Oct 28,2023 10:54

ప్రజాశక్తి-నెల్లూరు : హారన్ కొట్టాడని ఆర్టీసీ డ్రైవర్ పై మూకుమ్మడిగా దాడి నెల్లూరు జిల్లాలో వెలుగు చూసింది. రోడ్డుకు అడ్డంగా పెట్టిన టూవీలర్ తీయమని హారన్ కొట్టడంతో కోపానికి వచ్చిన దుండగులు.. ఆర్టీసీ డ్రైవర్ను బస్సు వెనకాల వెంబడించి మరీ అడ్డుకున్నారు. అతనిని బస్సులో నుంచి కిందికి దింపి.. పిడిగుద్దులు, తన్నులతో రెచ్చిపోయారు. విచక్షణారహితంగా దాడి చేశారు. వారి దాడిలో డ్రైవర్ తీవ్ర ఆస్వస్థతకు గురయ్యాడు. రోడ్డుమీద వెడుతున్న వారు దీన్ని ఫోన్లో రికార్డు చేయడానికి ప్రయత్నిస్తే వారి ఫోన్లు కూడా లాక్కున్నారు. ఈ దారుణ ఘటన గురువారం సాయంత్రం నెల్లూరు జిల్లా కావలి పరిధిలోని మద్దూరు పాడు సమీపంలో ఉన్న జాతీయ రహదారిపై జరిగింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. బెంగళూరు నుంచి విజయవాడ వస్తున్న ఏపీ 16జడ్‌ 0702 నంబరు బస్సు గురువారం సాయంత్రం కావలి నుంచి గమ్యస్థానానికి బయలుదేరింది. ట్రంకురోడ్డు మీదుగా వెళుతున్నప్పుడు ఓ ద్విచక్ర వాహనం రోడ్డుకు అడ్డుగా ఉండటంతో బస్సు డ్రైవరు బి.ఆర్‌.సింగ్‌ హారన్‌ మోగించారు. దాంతో ఆ వాహనదారుడు డ్రైవరుతో వాదనకు దిగాడు. ఆ సమయంలో వెనుకవైపు ఆగిన వాహనాలు హారన్‌ మోగించడం, అక్కడే ఉన్న ఒకటో పట్టణ పోలీసులు స్పందించడంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. తర్వాత తన మిత్రులైన దేవరకొండ సుధీర్‌ తదితరులకు సెల్‌ఫోన్‌ ద్వారా విషయం తెలిపాడు. మొత్తం 14 మంది టీఎన్‌ సీ9 1612 నంబరు కారులో ఆర్టీసీ బస్సును వెంబడించి అడ్డుకున్నారు. డ్రైవరును కిందకి దించి దాడికి పాల్పడ్డారు. దాడి విషయం తెలియడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అప్పటికే తీవ్రంగా గాయపడిన డ్రైవర్ ని కావాలి ప్రాంతి ఆసుపత్రికి తరలించారు. ఈ శివారెడ్డి, మల్లి, విల్సన్, కిరణ్, దేవరకొండ సుదీర్లతో పాటు మరో పదిమంది మీద హత్యాయత్నంతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈఘటనపై ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు స్పందించారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కూడా దీనిమీద ఆందోళన వ్యక్తం చేశారు.నిందితులు ఎవరైనా సరే చర్యలు తీసుకోవాలని లేకుంటే ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.