నేనిప్పుడు
ఓ చర్చా వస్తువును
ఎప్పుడూ ఏదో ఒక సాకుతో
నాపై వార్త
నాకోసం కాదు !
నా భావాలతో
పని లేకుండా
పనిలేనోళ్ళు నన్ను
నడి బజారులో నిలిపారు.
నా చుట్టూ ఓ అల్లిక
ఆ అల్లికలో వాళ్ళు ఇమిడి
మిగతా వాళ్ళను ఇరికించే యత్నం.
అందరిలా నేనూ పుట్టాను
నా ఎదుగుదల లో వాళ్ళ ప్రమేయం లేదు
నా పుట్టుక తెలియదు
నా తిండి తిప్పలు ఎరుగరు
అయినా నన్ను వదలరు
దొరక్క పోయినా వల వేసి
పన్నుతారు కుట్రలు!!
నేను నేనే
నా రంగు నా పాలిట శాపం
నాపై విసిరే రాళ్లతో
మానసిక శారీరక సంఘర్షణ!
అయినా నోరు మెదపలేను!!
ప్రేమ నేనెరుగు
తల్లీ బిడ్డా ప్రేమ ఎవడూ నేర్పించక్కర్లే!!
నా భావోద్వేగ సంపద నా సొంతం
ఎవరికి పంచాలో
ఎవరితో పొందాలో ప్రకృతి నేర్పింది నాకు!!
సంజ్ఞలు నా సంకేతం.
నా సంతోషం
నా హార్మోన్ల ఉత్పత్తి పై
వాడెవడో ఓ కాగితం పై ఓ వ్రాత ప్రతి జారీ చేస్తే
నేను నా జాతి ని వదిలి
పరజాతి కౌగిల్లో ఒదగాలా?!!
ఆ జాతి కేమో గానీ నాకైతే జలదరింపు.
నన్ను పెంచిన జాతి
నన్నెరుగు
నా ఆలంబన ఎరుగు
వాళ్ళతోనే కడ దాకా!
అవసాన దశలో మనస్ఫూర్తిగా
నా మేను సైతం వాళ్ళ కోసమే!!
నన్ను అవసరార్థం వాడుకుని వదిలేసే వలస జాతి అంటే అసహ్యం నాకు!!
నేను ఆవుని!!
- గిరిప్రసాద్ చెలమల్లు
సెల్ : 9493388201










