Aug 02,2022 07:51

ప్రజాశక్తి - గ్రేటర్‌ విశాఖ బ్యూరో : రాయలసీమలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఇది సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తులో కొనసాగుతూ కోస్తాతమిళనాడు వరకూ విస్తరించిందని తెలిపారు. దీని ప్రభావంతో ఉత్తర, దక్షిణ కోస్తాలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. రాగల 24 గంటల్లో రాయలసీమలో పలుచోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు, హుకుంపేటలో భారీ వర్షం కురిసింది. పాడేరు మండలంలోని బంగారుమెట్ట, వి.కొత్తూరు, బొడ్డగొంది పంట పొలాలు నీట మునిగాయి. హుకుంపేట మండలంలోని పట్టాం పంచాయతీ లోని పంట పోలాల్లో వరద నీరు చేరింది.