
ఈ చారిత్రక పోరాటానికి...వర్గ దోపిడి, సామాజిక అణచివేత నుండి విముక్తి చెంది, మరింత మెరుగైన జీవితం కావాలన్న ప్రజల ఆకాంక్షలకు...దేశాన్ని పాలిస్తున్న నియంతృత్వ-హిందూత్వ ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకంగా వుంది. ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సామాజిక, ఆర్థిక న్యాయానికి విలువనిచ్చే అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, పౌర గ్రూపులు హిందూత్వ-కార్పొరేట్ ప్రభుత్వంతో పోరాడేందుకు సమైక్యంగా వుండేందుకు అన్ని ప్రయత్నాలు చేయాలి. అప్పుడే స్వాతంత్య్రోద్యమ విముక్తి లక్ష్యాలను ముందుకు తీసుకెళ్ళగలుగుతాం.
ఆధునిక కాలంలో ఒక స్వతంత్ర దేశం సాధించిన పురోగతిని అంచనా వేయడానికి ఏడున్నర దశాబ్దాల సుదీర్ఘ కాలం సరిగ్గా సరిపోతుంది. భారతదేశం స్వాతంత్య్రం సాధించి 75 ఏళ్ళు అవుతున్న సందర్భాన్ని మనం సంబరంగా జరుపుకుంటున్నపుడు, ఈనాడు దేశం ఎక్కడ నిలిచింది, మనం ఏ దిశగా సాగుతున్నాం అన్న విషయాలను ఒకసారి పరిశీలించుకునే సందర్భం కూడా ఇదే అవుతుంది.
భారతదేశం 1947లో స్వాతంత్య్రాన్ని సముపార్జించడం, రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ప్రారంభమైన వలసవాద నిర్మూలన క్రమంలో మొదటి చారిత్రక మైలురాయి. అత్యంత దుర్భరమైన దారిద్య్రం నెలకొన్న, వ్యాధులతో కునారిల్లుతున్న, నిరక్షరాస్యులైన ప్రజలతో నిండిన ఒక దేశంలో ఆధునిక పెట్టుబడిదారీ వ్యవస్థను నిర్మించాలని భారతదేశంలో అధికారంలోకి వచ్చిన కొత్త పాలక వర్గాలు భావించాయి. రెండు శతాబ్దాల పాటు సాగిన వలస పాలనతో దేశం మొత్తంగా కుంగుబాటుకు గురైంది. అభివృద్ధి వెనుకపట్టు పట్టింది. స్వాతంత్య్రానికి ముందు అర్ధ శతాబ్దంలో వ్యవసాయ జనాభా తలసరి ఆదాయం పూర్తిగా క్షీణించింది.
1950లో రాజ్యాంగాన్ని ఆమోదించడం, పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను ఏర్పాటు చేయడం స్వతంత్ర భారతదేశం సాధించిన ముఖ్యమైన విజయం. స్వాతంత్య్రం సాధించిన తర్వాత తొలి నాళ్ళలో, ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ప్రభుత్వ విధానానికి ఒక పరీక్షను నిర్దేశించారు. ''భారత ప్రజలకు మంచి జరగాలన్నది మొదటి అంశం. ఆ ప్రామాణికతతోనే ప్రతీదాన్ని పరిశీలించడం జరుగుతుంది. భారతదేశంలోని లక్షలాదిమంది ప్రజలు ఎలా లబ్ధిని లేదా ప్రయోజనాన్ని పొందుతున్నారు? అనేది ఏ విధానానికైనా (అది ఆర్థిక, రాజకీయ లేదా మరే విధానమైనా సరే) వాస్తవిక పరీక్షగా వుంటుంది. అటువంటిదానితో మనం ముందుకు వెళ్లవచ్చు.'' అయితే ఈ దార్శనికత చాలా నిజాయితీగా, కాలానుగుణ్యంగా వున్నప్పటికీ, పెట్టుబడిదారీవాదాన్ని అభివృద్ధిపరిచే వర్గ వాస్తవికతలపై స్థాపించబడింది. మొదటగా, సామాజికంగా న్యాయబద్ధమైన ఆర్థిక వ్యవస్థను సృష్టించే అవకాశాలను నిర్వీర్యం చేసే భూ సంస్కరణలు అమలు చేయడం ద్వారా వ్యవసాయ సంబంధాల్లో సమగ్రమైన ప్రజాస్వామ్య పరివర్తనను చేపట్టడంలో విఫలమయ్యాం.
దశాబ్దాల కాలంలో, పెట్టుబడిదారీ అభివృద్ధి పంథా గుత్తాధిపత్యానికి, అసమానతల పెరుగుదలకు దారితీసింది. నయా ఉదారవాద విధానాలకు మారడంతో, మూడు దశాబ్దాల క్రితం వరుసగా వచ్చిన ప్రభుత్వాలు సంపన్నులను మరింత సంపన్నులుగా తయారు చేసే అభివృద్ధి పంథాను పెంచి పోషిస్తూ వచ్చాయి. బడా బూర్జువా సంస్థలకు, వారితో కుమ్మక్కైన - అంతర్జాతీయ ఆర్థిక పెట్టుబడిదారులకు అనుకూలంగా లొంగి వుండేటువంటి విధానాల రూపకల్పన పెరుగుతూ వచ్చింది.
మోడీ ప్రభుత్వం గత ఎనిమిదేళ్ళ కాలంలో నయా ఉదారవాద విధానాలను దూకుడుగా అమలు చేసింది. దీనివల్ల పరిస్థితులు మరింత అధ్వాన్నంగా మారాయి. 2011లో కేవలం 55 మందిగా వున్న శత కోటీశ్వరుల సంఖ్య 2021లో 140కి పెరిగింది. వీరి ఆస్తుల మొత్తం విలువ 59,600 కోట్ల డాలర్లకు చేరింది. ఇది జిడిపిలో 19.6 శాతంగా వుంది. పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ అత్యవసరాలు, నిర్దిష్ట కాలపరిమితులకు ఎన్నికయ్యే పాలక పక్ష పార్టీలు, ప్రజా ఉద్యమాలు, పోరాటాలతో తలెత్తే ఒత్తిళ్ళు కారణంగా కొన్ని సంక్షేమ చర్యలు, దారిద్య్ర నిర్మూలనా కార్యక్రమాలు రూపొందాయి. ప్రజా పంపిణీ వ్యవస్థ ఏర్పాటు వంటి చర్యల వల్ల ప్రజలకు కొంత పరిమితమైన ఉపశమనం కలిగింది. బూర్జువా భూస్వామ్య వర్గాల ప్రయోజనాల కోసం మొత్తంగా ప్రజల సంక్షేమం పణంగా పెట్టబడింది.
ఫలితంగా, 75 ఏళ్ళ తర్వాత, బాలల పోషకాహారం విషయంలో భారత్ ఇప్పటికీ అత్యంత అధ్వాన్నమైన రికార్డును కలిగివుంది. ఐదేళ్ళ లోపు వయస్సు కలిగిన 35.5 శాతం మంది చిన్నారులు పోషకాహారం లేక కుంగిపోతున్నారు. ప్రపంచంలోనే మహిళలు, పిల్లల్లో రక్త హీనత అధికంగా నెలకొన్నది భారత్‌లోనే.
ప్రజారోగ్య వ్యవస్థ, ప్రభుత్వ విద్యా వ్యవస్థల్లో అభివృద్ధి, విస్తరణకు సంబంధించి కుట్రపూరితమైన వైఫల్యం నెలకొంది. 75 ఏళ్ళ స్వాతంత్య్రం తర్వాత కూడా, ప్రజారోగ్యంపై పెట్టే ఖర్చు జిడిపిలో కేవలం ఒకే ఒక్క శాతంగా వుంది. ఇదొక కుంభకోణం. ప్రపంచంలోనే చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ మనదేనంటూ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోంది. కానీ, 2021 సంవత్సరానికి మానవాభివృద్ధి సూచికకు సంబంధించిన నివేదికలో భారత్ స్థానం 188 దేశాల్లో 131గా వుంది.
ఆర్థిక, సామాజిక ప్రజాస్వామ్యం లేకుండా రాజకీయ ప్రజాస్వామ్యం సఫలీకృతం కాలేదంటూ రాజ్యాంగం తుది ముసాయిదాను ఆమోదించిన సమయంలోనే 1949లో రాజ్యాంగ నిర్ణాయక అసెంబ్లీలో డాక్టర్ అంబేద్కర్ హెచ్చరించారు. అది నిజమవుతోంది. నయా ఉదారవాద వ్యవస్థలో, ఆర్థిక, సామాజిక న్యాయం దారుణంగా తిరస్కరించబడుతోంది. రాజకీయ ప్రజాస్వామ్యం కూడా వక్రీకరించబడుతోంది. ఎదురు దెబ్బలు తగులుతున్నాయి.
మోడీ ప్రభుత్వ పాలన, హిందూత్వ-కార్పొరేట్ కూటమిని ఉదహరిస్తుంది. ఎన్నికల ప్రజాస్వామ్యం వక్రీకరించ బడుతుండడాన్ని మనం చూస్తున్నాం. బడా కార్పొరేట్ సొమ్ము రాజకీయ వ్యవస్థను కాలుష్యం చేస్తోంది. ఎన్నికల బాండ్లు అనేవి పాలక పార్టీకి కార్పొరేట్ నిధులను అందించే ఒక కొత్త వేదికగా మారాయి. ఏక పార్టీ పాలన కోసం జరుగుతున్న ప్రయత్నాలు ప్రతిపక్ష పార్టీలపై, ప్రతిపక్షాల పాలిత రాష్ట్రాలపై తీవ్రమైన దాడికి దారి తీస్తున్నాయి. అన్ని రంగాల్లోని వ్యతిరేకతను, అసమ్మతిని అణచివేయడానికి యుఎపిఎ, పిఎంఎల్‌ఎ వంటి నిరంకుశ చట్టాలను ఉపయోగించడం పూర్తి స్థాయి నియంతృత్వానికి హాల్‌మార్క్‌గా మారిపోతోంది. రాజ్యాంగం పరిధిలోని ఏ సంస్థలు కూడా ఇటువంటి విధ్వంసకర దాడులకు మినహాయింపు కావు. స్వాతంత్య్రో ద్యమం ద్వారా ప్రజలు సాధించిందీ, రాజ్యాంగంలో పొందుపరచబడిన విలువలు అన్నీ కూడా తీవ్ర దిగ్బంధాన్ని ఎదుర్కొంటున్నాయి. ప్రభుత్వం ద్వారా హిందూత్వ సిద్ధాంతాన్ని బలవంతంగా రుద్దడం, మైనారిటీలను లక్ష్యంగా చేసుకోవడం వల్ల లౌకికవాదం, ప్రజాస్వామ్యం రెండూ తీవ్రంగా దెబ్బ తింటున్నాయి.
స్వాతంత్య్రోద్యమానికి దూరంగా వున్న సంస్థ నేతలు ఇప్పుడు స్వాతంత్య్రోద్యమ 75వ వార్షికోత్సవానికి అధ్యక్షత వహించడం తీవ్ర విచారకరం. ఆనాడు దేశ స్వాతంత్య్రం కోసం సాగిన పోరాటంలో భాగస్వామ్యం కావడానికి ఆర్‌ఎస్‌ఎస్ తిరస్కరించింది. హిందువులు, ముస్లిములు, అన్ని జాతులకు చెందిన ప్రజలు, వర్గాలు స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొంటే ఆ ఐక్య ఉద్యమంతో సంబంధం పెట్టుకోవాలని ఆర్‌ఎస్‌ఎస్ భావించలేదు. అయితే ఇప్పుడు, పాలక పార్టీగా, బిజెపి-ఆర్‌ఎస్‌ఎస్ స్వాతంత్య్రోద్యమానికి సరైన వారసత్వాన్ని కోరుకుంటున్నాయి. రాజ్యాంగంలో పొందుపరచబడిన లౌకికవాదం, ప్రజాస్వామ్యం, బహుళవాదం వంటి స్వాతంత్య్ర ఉద్యమ వాస్తవ విలువలను విస్మరించే రీతిలో వారు వ్యవహరిస్తున్నారు. ఆ రకంగా, 75 ఏళ్ళ ముంగిట వున్న భారత్ ప్రతికూల విప్లవాన్ని ఎదుర్కొంటోంది. భారత స్వాతంత్య్రంలో, రాజ్యాంగంలో అంతర్లీనంగా వున్న, విలువైన ప్రతీదాన్నీ ఆర్‌ఎస్‌ఎస్ భావజాలానికి అనుగుణంగా మార్చాలని లేదా పునర్నిర్మించడానికి వారు ప్రయత్నిస్తున్నారు.
నరేంద్ర మోడీ మాట్లాడుతున్న నూతన భారతం నిజంగానే కొత్తది. ప్రజాస్వామ్యం రాన్రాను నిరంకుశత్వంగా మారుతోంది. సెక్యులరిజం మెజారిటీవాదానికి దారితీస్తోంది. 'ఒక నేత, ఒక దేశం, ఒక భాష, ఒక సంస్కృతి' వంటి ఆర్‌ఎస్‌ఎస్ ఫాసిస్ట్ తరహా నినాదాన్ని సమాజంలో పాతుకుపోయేలా చేయాలని చూస్తున్నారు.
బ్రిటీష్ పాలనను సవాలు చేయడానికి లక్షలాదిమంది సామాన్య ప్రజానీకం-పురుషులు, మహిళలు-స్వాతంత్య్ర ఉద్యమంలోకి దూకారు. ఈ పోరాటంలో వేలాదిమంది ప్రాణాలను పోగొట్టుకున్నారు. ఆధునిక చరిత్రలో అతి పెద్ద ప్రజా ఉద్యమాల్లో ఒకటైన ఈ మహా ఉద్యమంతో భారత్‌కు స్వాతంత్య్రం లభించింది.
ఈ చారిత్రక పోరాటానికి...వర్గ దోపిడి, సామాజిక అణచివేత నుండి విముక్తి చెంది, మరింత మెరుగైన జీవితం కావాలన్న ప్రజల ఆకాంక్షలకు...దేశాన్ని పాలిస్తున్న నియంతృత్వ-హిందూత్వ ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకంగా వుంది. ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సామాజిక, ఆర్థిక న్యాయానికి విలువనిచ్చే అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, పౌర గ్రూపులు హిందూత్వ-కార్పొరేట్ ప్రభుత్వంతో పోరాడేందుకు సమైక్యంగా వుండేందుకు అన్ని ప్రయత్నాలు చేయాలి. అప్పుడే స్వాతంత్య్రోద్యమ విముక్తి లక్ష్యాలను ముందుకు తీసుకెళ్ళగలుగుతాం.
/ 'పీపుల్స్ డెమోక్రసీ' సంపాదకీయం /