- క్షేమంగా భూమికి తిరిగొచ్చిన వ్యోమగాములు
వాషింగ్టన్ : నాసా వ్యోమగామి ఫ్రాంక్ రూబియో, రష్యా వ్యోమగామి సెర్గే ప్రొకోపీవ్, దిమిత్రి పెటెలిన్‌లు తమ సుదీర్ఘ అంతరిక్ష యాత్రను విజయవంతంగా ముగించుకొని బుధవారం భూమిని చేరారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి సోయుజ్ ఎంఎస్-23 స్పేస్ క్రాఫ్ట్‌లో బయలుదేరిన వీరు కజక్‌స్థాన్‌లో సురక్షితంగా ల్యాండ్ అయ్యారు. ఈ ప్రయాణం 157.4 మిలియన్ మైళ్లు. వాస్తవానికి ఈ మిషన్ ఆరు నెలల్లోనే పూర్తి కావాల్సి ఉంది. అయితే, 2022 డిసెంబరులో రష్యన్ స్పేస్ క్రాఫ్ట్‌లో ఊహించని లీక్ చోటుచేసుకోవడంతో గడువు పొడిగించారు. దాంతో వ్యోమగాములు అంతరిక్షంలో 371 రోజులు గడపాల్సి వచ్చింది. నిర్దేశించిన సమయం కన్నా ఎక్కువ రోజులు అంతరిక్షంలో గడపాలనే విషయం తెలిసినా రూబియో, ప్రొకోపీవ్, దిమిత్రిలు వెనక్కి తగ్గలేదు. సవాళ్లను ఎదుర్కొంటూనే తమ విధులు నిర్వహించారు. వారి అంకితభావం అంతరిక్షంలో మానవ జీవితంపై అవగాహనను మెరుగుపరచడమే కాకుండా.. భవిష్యత్ వ్యోమగాములకు ఓ మార్గదర్శకంగా నిలిచిందని ఖగోళ శాస్త్రవేత్తలు ఆశిస్తున్నారు. అంతకముందు నాసా వ్యోమగామి మార్క్ వాన్ డే హే 355 రోజులు గడిపి రికార్డు సృష్టించారు.