- ఆర్థిక సమస్యలే కారణమని అనుమానం
అహ్మదాబాద్ : బిజెపి పాలిత గుజరాత్‌లోని సూరత్‌లో ఘోరం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు ఆత్మహత్య చేసుకున్నారు. వీరిలో ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. ఆర్థిక సమస్యల వల్ల ఈ కఠిన నిర్ణయం తీసుకుని ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ ఇంట్లో సూసైడ్ నోట్ లభించినట్లు వారు తెలిపారు. సూరత్‌లోని అడాజన్ ప్రాంతంలోని అపార్ట్‌మెంట్ ప్లాట్ నుంచి శనివారం ఉదయం దుర్వాసన రావడాన్ని స్థానికులు గమనించి డోర్ తట్టి, బెల్ మోగించినప్పటికీ ఎవరూ స్పందించకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు.
వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు ఇంటి తలుపును పగులగొట్టి లోనికి వెళ్లి చూశారు. అందులో నివసిస్తున్న కుటుంబం సామూహిక ఆత్మహత్యకు పాల్పడినట్లు గ్రహించారు. మృతులను మనీష్ సోలంకి (35), ఆయన భార్య రీటా(32), పిల్లలు దిశ (7), కావ్య (5), ఖుషాల్ (3), మనీష్ తల్లిదండ్రులు కాంతిలాల్ సోలంకి (65), శోభన (60)గా గుర్తించారు. కుటుంబంలోని ఆరుగురు వ్యక్తులు విషం తాగి చనిపోగా, మనీష్ ఉరి వేసుకున్నారని పోలీసులు తెలిపారు. ఆర్థిక సమస్యల వల్ల ఆత్మహత్య చేసుకున్నట్లుగా రాసి ఉన్న నోట్, విషం బాటిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. మనీష్ ఫర్నీచర్ వ్యాపారం చేస్తూ కాంట్రాక్టరుగా పనిచేస్తున్నారు. ఆయనకు ఇదే అపార్ట్‌మెంట్ బిల్డింగ్‌లో నాలుగు ప్లాట్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. చాలా కాలంగా కుటుంబంతో కలిసి ఉంటున్న అతడు చాలా మందికి డబ్బులు అప్పుగా ఇచ్చినట్లు చెప్పారు. దీపావళి పండగ సమీపిస్తున్నందున డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశాడని, వారు ఇవ్వకపోవడంతో తన కుటుంబ సభ్యులకు విషం ఇచ్చిన తర్వాత ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు వివరించారు. అయితే ఆ కుటుంబ సామూహిక ఆత్మహత్యకు కారణం ఏమిటన్నదానిపై వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.