
గాంధీనగర్ : అత్యాచార నిందితుల పట్ల గుజరాత్‌లోని బిజెపి ప్రభుత్వం తన ఉదారతను చాటుకుంది. జీవిత ఖైదు (జీవించి ఉన్నంతవరకు ఖైదు) విధించిన 11 మంది అత్యాచార దోషులను విడుదల చేసింది. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా ఖైదీల విడుదలకు సంబంధించి మోడీ ప్రభుత్వం పలు రాష్ట్రాలకు మార్గదర్శకాలను విడుదల చేసింది. అయితే ఈ పాలసీ కింద అత్యాచార బాధితులకు, జీవిత ఖైదు విధించిన వారిని జైలు నుండి విడుదల చేసేందుకు అవకాశం లేదు. అయినప్పటికీ గుజరాత్ ప్రభుత్వం ఈ 11 మందిని జాబితాలో చేర్చడం గమనార్హం.
2002 గుజరాత్ మారణహోమంలో గర్భిణీ అయిన బిల్కిస్ బానోపై అత్యాచారానికి పాల్పడటంతో పాటు వారి కుటుంబాన్ని హత్య చేసిన ఘటన దేశవ్యాప్తంగా వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఆ కేసులో దోషులైన 11 మందిని విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గుజరాత్ ప్రభుత్వం తన సొంత మార్గదర్శకాలను అనుసరించింది. హోం మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న కేంద్రం మార్గదర్శకాల్లోని 4వ పేజీ, పాయింట్ 5లో జీవిత ఖైదు విధించిన వారిని విడుదల చేయకూడదని స్పష్టంగా పేర్కొంది. అయినప్పటికీ ప్రభుత్వం ఈ నిబంధనలను పక్కన పెట్టి వారిని విడుదల చేసింది.
2002 గోద్రా అనంతర నరమేధంలో భాగంగా బిల్కిస్ బానో సామూహిక అత్యాచారం కేసులో దోషులకు గుజరాత్ ప్రభుత్వం క్షమాభిక్ష ప్రసాదిండంపై సర్వత్రా విమర్శలు వెలువెత్తుతున్నాయి. గుజరాత్ ప్రభుత్వ నిర్ణయంపై విపక్షాలు మండిపడుతున్నాయి. క్రూరమైన దోషులను ఎలా విడిచిపెట్టారంటూ ఆక్షేపిస్తున్నాయి. క్షమాభిక్ష ద్వారా రేపిస్టులను విడుదల చేసిన గుజరాత్ మిగతావారికి ఆదర్శంగా నిలుస్తోందంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించాయి. దోషుల విడుదలపై బిల్కిస్ బానో కుటుంబం సైతం విచారం వ్యక్తం చేసింది. అత్యాచారం, హత్య కేసుల్లో జీవిత ఖైదు పడిన 11మందిని గుజరాత్ ప్రభుత్వం ఎలా విడుదల చేసిందో అర్థం కావడం లేదంటూ ఆమె భర్త యాకుబ్ రసూల్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. టీవీలో వార్తలు చూసిన తర్వాతే ఈ విషయం మాకు తెలిసిందన్నారు. 'ఖైదీలు తమ దరఖాస్తును ఎప్పుడు ప్రాసెస్ చేశారో, రాష్ట్ర ప్రభుత్వం ఏ లెక్కన దాన్ని పరిగణనలోకి తీసుకుందో అర్థం కావడం లేదు' అని రసూల్ తెలిపారు. 'మా కుమార్తె సహా, ఆ దాడిలో చనిపోయిన వారిని ప్రతిరోజు గుర్తుచేసుకుంటున్నాం. అల్లర్లలో మతిచెందినవారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాం' అని అన్నారు.