Oct 21,2023 11:21
  • మంత్రి వేణు, ఎం పి డి ఓ కు పిర్యాదు
  • విదేశాల్లో ఉన్న వారికి హాజరు వేస్తున్న వైనం

ప్రజాశక్తి-రామచంద్రపురం : కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంత ప్రజలకు పనులు లేని సమయంలో ఉపాధి హామీ పథకం కింద పనులు కల్పించేందుకు ఏర్పాటుచేసిన జాతీయ ఉపాధి హామీ పథకం అక్రమార్కుల సంపాదన కు ఒక వరం లా మారింది. ఉపాధి హామీ పథకం పనులపై అధికారుల పర్యవేక్షణ లోపంతో ఫీల్డ్ అసిస్టెంట్లు తమ ఇష్టం రాజ్యంగా వ్యవహరిస్తూ ప్రభుత్వ నిధులను కొల్లగొడుతున్నారు. రామచంద్రపురం నియోజకవర్గంలోని తోటపేట గ్రామంలో ఉపాధి హామీ పథకం పనులపై జరిగిన అవకతవకలపై స్థానిక ఎంపీటీసీ అల్లం నాగ సంధ్య రాష్ట్ర మంత్రి వేణుకు మండల పరిషత్ అభివృద్ధి అధికారి కీర్తి స్పందనకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఉపాధి హామీ పథకం పనుల్లో ఇక్కడ గాంధీ నగర్ లో ఫీల్డ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న కనికెళ్ల కృష్ణ విదేశాల్లో పనిచేస్తున్న వారికి కూడా హాజరు వేసి ఉపాధి కూలీ డబ్బులు సొమ్ము చేసుకుంటున్నారని, ఆ ఫిర్యాదుల పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో ఉపాధి కూలీలు పనులకు రాకపోయినా వారికి హాజరు వేసి కూలీలకు వచ్చిన సొమ్మును ఫీల్డ్ అసిస్టెంట్లు కూలీలు పంచుకోవడం విస్మయం కలిగిస్తుంది. ఈ తతంగం పలుచోట్ల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఫీల్డ్ అసిస్టెంట్లు ఈ విధానంతో సొమ్ములు చేసుకుంటున్నారు. ఈ వ్యవహారం పై విచారణ నిర్వహించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఎంపీటీసీ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై ఎంపీడీవో కీర్తి స్పందన ను వివరణ కోరగా తనకు ఫిర్యాదు అందిందని దీనిపై విచారణ నిర్వహించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని వివరించారు. ఎప్పటికైనా ఉపాధి హామీ పథకం పనులపై ఏపీవోలు పర్యవేక్షణ నిర్వహించి పారదర్శకంగా పనులు కొనసాగేలా చర్యలు చేపట్టాలని ఫీల్డ్ అసిస్టెంట్లు అక్రమాలపై చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.