Aug 30,2023 15:25

బ్రసీలియా :   ఆఫ్రికా రుణాలను అవస్థాపన సౌకర్యాలుగా మార్చాలని బ్రెజిల్‌ అధ్యక్షుడు లూలూ డసిల్లా మంగళవారం అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌)ని కోరారు. ఆ దేశాలు అభివృద్ధి చెందిన అనంతరం వాటి బాధ్యతలను చెల్లిస్తాయని సూచించారు.

''ఆఫ్రికా తీవ్రమైన పేదరికంలో ఉంది. సమస్య ఏమిటంటే అన్ని దేశాలు ఐఎంఎఫ్‌ నుండి రుణాలు తీసుకుంటాయి.  అయితే అయా దేశాలు చెల్లించే వడ్డీ ఇతర అవకాశాలపై పెట్టుబడి పెట్టేందుకు అవకాశం ఉండదు'' అని అన్నారు. ఆఫ్రికా దేశాలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు అవసరమైన సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని, అయితే రుణాల భారాన్ని తట్టుకోలేక ఆ దేశాలు ఆ అవకాశాలను వినియోగించుకోలేకపోతున్నాయని అన్నారు.

ప్రస్తుతం ఆఫ్రికా దేశాల రుణభారం 800 బిలియన్ల అమెరికన్‌ డాలర్లను దాటింది. దీంతో వాటి ఆదాయం మొత్తాన్ని రుణాలపై వడ్డీలు చెల్లించేందుకు వినియోగిస్తున్నాయి.

ఎలాగైతే ధనిక దేశాలు ఐఎంఎఫ్‌ రుణాలను మౌలిక సదుపాయాల సేవల కోసం వినియోగిస్తున్నాయో... ఆఫ్రికా దేశాలు కూడా రుణాలను ఆర్థిక వృద్ధి కోసం వినియోగించేందుకు, అనంతరం రుణాలను చెల్లించేందుకు అవకాశమివ్వాలని లూలా సూచించారు. ఎడారి భూభాగమైన సెరాడోను ఆధునిక వ్యవసాయ సాంకేతికతను వినియోగించి అతిపెద్ద ధాన్యాగారం మర్చామో .. అదే విధంగా ఆఫ్రికాలోని సవన్నాను కూడా మార్చాలని సూచించారు. కేవలం ఆఫ్రికాకు మాత్రమే కాకుండా ప్రపంచమంతా ఆహార ఉత్పత్తులను అందించేలా చూడాలని అన్నారు. విదేశీ పెట్టుబడులతో ఆఫ్రికా దేశాల ఉత్పాదక సామర్థ్యం అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు.