Oct 12,2023 09:06

న్యూయార్క్‌ : అధిక వడ్డీ రేట్లు, ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న యుద్ధం, పెరుగుతున్న భౌగోళిక, రాజకీయ విభేదాలు వీటన్నింటి ఫలితంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అంతకంతకు మాంద్యంలోకి జారుతోందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) హెచ్చరించింది. 2024లో అంతర్జాతీయ ఆర్థిక వృద్ధిరేటు 2.9శాతానికి పరిమితం అవుతుందని ఐఎంఎఫ్‌ అంచనా వేసింది. ఈ ఏడాది ఇది మూడు శాతంగా వుంటుందని భావించింది. 2022లో 3.5శాతగా వున్న వృద్ధిరేటు అంచనాలు ఈ ఏడాదికి 3శాతానికి తగ్గాయి. అయితే ఈ ఏడాది జులైలోని అంచనాలకు ఇప్పటికీ ఎలాంటి మార్పు లేదు.
2020లో ప్రపంచవ్యాప్తంగా సంభవించిన కోవిడ్‌ మహమ్మారితో మొత్తంగా అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ ఛిద్రమైందని, దాన్నుండి ఇంకా పూర్తిగా కోలుకోవాల్సి వుండగానే ఈ ఎదురు దెబ్బలు తగులుతున్నాయని పేర్కొంది. కరోనాకు ముందుకాలంతో పోలిస్తే, 2020 నుండి కరోనా, ఉక్రెయిన్‌పై రష్యా దాడులతో సహా పలు ఎదురు దెబ్బలతో ప్రపంచ ఆర్థిక ఉత్పత్తి 3.7 లక్షల కోట్ల యూరోల మేరకు కుదించుకుపోయిందని ఐఎంఎఫ్‌ పేర్కొంది. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం కుంటుతోందని ఐఎంఎఫ్‌ ముఖ్య ఆర్థికవేత్త పియర్రె ఆలీవర్‌ ఈ వారంలో హెచ్చరించారు. మొరాకోలోని మరకేష్‌ నగరంలో ఈ వారంలో ఐఎంఎఫ్‌, ప్రపంచ బ్యాంక్‌ సమావేశాలకు ముందు ఆయన విలేకర్లతో మాట్లాడారు.
ఇదిలావుండగా, చైనా ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది 5శాతం పెరుగుతుందని అంచనా వేశారు. వచ్చే ఏడాదికి ఇది 4.2శాతమే వుంటుందని భావిస్తున్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది 2.1శాతం వృద్ధి చెందుతుందని ఐఎంఎఫ్‌ అంచనా వేసింది. వచ్చే ఏడాదికి ఇది 1.5శాతంగానే వుంటుందని పేర్కొంది.