియాన్‌ వెన్‌లిన్‌ వ్యాఖ్యానించారు.