- పాఠ్య పుస్తకాల్లో మార్పునకు ప్రతిపాదన
- విమర్శల వెల్లువ.. తుది నిర్ణయం తీసుకోలేదన్న ఎన్‌సిఇఆర్‌టి
న్యూఢిల్లీ : ఇండియా-భారత్ వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. పాఠశాల విద్యార్థుల పాఠ్యపుస్తకాల్లో ఇండియాకు బదులుగా భారత్‌ను ఉపయోగించాలన్న ప్రతిపాదన తాజాగా ముందుకు వచ్చింది. సిలబస్ మార్పునకు సంబంధించి జాతీయ విద్యా పరిశోధన, శిక్షణా మండలి (ఎన్‌సిఇఆర్‌టి) ఏర్పాటు చేసిన ఒక ఉన్నతస్థాయి కమిటీ ఈ మేరకు సిఫార్సు చేయడం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒకటవుతున్న ప్రతిపక్షాలు తమ వేదికకు ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇంక్లూజివ్ అలయెన్స్ (ఇండియా) అని పేరు పెట్టుకున్న సంగతి తెలిసిందే. అప్పటినుండి దేశం పేరును భారత్‌గా మార్చడానికి మోడీ సర్కారు ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆర్‌ఎస్‌ఎస్, దాని అనుబంధ సంస్థలు కూడా ఈ దిశలో ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే జి20 శిఖరాగ్ర సమావేశాల్లో ఆహ్వానాలు మొదలుకొని నేమ్‌బోర్డ్స్ వరకూ 'భారత్' పేరును కేంద్రం రుద్దిన విషయం తెలిసిందే. తాజాగా చరిత్రకారుడిగా కన్నా ఆర్‌ఎస్‌ఎస్ సిద్దాంతకర్తగా ఎక్కువ ప్రాచుర్యం పొందిన సిఐ ఐజాక్ నేతృత్వంలో సాంఘిక శాస్త్రానికి సంబంధించి ఎన్‌సిఇఆర్‌టి ఏర్పాటు చేసిన కమిటీ ఈ ప్రతిపాదన చేసింది. ఈ విషయాన్ని స్వయంగా మీడియాకు వెల్లడించారు. 'ఇండియా స్థానంలో భారత్ పదాన్ని ఉపయోగించాలని ప్రతిపాదించాం' అని ఆయన పేర్కొన్నారు. దీంతో పిల్లల మెదళ్లలోనైనా ఇండియాకు బదులుగా భారత్ పేరును బలవంతంగా రుద్దడానికి మోడీ సర్కారు. ఆర్‌ఎస్‌ఎస్ శక్తులు ప్రయత్నిస్తున్నాయన్న విమర్శలు వెల్లువెత్తాయి. ప్రతిపక్షాలు, విద్యావేత్తలు, చరిత్రకారుల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో 'ఇంకా నిర్ణయం తీసుకోలేదని, అందువల్ల ఇప్పుడు స్పందించ డం తొందరపాటు అవుతుంది' అని ఎన్‌సిఇఆర్‌టి స్పందించింది. దీంతో భవిష్య త్తులో ఈ రకమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
- ఇప్పుడే వ్యాఖ్యానించలేం : ఎన్‌సిఇఆర్‌టి
ఇండియా బదులు భారత్ అనే పదాన్నే పాఠ్య పుస్తకాల్లో ఉపయోగించాలన్న ప్రతిపాదనకు సామాజిక శాస్త్రాల కరిక్యులమ్ ప్యానెల్ ఆమోదముద్ర వేసిందన్న కథనాలను ఎన్‌సిఇఆర్‌టి డైరెక్టర్ దినేష్ ప్రసాద్ సక్లాని ఖండించారు. 'అది ఇంకా ప్రతిపాదనల దశలోనే ఉంది. ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. అందువల్ల ఇప్పుడే వ్యాఖ్యానించడం సరికాదు' అని ఆయన పేర్కొన్నారు.
- ఐజాక్ ఏం చెప్పారు?
పాఠ్య పుస్తకాల్లో పాఠశాల విద్యార్థులకు ఇండియా బదులు భారత్ అనే పదాన్నే బోధించాలని కమిటీ ప్రత్యేకంగా సిఫారసు చేసిందని ఐజాక్ తెలిపారు. 'భారత్ అనే పేరును విష్ణు పురాణంలో ప్రస్తావించారు. కాళిదాసు కూడా భారత్ అనే మాటను ఉపయోగించారు. అది పురాతన పేరు. తుర్కులు, ఆఫ్ఘన్లు, గ్రీకుల దాడి తర్వాత ఇండియా అనే పేరు వాడారు. సింధు నది ఆధారంగా వారు భారత్‌ను గుర్తించారు. దీనిని మార్చాలని ప్రతిపాదించాం. 12వ తరగతి వరకూ పాఠ్య పుస్తకాల్లో భారత్ అనే పేరును ఉపయోగించాలని నేను గట్టిగా చెప్పాను. ఇతర సభ్యులు దీనికి అంగీకరించారు. ఇది కమిటీ ఏకగ్రీవ అభిప్రాయం' అని ఆయన తెలిపారు. అలాగే ప్రాచీన చరిత్రను సాంప్రదాయక చరిత్రగా పేర్కొనాలని, హిందూ రాజులు సాధించిన విజయాలను ఎక్కువగా వివరించాలని కూడా సిఫార్సు చేసినట్లు తెలిపారు.
- ఎవరీ ఐజాక్
ఐజాక్ కేంద్ర విద్యా శాఖకు చెందిన భారతీయ చారిత్రక పరిశోధనా మండలిలో సభ్యుడు. కొట్టాయంలోని సిఎంఎస్ కాలేజీలో చరిత్ర విభాగంలో అధ్యాపకుడిగా పనిచేశారు. 1975లో ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ ఎబివిపిలో చేరారు. ప్రస్తుతం ఆర్‌ఎస్‌ఎస్‌తో సంబంధమున్న భారతీయ విచార కేంద్రం కేరళ రాష్ట్ర విభాగం కార్యనిర్వాహక అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. కమిటీ సభ్యుడైన జెఎన్‌యు ప్రొఫెసర్ వందనా మిశ్రా ఎబివిపి మాజీ జాతీయ కార్యదర్శిగా, ఆ సంస్థకు జాతీయ ఉపాధ్యక్షులుగా పనిచేశారు. వివిధ విషయాలకు సంబంధించి పాఠ్యప్రణాళిక స్థితిని సమీక్షించేందుకు 2021లో ఎన్‌సిఇఆర్‌టి ఏర్పాటు చేసిన 25 ఉన్నతస్థాయి కమిటీల్లో ఐజాక్ కమిటీ ఒకటి.