కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన 2021-22వ సంవత్సరపు బడ్జెట్‌లో రాష్ట్రానికి ద్రోహం జరిగింది. అయినా, రాష్ట్ర ముఖ్యమంత్రి, వైసిపి అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి కానీ, ప్రతిపక్షనేత, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కానీ కేంద్ర నిర్లక్ష్యాన్ని ఎండగట్టడం సంగతి అలా ఉంచి, పన్నెత్తు మాట కూడా అనకపోవడాన్ని ఎలా అర్ధంచేసుకోవాలి? సమీక్ష పేరుతోనో, సమావేశం పేరుతోనో ప్రతి రోజూ ఏదో ఒకటి మాట్లాడుతున్న వీరికి కేంద్రాన్ని ప్రశ్నించడానికి మాటలు రావడం లేదనుకోవాలా? బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన రోజు పెదవి విరిచినట్టు కనిపించిన రెండు పార్టీల ఎంపీలు ఆ తరువాత మౌనం వహించారు ఎందుకు? పై నుండి ఏమైనా ఆదేశాలు అందాయా? లేక ఇంకేమైనా ఉందా! రాష్ట్ర హక్కులు, నిధుల సాధన కోసం భవిష్యత్ కార్యాచరణకు సిద్ధం కావడం లేదెందుకు?
బడ్జెట్‌లో కేంద్రం సున్నా చుట్టింది కేవలం ఒక్క ఏడాది కేటాయింపులకే అనుకుంటే పొరపాటే...రాష్ట్ర భవిష్యత్తుకు కూడా! సమైక్య రాష్ట్ర విభజన కష్టాల్లో సతమతమవుతుండగానే, కరోనా కాటుతో రాష్ట్రం కకావికలమైంది. ఆదాయ వనరులు వట్టిపోయాయి. ఏం చేయాలో దిక్కుతోచని స్థితి! రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇటీవల కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిసినప్పుడు ఇదే విషయాన్ని నివేదించారని, పెద్ద మనసుతో రాష్ట్రానికి మేలు చేయాలని అభ్యర్థించారని, దానికి వారు కూడా సానుకూలంగా స్పందించారని వార్తలు వచ్చాయి. కానీ, జరిగిందేమిటి? రాష్ట్ర ప్రజల హక్కైన ప్రత్యేక హోదా ఏమైందో తెలియదు. పోలవరం ప్రాజెక్టు పనులు, పునరావాస ఖర్చులకు శుష్క వాగ్దానాలే మిగిలాయి. విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన వివిధ ప్రయోజనాల ఊసు లేదు. ఇప్పటికే మంజూరై, అరకొర వసతులతో సాగుతున్న ఎయిమ్స్ వంటి సంస్థలకు నామమాత్రపు కేటాయింపులే దక్కాయి! వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల అభివృద్ధి మరోసారి కాగితాలకే పరిమితమైంది! టెక్స్‌టైల్ పార్కు, ఇప్పటికే ఉన్న జిల్లాలతో పాటు నూతనంగా ఏర్పాటు కానున్న జిల్లాలకూ ఒక్క కేంద్రీయ విద్యాలయం, నూతన మెడికల్ కళాశాలల ఏర్పాటు వంటి వినతులను కేంద్రం చెత్త బుట్టకు చేర్చింది! కడప ఉక్కు కోసం ఉధృతంగా సాగిన ఆందోళననూ బేఖాతరు చేసింది. ఇది చాలదన్నట్టు వ్యవసాయ సెస్ పేరుతో పెట్రో ఉత్పత్తుల విక్రయాల్లో రాష్ట్రానికి వచ్చే కొద్దపాటి ఆదాయానికి కన్నం వేసింది. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మూలంగా రానున్న ఐదేళ్లలో 11 వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని రాష్ట్రం కోల్పోతోంది. కేంద్రం సెస్సులు విధించడం మూలాన పన్ను ఆదాయంలో రాష్ట్ర వాటా మరింత తగ్గుతుంది. దీనిపైనా ఉభయ పార్టీలూ ఏమీ మాట్లాడవు. పోనీ, కేంద్రానికి అణిగి మణిగి ఉన్నందున ఏమైనా ఒరిగిందా అంటే అదీ లేదు. జిఎస్‌టి పరిహారం రూ.5051 కోట్లు ఇవ్వాల్సి ఉండగా, ఇప్పటికి రూ.1936 కోట్లు మాత్రమే చెల్లించారు. అన్ని రాష్ట్రాలకు కలిపి చెల్లించాల్సిన బకాయిలు రూ. 1.06 లక్షల కోట్లు కాగా రూ. 84 వేల కోట్లు చెల్లించారు. అంటే 79 శాతం! ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చింది మాత్రం 38 శాతం మాత్రమే! ఇలా చెప్పుకుంటూ పోతే రాష్ట్రం పట్ల కేంద్ర నిర్లక్ష్యానికి తార్కాణాలెన్నో!
సమైక్య రాష్ట్ర విభజన జరిగినప్పటి నుండి కేంద్రంలో బిజెపి అధికారంలో ఉంది! అప్పటి నుండి ప్రతి ఏడాదీ ఇదే దుస్థితి! టిడిపి, వైసిపి లు ఇదే రాజీ ధోరణిని కొనసాగిస్తున్నాయి. బిజెపి కి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో వంత పాడుతూనే ఉన్నాయి. ఆ పార్టీల జేబు సంస్థలుగా ముద్ర పడ్డ కొన్ని మీడియా సంస్థలు కూడా ఇదే బాటలో నడవడం, రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని ప్రజలకు వివరించకపోవడం మరింత ఘోరం! సొంత ప్రయోజనాల కోసం రాష్ట్ర భవిష్యత్తుకు గండి కొట్టే ఈ తరహా రాజీ విధానాలను అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీలు విడనాడాలి. కలిసివచ్చే శక్తులను కలుపుకుని విశాల ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా ఉద్యమించాలి. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రాష్ట్ర ప్రయోజనాలు సాధించాలి. ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని ఇనుమడింపచేయాలి. లేనిపక్షంలో చరిత్రలో దోషులుగా మిగలక తప్పదు!










