వాషింగ్టన్ : ఖలిస్తాన్ మద్దతుదారుల శాన్‌ఫ్రాన్సిస్కోలోని భారత దౌత్యకార్యాలయంపై దాడికి పాల్పడ్డారు. దౌత్యకార్యాలయానికి నిప్పుపెట్టినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనను అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ తీవ్రంగా ఖండించింది. శనివారం శాన్‌ఫ్రాన్సిస్కోలో భారత కాన్సులేట్‌పై జరిగిన విధ్వంసం, దహన ప్రయత్నాన్ని అమెరికా తీవ్రంగా ఖండిస్తోంది. 'దౌత్యకార్యాలయంపై విధ్వంసానికి పాల్పడటం, దహనం చేయడానికి చేసిన యత్నాలను అమెరికా తీవ్రంగా ఖండిస్తోంది. దౌత్యకార్యాలయాలు, విదేశీ దౌత్యవేత్తలపై హింసకు పాల్పడటం వంటి చర్యలను అమెరికాలో తీవ్ర నేరాలుగా పరిగణిస్తాం'అని అమెరికా విదేశాంగ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ ట్వీట్ చేశారు.
రెండురోజుల క్రితం ఖలిస్తాన్ మద్దతుదారులు శాన్‌ఫ్రాన్సిస్కో దౌత్యకార్యాలయానికి నిప్పంటించారని, అయితే స్థానిక అగ్నిమాపక విభాగం వేగంగా స్పందించి మంటల్ని ఆర్పేసినట్లు తెలిపారు. సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదని అన్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దౌత్య కార్యాలయంపై దాడికి పాల్పడుతున్న దృశ్యాలు ఆ వీడియోలో కనిపిస్తున్నాయి.
ఆ వీడియోలో.. హింస హింసను ప్రేరేపిస్తుందనే వ్యాఖ్యలతో పాటు ఇటీవల కెనడాలో మఅతి చెందిన ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ చీఫ్ హర్‌దీప్ సింగ్ నిజ్జర్‌కు సంబంధించిన వార్తా కథనమూ కనిపించింది. గత నెల కెనడాలోని ఓ గురుద్వారాలో నిజ్జర్‌ను ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపిన సంగతి తెలిసిందే. హర్‌దీప్ నిజ్జర్ జలంధర్‌కు చెందినవాడు. కెనడాకు చెందిన పురాతన ఖలిస్తానీ టెర్రర్ సంస్థల్లో ఒకటైన బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్(బికెఐ)కి ఆర్థిక సహయం అందించినట్లు అతనిపై ఆరోపణలు వున్నాయి. ఇటీవల కెనడాలో ఖలిస్తాన్ మద్దతుదారులు స్వేచ్ఛ ర్యాలీకి పిలుపునిచ్చారు. స్వాతంత్య్ర ర్యాలీకి సంబంధించిన పోస్టర్లలో ఒట్టావాలోని భారత రాయాబారి, టోరంటోలోని కాన్సుల్ జనరల్‌కు బెదిరింపులు కూడా పంపినట్లు సమాచారం.
మార్చిలో కూడా శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత రాయబార కార్యాలయంపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. రెండు నెలల అనంతరం ఈ తాజా ఘటన చోటు చేసుకోవడం గమనార్హం.ఈ వరుస ఘటనలపై సోమవారం భారత విదేశాంగ మంత్రి జై శంకర్ స్పందించారు. భారత్ భాగస్వామ్య దేశాలైన కెనడా, బ్రిటన్, అమెరికాలు ఈ తరహా అతివాద భావజాలానికి తావివ్వకూడదని, అది దేశాల మధ్య సంబంధాలకు మంచిది కాదని వ్యాఖ్యానించారు.