- రాకెట్ లో నాలుగో దశ మరింత కిందికి ఉపగ్రహాలను విడిచిపెట్టిన తర్వాత డిఅర్బిటిoగ్ ఎక్స్పరిమెంట్...
- అంతరిక్ష వ్యర్ధాల నిర్మూలనకే ఈ పరిశోధన
ప్రజాశక్తి-సూళ్లూరుపేట : అంతరిక్ష పరిశోధనలో ఎప్పటికప్పుడు కొత్త తరహా ప్రయోగాలు చేపడుతున్న ఇస్రో మరో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. ఆదివారం ఉదయం జరిగిన పీఎస్ఎల్వీ సి-56 రాకెట్ లో డి ఆర్జిటింగ్ ఎక్స్పరిమెంట్ చేశారు. ఈ రాకెట్ నాలుగో దశ ఉపగ్రహాలను విడిచిపెట్టిన తర్వాత మరింత కిందికి దిగేలా ప్రణాళిక సిద్ధం చేసి ప్రయోగించారు. ఇటీవల అంతరిక్షంలో వ్యర్ధాల సమస్య ప్రపంచ శాస్త్రవేత్తలకు సైతం ఇబ్బంది కలిగిస్తుంది. ఉపగ్రహాలను విడిచిపెట్టిన తర్వాత అదే ప్రాంతంలో నాలుగో దశ పరిభ్రమిస్తుండటం వల్ల లేదా ఒకే చోటే ఉండటం వల్ల ఆ మార్గంలో తిరిగే ఉపగ్రహాలకు అడ్డంగా ఏర్పడుతోంది. ఫలితంగా అంతరిక్షంలోనే కొన్నిసార్లు ఢీకొనడం ఉపగ్రహాల కాల పరిమితి ముందే తీరిపోవడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. దీన్ని కొంత అడ్డుకునేందుకు అంతరిక్ష పరిశోధకులు కొన్ని కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో భాగంగా పిఎస్ఎల్వి సి-56 రాకెట్ నాలుగో దశ పని పూర్తి అయిన తర్వాత కిందికి తీసుకొచ్చి భూమికి ఎటు చూసినా 300 కిలోమీటర్ల దూరంలో చేరేలా పరిశోధన చేశారు. వృత్తాకార కక్షలో ఇది ఆ స్థానంలో పరిభ్రమిస్తుంది. భూమి ఆకర్షణ శక్తికి దగ్గరగా ఉండటం వల్ల కొద్ది రోజులు తిరిగి పడిపోయే అవకాశం కూడా ఉంది. దీనివల్ల ఉపగ్రహాలకు అడ్డంకి లేకుండా ఉంటుందని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. శ్రీహరికోట షార్ నుండి ఆదివారం ఉదయం పిఎస్ఎల్వి సి-56 ద్వారా సింగపూర్ దేశానికి చెందిన ఏడు ఉపగ్రహాలను వారు కోరుకున్న కక్షలోకి చేర్చడం ద్వారా ఇస్రో వాణిజ్య లాభాలను ఆర్జించింది. ఈ ఏడు ఉపగ్రహాల బరువు 442.5 టన్నులు మాత్రమే. తక్కువ బరువు గల ఉపగ్రహాలను ప్రయోగిస్తున్న కారణంగా కోర్ అలాన్ తరహాలో స్ట్రాపాన్లు లేకుండా ఈ రాకెట్ ను నిర్మించి ప్రయోగించారు. కోర్ అలాన్ తరహాలో 17వ ప్రయోగం. ఇందులో సింగపూర్ దేశానికి చెందిన ఏడు ఉపగ్రహాలలో డీఎన్-ఎస్ఆర్ ముఖ్యమైనది. సింగపూర్ లోని ఎస్ టి ఇంజనీరింగ్ వారు దీన్ని రూపొందించారు. అక్కడి స్పేస్ ఏజెన్సీతో కలిసి రూపొందించిన ఈ ఉపగ్రహం రాత్రి పగలు స్పష్టమైన చిత్రాలు తీసి శాస్త్రవేత్తలకు పంపించే సామర్థ్యం కలిగి ఉంది. ఒక మీటరు రిజల్యూషన్ తో ఫోటోలు తీయగలదు. ఈ ఉపగ్రహం సింగపూర్ దేశానికి సుదీర్ఘకాలం సేవలు అందిస్తుందని నమ్ముతున్నారు. ఈ ఉపగ్రహం బరువు 352 కిలోలు కాగా, దీన్ని రాడార్ ఇమేజింగ్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ గా అక్కడ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. భూమి నుంచి 535 కిలోమీటర్ల లోఎర్త్ ఆర్బిట్ లో డి.ఎస్-సార్ తో పాటు మరో ఆరు ఉపగ్రహాలను ఒకే కక్షలో చేర్చారు. ఇందులో నాన్ యంగ్ టెక్నాలజికల్ యూనివర్సిటీ (ఎన్ టి యు) కు చెందిన ఆర్కేడ్, వెలాక్స్ ఏఎం, స్కూబ్- 2 అనే ఉపగ్రహాలు ఉన్నాయి. ఇవి కాకుండా ఎలైనా ప్రైవేట్ లిమిటెడ్ కి చెందిన ఓఆర్బి-12, స్ట్రైడర్, ఎన్ యు ఎస్ కు చెందిన గెలాసియా-2, సింగపూర్ లోని న్యూ స్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ కు చెందిన నులియన్ ఉపగ్రహాలు కూడా ఉన్నాయి.