Aug 22,2022 21:34
  • స్వాతంత్య్ర ఫలాలు అందలేదన్న ఆవేదన ప్రజల్లో ఉంది
  • స్వతంత్య్ర భారత వజ్రోత్సవాల ముగింపు వేడుకల్లో సిఎం కెసిఆర్‌

ప్రజాశక్తి-హైదరాబాద్‌ బ్యూరో : అణగారిన వర్గాల అభ్యున్నతిని విస్మరించి దేశాన్ని ఉన్మాద స్థితిలోకి నెట్టేందుకు కుట్రలు జరుగుతున్నాయని ముఖ్యమంత్రి కెసిఆర్‌ విమర్శించారు. స్వాతంత్య్ర ఫలాలు అందడంలేదని దేశంలో అనేక వర్గాల ప్రజలు ఇప్పటికీ ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. పేదల ఆశలు నెరవేరని పరిస్థితులు ఉన్నాయన్నారు. దేశంలో ప్రస్తుతం దుర్మార్గ పరిస్థితులు నెలకొన్నాయని, అర్థమై కూడా అర్థం కానట్టు ప్రవర్తించడం మేధావుల లక్షణం కాదని పేర్కొన్నారు. ఉన్నాద కుట్రలపై మౌనం దేశానికి మంచిది కాదన్నారు. ఏ సమాజాన్ని అయితే పెద్దలు సక్రమమైన మార్గంలో నడిపిస్తారో, ఆ సమాజం గొప్పగా పురోగమించేందుకు వీలుంటుందని తెలిపారు. హైదరాబాద్‌లోని ఎల్‌బి స్టేడియంలో సోమవారం జరిగిన స్వతంత్య్ర భారత వజ్రోత్సవాల ముగింపు వేడుకల్లో ఆయన అతిథిగా పాల్గన్నారు. జాతిపిత మహాత్మాగాంధీకి పుష్పాంజలి ఘటించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ అద్భుతమైన వనరులు ఉన్న భారతదేశం అనుకున్న విధంగా పురోగమించడం లేదన్నారు. స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తితో కులం, మతం, జాతి, పేద, ధనిక తేడా లేకుండా అందరినీ కలుపుకొని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత నేటి తరంపై ఉందని తెలిపారు. అహింసా మార్గం ద్వారా ఎంతటి శక్తిమంతులనైనా జయించవచ్చని ప్రపంచ మానవాళికి సందేశమిచ్చిన మహాత్మా గాంధీ పుట్టిన దేశంలో ఆయన గురించి నేటి తరానికి తెలియాల్సిన అవసరం ఉందన్నారు. కొందరు అల్పులు గాంధీ గురించి నీచంగా మాట్లాడుతున్నారని, ఇది సరికాదని తెలిపారు. ఐక్యరాజ్య సమితి కూడా మహాత్ముడిని కీర్తించిందని, అనేక దేశాల్లో ఆయన విగ్రహాలు నెలకొల్పి కార్యక్రమాలు చేయడం భారత దేశానికే గర్వకారణమని అన్నారు. దేశానికి స్వాతంత్య్రం ఊరికే రాలేదని, ఎన్నో అమూల్యమైన త్యాగాలు, బలిదానాలు జరిగితేనే సిద్ధించిందని తెలిపారు. స్వాతంత్య్రోద్యమంలో అసువులు బాసిన అమరులకు కెసిఆర్‌ జోహార్లు, నివాళులు అర్పించారు. తెలంగాణ గడ్డపై స్వాతంత్య్రోద్యమ జ్వాలను రగిలించిన ప్రముఖుల వారసులను ముఖ్యమంత్రి సన్మానించారు. సురవరం ప్రతాపరెడ్డి మనువడు అనిల్‌కుమార్‌ రెడ్డి, భాగ్యరెడ్డి వర్మ మనువడు అజరు గౌతమ్‌, కొమరం భీం వారసులు సూర్యారావు, భూదాన్‌ రామచంద్రారెడ్డి మనువడు అరవింద్‌ రెడ్డి, రావెళ్ల వెంకట్రామారావు తనయుడు మాధవరావు, కల్నల్‌ సంతోష్‌ బాబు తండ్రి ఉపేందర్‌, కామన్వెల్త్‌ క్రీడల్లో పతకాలు సాధించిన నిఖత్‌ జరీన్‌, ఆకుల శ్రీజ, వనజీవి రామయ్య, శంకర్‌ మహదేవన్‌, దీపికా రెడ్డి, వైష్ణవి, కవ్వాలీ కళాకారులు వార్సీ బ్రదర్స్‌ను సిఎం శాలువా కప్పి సన్మానించి జ్ఞాపిక అందజేశారు. వేడుక ప్రారంభంలో శంకర్‌ మహదేవన్‌ బృందం సంగీత విభావరి, కవ్వాలీ కచేరీ, కళాకారుల ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి.