ఇస్లామాబాద్ : పాకిస్తాన్ మాజీ విదేశాంగ మంత్రి, ఇమ్రాన్ ఖాన్ సన్నిహితుడు షా మెహమూద్ ఖురేషీ (67) పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం ఇస్లామాబాద్‌లోని ఆయన నివాసం నుండి అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఖురేషి పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ) వైస్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. అరెస్ట్ అనంతరం ఆయనను ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీ (ఎఫ్‌ఐఎ) ప్రధాన కార్యాలయానికి తీసుకెళ్లినట్లు సమాచారం. అయితే ఖురేషీ ఏ అభియోగాలపై అరెస్ట్ చేశారన్న అంశంపై వివరాలు స్పష్టంగా లేవు. దౌత్యపరమైన కేబుల్ మిస్సింగ్‌కు సంబంధించిన కేసులో ప్రస్తుతం జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్‌ని ఎఫ్‌ఐఎ విచారిస్తోన్న సంగతి తెలిసిందే. ఖురేషి విదేశాంగ మంత్రిగా ఉన్న సమయంలో ఈ వివాదం చెలరేగింది. పార్టీ వైస్ చైర్మన్ షా మెహమూద్ ఖురేషీని మరోసారి అక్రమంగా అరెస్ట్ చేశారని పిటిఐ ట్విటర్‌లో పేర్కొంది.