May 01,2023 13:05

తిరువనంతపురం   :  అణగారిన ప్రజలు తమ విముక్తి కోసం రక్తంతో చరిత్రను లిఖించిన రోజును మేడే గుర్తుచేసుకుంటోందని సీపీఐ(ఎం) కేరళ రాష్ట్ర కార్యదర్శి ఎంవీ గోవిందన్ అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా శ్రమిస్తూ, భారాలు మోస్తూ, కష్టాలు పడుతున్న వారి దినోత్సవం ఇదేనని సోమవారం ఆయన తన మేడే సందేశంలో పేర్కొన్నారు.

రోజులో ఎనిమిది గంటల పని, ఎనిమిది గంటల వినోదం, ఎనిమిది గంటల విశ్రాంతి హక్కు కోసం చికాగో కార్మికులు చేసిన పోరాటం, వారి బలిదానం యొక్క ఫలితమే నేటి మే డే.   నేడు మనం అనుభవిస్తున్న హక్కులన్నీ వివిధ ఖండాల్లో, దేశాల్లో వివిధ కాలాల్లో కార్మికులు చేసిన లెక్కలేనన్ని పోరాటాల ఫలితమే. ఆహారం, విద్య, నివాసం, స్వచ్ఛమైన నీరు, స్వచ్ఛమైన గాలి, ఆలోచన, భావప్రకటనా స్వేచ్ఛ, అభిరుచికి అనుగుణంగా ఎదిగే అవకాశం, అన్ని మతాల  సమానత్వం వంటి మానవ హక్కులు ఇంకా నెరవేరని కలలుగానే మిగిలాయని, ఆ కలలను పోరాటాలలో నిలుపుకుని... పోరాడే శక్తులకు మే డే కొత్త ఉత్సాహాన్నిస్తుందని గోవిందన్ అన్నారు.

పోరాటాల ద్వారా కార్మికవర్గం సాధించుకున్న హక్కులను సైతం  మోడీ ప్రభుత్వం సవాలు చేస్తోందని అన్నారు.  పనిగంటలను ఎనిమిది నుంచి పన్నెండు, పదహారు గంటలకు పెంచాలని మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. కాంట్రాక్టు కార్మికులను ప్రోత్సహిస్తూ... లక్షలాది ఖాళీలను భర్తీ చేయడం లేదని, UPSC   ద్వారా కూడా పెద్దగా రిక్రూట్‌మెంట్ లేదని అన్నారు. ప్రభుత్వ రంగ ఉపాధి వ్యవస్థల్లో రిక్రూట్‌మెంట్‌లు అసలే లేవు. సహజ వనరులను, ప్రభుత్వ రంగ పరిశ్రమలను విక్రయిస్తున్నారు. జాతీయ మానిటైజేషన్ పైప్‌లైన్ ద్వారా ప్రభుత్వ ఆస్తులు ప్రైవేట్ క్రోనీ క్యాపిటలిస్టులకు బదిలీ చేస్తున్నారు. మిలటరీలో కూడా కాంట్రాక్టు విధానం అమలవుతోంది. వీటన్నింటికి వ్యతిరేకంగా కార్మికవర్గం, రైతు సంఘాలు, ఇతర ప్రజా సంఘాలు పోరాట బాట పడుతున్నాయి.

మతోన్మాద ప్రచారాలు, మతపరమైన అల్లర్లు, ద్వేషపూరిత రాజకీయాల నుండి దేశాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత కూడా కార్మికవర్గానికి ఉందని గుర్తు చేశారు.  సంఘ్‌ పరివార్‌ శక్తుల ప్రయత్నాలను ప్రతిఘటించేందుకు, ప్రజలను సమీకరించేందుకు కార్మికవర్గం చేస్తున్న ప్రయత్నాలు బలంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. భారతీయ కార్మికవర్గం లౌకికవాదాన్ని నిలబెట్టే దిశగా... ఆ పోరాటాలను జయప్రదం చేయాలని, ఈ మేడే ప్రతిజ్ఞను పునరుద్ధరించుకోవాలని ఎంవీ గోవిందన్‌ ఆకాంక్షించారు.