Sep 08,2023 09:55
  • జి 20 సమావేశాల నేపథ్యంలో మోడీ సర్కార్‌ బూటకపు ప్రచారం
  • వాస్తవాలు దాచి గొప్పలు

న్యూఢిల్లీ : జి-20 సదస్సుకు భారత్‌ అతిథ్యం ఇస్తున్న నేపథ్యంలో ఆ సదస్సు గురించి, భారత్‌ సాధించిన ప్రగతి గురించి ప్రభుత్వం ఆర్భాటంగా ప్రచారం చేసుకుంటుంటోంది. మరోపక్క మెజారిటీ భారతీయులు ఎదుర్కొంటున్న జీవన పోరాటాలను బయటి ప్రపంచానికి తెలియనీయకుండా కప్పిపుచ్చేందుకు అధికారులు ప్రమాదకరమైన ఎత్తుగడలను అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు.
          జి-20 సదస్సు గురించి ప్రచారం చేస్తూ రాజధాని ఢిల్లీ నగర వీధుల్లో ఎక్కడ చూసినా పెద్ద పెద్ద వాణిజ్య ప్రకటనల బోర్డులు కనిపిస్తున్నాయి. కానీ ఆ బిల్‌ బోర్డుల వెనుక గల మురికివాడల్లోని ప్రజలు, వారి జీవితాల గురించి ఎవరికీ పట్టడం లేదు. వారి జీవనోపాధికి కీలకమైన రోడ్డు పక్కన గల వారి దుకాణాలు, స్టాళ్ళు అన్నింటినీ ఈ సదస్సు పేరు చెప్పుకుని ధ్వంసం చేసేశారు. లేనిపక్షంలో కొత్తగా ఆవిర్భవిస్తున్న భారతదేశం అంటూ ప్రధాని నరేంద్ర మోడీ అంతర్జాతీయంగా అత్యంత జాగ్రత్తగా పెంచి పోషించుకుంటూ వస్తున్న పేరు ప్రతిష్టలకు కళంకం కలుగుతుంది.
           భారత్‌ను ఒక బ్రాండ్‌గా చూపించే ప్రక్రియలో భాగంగా దేశ జిడిపి గణాంకాలను కూడా ఆ బిల్‌బోర్డుల్లో ప్రదర్శిస్తున్నారు. ఈ ఏడాది రెండో త్రైమాసికంలో వార్షిక వృద్ధి రేటు 7.8 శాతంతో భారత్‌ అత్యంత వేగంగా ఆవిర్భవిస్తున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా కనిపిస్తోంది. కానీ, బిల్‌బోర్డుల వెనుక పెద్ద ఎత్తున ప్రజలు జరుపుతున్న పోరాటాలు, ఉద్యమాలు వున్నాయి. నిజానికి, అభివృద్ధి చాలా తక్కువగా వుంది. అసమానతలు పెరుగుతున్నాయి. ఉపాధి కొరత తీవ్ర స్థాయిలో వుంది. వీటి గురించిన సమాచారాన్ని తొక్కిపట్టేందుకు అధికార యంత్రాంగం తీవ్రంగా శ్రమిస్తోంది.
భారత జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్‌ఎస్‌ఓ) తాజా నివేదిక ప్రకారం ఏప్రిల్‌-జూన్‌లో ఉత్పత్తి రంగ ఆదాయం వార్షికంగా 7.8 శాతం పెరిగినట్లు చూపించింది. కానీ అదే సమయంలో వ్యయం మాత్రం కేవలం 1.4 శాతమే పెరిగింది. ఈ రెండు రకాల లెక్కలను గణించడంలో బహుశా చాలా పొరపాట్లు వుండి వుంటాయి. అయినా, ఇక్కడ మనం గమనించాల్సిన అంశమేమంటే ఆదాయ వ్యయాలు రెండూ సమానంగా వుండాలన్నది అంతర్జాతీయంగా అనుసరించే అత్యుత్తమ సూత్రం. కానీ ఇక్కడ ఆదాయం ఎక్కువుంది, ఖర్చు తక్కువుంది. అంటే మెజారిటీ సంఖ్యలో భారతీయులు ఇబ్బందులు పడుతున్న సమయంలో, భారతీయ ఉత్పత్తులకు విదేశాల్లో పరిమితమైన డిమాండ్‌ మాత్రమే వున్న సమయంలో ఖర్చులో లోటు కనిపిస్తోంది, కానీ దాన్ని కప్పిపుచ్చడానికి ఎన్‌ఎస్‌ఓ ప్రయత్నిస్తోంది. ఆదాయ వ్యయాలను కలిపితేనే దేశ ఆర్థిక వ్యవస్థను అంచనా వేయగలుగుతాం.అదే సరైన పద్ధతి.
           2019లో భారత్‌ జిడిపి వృద్ధిరేటు 3.5 శాతంగా వుంది. కోవిడ్‌ కారణంతో వృద్ధి రేటు ఇంకా తగ్గింది. అప్పటి నుండి పురోగతి మందగించింది. ఈ విషయాన్ని తాజా డేటా ధృవీకరించడమే కాకుండా, దీనికి గల కారణాలేంటో కూడా పేర్కొంటోంది. ఉపాధికి పట్టుగొమ్మ అయిన తయారీ రంగం బాగా బలహీనపడిపోయింది. దశాబ్దాల తరబడి నిరాశాజనకమైన అభివృద్ధిని నమోదు చేస్తూ వచ్చిన ఈ రంగం కోవిడ్‌ అనంతర కాలంలో కూడా పుంజుకోలేదు. కొరుకుడు పడని ఈ వాస్తవాలన్నింటినీ కొట్టిపారేయడానికే కేంద్రం చూస్తోంది. మందగించిన అభివృద్ధి, పెరుగుత్ను అసమానతలు, పేలవమైన ఉపాధి అవకాశాలు వీటన్నింటినీ కప్పిపుచ్చేందుకు జాతీయ గణాంకాలను మోసపూరితంగా ప్రచారం చేస్తున్నారు. వారు భారతదేశానికి నిర్దేశించిన పంథాను గుర్తించి, పున:పరిశీలించుకోవడం మంచిది.

Development-Path-India




                                                                           బాధాకరం : ఏచూరి

న్యూఢిల్లీ : విశ్వవేదికలపై గొప్పలు చెప్పుకునేందుకు దేశం గురించి తప్పుడు సమాచారంతో, గణాంకాలతో మోడీ సర్కార్‌ వండివారుస్తున్న కథనాలు, ప్రచార ఆర్బాటాలు భారత ప్రతిష్టను దిగజార్చుతున్నాయని సిపిఎం ప్రధానకార్యదర్శి సీతారాం ఏచూరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది చాలా బాధాకరమని ఆయన వ్యాఖ్యానించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. మోడీ ప్రభుత్వం చెబుతున్నదంతా 'నకిలీ అభివృద్ధి' అంటూ అంతర్జాతీయ మీడియా ప్రచురించిన కథనాలను ఏచూరి తన పోస్టుకు జత చేశారు. కార్పొరేట్‌ కంపెనీలకు సర్వం దోచిపెడుతూ, సామాన్య ప్రజానీకంపై భారాలు మోపుతున్న నేపథ్యంలో దేశంలో పెరిగిపోతున్న ఆర్థిక, సామాజిక అసమానతలను, నిరుద్యోగితను, అంతకంతకూ దిగజారిపోతున్న జిడిపి గణాంకాలను మార్పులు చేసిన గొప్పగా చెప్పినంతనే అభివృద్ధి జరిగిపోతుందా అని ఆయన ప్రశ్నించారు. భారత ప్రతిష్ట పెరగాలంటే కావాల్సింది తప్పుడు లెక్కలు కాదని, సమతుల్య అభివృద్ధి అని ఆయన హితవు పలికారు.