Sep 30,2023 22:05
  • విజయవంతంగా ముందుకు సాగుతున్న ఆదిత్య

బెంగళూరు : భూమి గురుత్వాకర్షణ శక్తిని దాటి ఆదిత్య-ఎల్‌ 1 విజయవంతంగా ముందుకు సాగుతోందని ఇప్పటికి 9.2 లక్షల కిలోమీటర్లకు పైగా దూరాన్ని ప్రయాణించిందని ఇస్రో శనివారం తెలిపింది. సూర్యుడు-భూమి లాగ్రాంజ్‌ పాయింట్‌ 1 (ఎల్‌ 1) దిశగా ప్రస్తుతం ఆదిత్య పయనిస్తోందని ఇస్రో ఎక్స్‌లో పేర్కొంది. భూమి గురుత్వాకర్షణ శక్తికి వెలుపలకు ఇస్రో అంతరిక్ష నౌకను పంపడం ఇది రెండవసారి. మొదటిసారి అంగారక గ్రహంపైకి పంపింది. ఆదిత్య-ఎల్‌ 1 డేటాను సేకరిస్తోందని, దీనితో భూమి చుట్టూ గల కణాల ప్రవర్తనను, వాటి వ్యవహార శైలిని శాస్త్రవేత్తలు విశ్లేషించడానికి వీలుంటుందని ఇస్రో గతంలో పేర్కొంది. ఎల్‌ 1 చుట్టూ సేకరించే డేటాతో సౌర పవనాల మూలం, వాటి వేగం, రోదసీ వాతావరణ పరిస్థితులు వంటి అంశాలను పరిశీలించడానికి వెసులుబాటు వుంటుందని ఇస్రో పేర్కొంది. సెప్టెంబరు 2న ఆదిత్యను ఇస్రో ప్రయోగించింది. లాగ్రాంజ్‌ పాయింట్‌ 1 చుట్టూ గల హాలో ఆర్బిట్‌లో ఆదిత్య ఎల్‌ 1ను ప్రవేశపెడుతుంది. ఇది భూమి నుండి సూర్యుని దిశగా 15లక్షల కిలోమీటర్ల దూరంలో వుంటుంది. ఇది సూర్యుని చుట్టూ తిరుగుతూ నిరంతరంగా సూర్యుడిని చూడగలుగుతూ వుంటుంది.