పేదవారి గుండెలలో ఎగురుతోంది నా జెండా
కార్పొరేట్ల విషకౌగిట నలుగుతోంది నా జెండా
తెల్లదొరలు లెక్కలేని మన సంపద దోచినారు
నల్లదొరల దోపిడి గని నవ్వుతోంది నా జెండా
నిరుపేదలు పన్నులెన్ని కడుతున్నా నీళ్ళ'పాలు'
ఓదార్పుగ కన్నీళ్ళను తుడుస్తోంది నా జెండా
బక్క రైతు బ్యాంకులోను కట్టలేక చస్తుంటే
బలిసినోడి ఋణం రద్దు కుములుతోంది నా జెండా
నల్లధనం వస్తుందని జనం కలలు కంటుంటే
దొంగలంత పరదేశం రగులుతోంది నా జెండా
పెరుగుతున్న ధరలన్నీ దేశభక్తి పెంచుతుంటె
తరుగుతున్న జీవితాల్ని వెతుకుతోంది నా జెండా
మంచి రోజులొస్తాయని మురిసిపోకు ఓ వెన్నెల
ముంచు రోజులొచ్చాయని వణుకుతోంది నా జెండా!!
- వెన్నెల సత్యం










