న్యూఢిల్లీ : బియ్యం ఎగుమతులపై భారత్ విధించిన నిషేధంతో ప్రపంచంలోని ఇతర దేశాలలో ఆహార ధరలపై అస్థిరతను పెంచే అవకాశం ఉందని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) పేర్కొంది. పైగా ఇవి ప్రతీకార చర్యలకు కూడా దారితీయవచ్చని హెచ్చరించారు. దీంతో ఈ రకమైన ఎగుమతులపై పరిమితులను తొలగించాలని భావిస్తామని.. ఎందుకంటే ఇవి ప్రపంచవ్యాప్తంగా విపత్కర పరిస్థితులకు దారితీయవచ్చని ఐఎంఎఫ్ చీఫ్ ఎకనామిస్ట్ మరియు డైరెక్టర్ పియర్ -ఒలివర్ గౌరించస్ పేర్కొన్నారు. మంగళవారం వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌ను ప్రారంభించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. కొన్ని రకాలైన బియ్యం ఎగుమతులపై ఆంక్షలు విధించడంతో ప్రపంచవ్యాప్త ద్రవ్యోల్బణంపై తీవ్ర ప్రభావం పడుతుందని అన్నారు. ఐక్యరాజ్యసమితి మరియు టర్కీల మధ్యవర్తిత్వంతో జరిగిన నల్ల సముద్రం ధాన్యం ఒప్పదం నుండి వైదొలగాలని రష్యా ప్రకటించిన వెంటనే భారత్ బియ్యం ఎగుమతులపై నిషేధం విధించింది.
గతేడాది ప్రపంచవ్యాప్తంగా ధాన్యం సరఫరా అయ్యేందుకు నల్ల సముద్రం ధాన్యం ఒప్పందం కీలకంగా పనిచేసిందని అన్నారు. ఉక్రెయిన్ నుండి ప్రపంచవ్యాప్తంగా 33 మిలియన్ టన్నుల ధాన్యం సరఫరా అయ్యిందని అన్నారు. దీంతో అంతర్జాతీయంగా ధాన్యం ధరలు తగ్గాయని గౌరించస్ పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం ఆ ఒప్పందం రద్దవడంతో పరిస్థితి తారుమారు అయ్యే ప్రమాదం ఉందని... ధాన్యం ధరలు అమాంతం పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. ధాన్యం ధరలు సుమారు 10-15 శాతం పెరిగే అవకాశం ఉందని అంచనా వేశారు. గత గురువారం కేంద్ర ప్రభుత్వం బియ్యం ఎగుమతులను సవరిస్తూ.. నాన్ బాస్మతి బియ్యాన్ని నిషేధిత జాబితాలో చేర్చిన సంగతి తెలిసిందే.