Nov 04,2020 13:29

న్యూఢిల్లీ : ఇండియాలో కరోనా వైరస్‌ మళ్లీ మరింత విజృంభిస్తోంది. 24 గంటల్లోనే కరోనా పాజిటివ్‌ కేసులు 17 శాతం పెరిగాయి. మంగళవారం 38,310 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, బుధవారం ఆ సంఖ్య 46,253 కు చేరింది. గడిచిన 24 గంటల్లో 53,357 మంది బాధితులు కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. బుధవారం నాటికి కరోనా యాక్టివ్‌ కేసుల సంఖ్య 5,33,787 గా ఉంది. ఇదిలా ఉండగా.. దేశవ్యాప్తంగా మంగళవారం ఒకే రోజు 12,09,609 శాంపిల్స్‌ను సేకరించి పరీక్షించారు.
         గత ఏడు వారాల నుంచి కరోనా పాజిటివ్‌ కేసులు తగ్గుతూ వస్తున్నప్పటికీ.. గత నాలుగైదు రోజుల నుంచి మళ్లీ పాజిటివ్‌ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. సెప్టెంబర్‌ 16 నుంచి 22 మధ్య 90,436 కేసులు నమోదు కాగా, అక్టోబర్‌ 14 నుంచి 20వ తేదీ మధ్యలో ఆ సంఖ్య 60 వేలకు చేరింది. సుమారు 30 వేల కేసులు తగ్గాయి. గత ఏడు వారాల్లో మరణాల సంఖ్య కూడా తగ్గింది. సెప్టెంబర్‌ 16 నుంచి 22 వ తేదీ మధ్య 1,165 మంది చనిపోగా, అక్టోబర్‌ 14 నుంచి 20 మధ్య 763 కు, అక్టోబర్‌ 28 నుంచి నవంబర్‌ 3వ తేదీ మధ్య కరోనా మరణాల సంఖ్య 513 కు చేరింది.
       ఢిల్లీ, కేరళ, పశ్చిమ బెంగాల్‌, మణిపూర్‌ రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య మళ్లీ క్రమక్రమంగా పెరుగుతుంది. గత నెలలో మహారాష్ట్ర, కర్నాటక, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల్లో కరోనా కేసులు తగ్గాయి. ఢిల్లీలో కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో దీన్ని కరోనా థర్డ్‌ వేవ్‌గా చెప్పొచ్చని సిఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ అభిప్రాయపడ్డారు.