Sep 24,2023 13:08

బీజింగ్  :  ఆసియన్‌ గేమ్స్‌లో భారత క్రీడాకారులు మరో పతకాన్ని చేజిక్కించుకున్నారు. ఇప్పటికే పది మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌, లైట్‌ వెయిట్‌ డబుల్‌ స్కల్స్‌లో సిల్వర్‌ మెడల్‌ సాధించిన క్రీడాకారులు రోయింగ్‌లో మూడో పతకాన్ని సాధించారు. రోయింగ్‌ మెన్స్‌ పెయిర్‌ ఈవెంట్‌లో హాంగ్‌కాంగ్‌ జట్టు (6.44 నిమిషాలతో) బంగారు పతకంతో మొదటిస్థానం సాధించింది. ( 6.48 నిమిషాలతో ) ఉబ్జెకిస్తాన్‌ రజతంతో రెండవస్థానంలో నిలవగా, ( 6.50 నిమిషాలతో) భారత్‌ కాంస్యంతో మూడవ స్థానం సాధించింది.

ఆసియా క్రీడల్లో మహిళల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ టీమ్‌ ఈవెంట్‌లో భారత్‌కు తొలి పతకం లభించింది. రమిత, మొహులీ ఘోష్‌, ఆషి చౌక్సీతో కూడిన మహిళల జట్టు 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ విభాగంలో రజత పతకం సాధించింది. చైనా 1896.6 పాయింట్లతో గోల్డ్‌ మెడల్‌ సాధించగా, 1886 పాయింట్లతో భారత్‌ రెండో స్థానంలో నిలిచింది. ఇక 1880 పాయింట్లతో మంగోలియా జట్టు కాంస్యా పతకం గెలుచుకున్నది. లైట్‌వెయిట్‌ డబుల్‌ స్కల్స్‌లో భారత జట్టు రెండో పతకాన్ని సాధించింది. క్రికెట్‌లో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమ్‌ఇండియా మహిళల జట్టు విజయం దిశగా పయనిస్తోంది.