Oct 26,2023 16:09

అచ్చంపేట: తెలంగాణ కోసం తాను పోరాడుతున్నప్పుడు ఈ నేతలంతా ఎవరి కాళ్లదగ్గర ఉన్నారో తెలియదని, ఇప్పుడు దేశానికి దిక్సూచిగా నిలిచేలా తెలంగాణ ఎదిగిందని బిఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ అన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా అచ్చంపేటలో నిర్వహించిన బిఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్‌ పాల్గోని ప్రసంగించారు. పాలమూరు ప్రజలు బొంబాయికి వలస పోయినప్పుడు ఎవరైనా వచ్చారా? అని ప్రశ్నించారు. పాలమూరు జిల్లాలో గతంలో గంజి, అంబలి కేంద్రాలు ఉండేవని, పదేళ్ల క్రితం తెలంగాణ ఎలా ఉండేదో ప్రజలు గుర్తు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.''తెలంగాణ కోసం 24 ఏళ్ల క్రితం ఒంటరిగా ప్రయాణం ప్రారంభించా. నా పోరాటంలో నిజాయితీ ఉంది కాబట్టే.. విజయవంతం అయ్యాను. సరిపడా కరెంటు లేక, తాగునీరు, సాగునీరు లేక ఎన్నో కష్టాలు పడ్డాం. ఇవాళ దేశం మొత్తంలో 24గంటల కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఇప్పుడు దేశానికి దిక్సూచిగా నిలిచేలా తెలంగాణ ఎదిగింది. ఇంటింటికీ నల్లా నీరు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. కొండగల్‌ రా.. గాంధీ బమ్మ దగ్గరకు రా.. అని కొందరు నాకు సవాలు విసరుతున్నారు. కేసీఆర్‌ దమ్ము ఏంటో దేశమంతా చూసింది.. కొత్తగా చూపాల్సిన అవసరం లేదు.తెలంగాణ ప్రయాణం పదో సంవత్సరంలో ఎన్నికలు వచ్చాయి. రాష్ట్రం కోసం నావంతు పోరాటం అయిపోయింది.. ఇక చేయాల్సింది ప్రజలే. 60లక్షల టన్నుల ధాన్యం పండే తెలంగాణ.. ఇవాళ 3కోట్ల టన్నుల ధాన్యం పండిస్తోంది. 24 గంటల కరెంటు ఇస్తే.. కాంగ్రెస్‌ను వీడి టిఆర్‌ఎస్‌ కండువా కప్పుకొంటానని జానారెడ్డి సవాల్‌ విసిరారు. ఆ తర్వాత వెనక్కితగ్గారు. రైతు బంధు అనే పథకానికి ఆద్యుడు కేసీఆర్‌. రైతు బంధును దశలవారీగా రూ.16వేలకు పెంచుతాం. పాలమూరు-ఎత్తిపోతల పథకంపై కాంగ్రెస్‌ నేతలు 109 కేసులు వేశారు. ప్రాజెక్టులు పూర్తయితే కేసీఆర్‌కు మంచిపేరు వస్తుందని కేసులు వేసి అడ్డుకున్నారు. పాలమూరు ప్రాజెక్టు పూర్తి చేసి అచ్చంపేట నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు నీరు ఇస్తాం. ఎవరు గెలిస్తే తెలంగాణ ముందుకు వెళ్తుందో వారినే గెలిపించాలి. ఉన్న తెలంగాణ పోగొట్టిందే కాంగ్రెస్‌ పార్టీ. తెలంగాణ ఇస్తామని 2004లో ప్రకటించి 2014లో ఇచ్చారు. 32 పార్టీల మద్దతు కూడగట్టి తెలంగాణ సాధించా'' అని సీఎం కేసీఆర్‌ వివరించారు.