Feb 01,2021 20:21

వెనకటికొకడు పంచ పాండవులు మంచం కోళ్లలా ముగ్గురు అని రెండు వేళ్లు చూపించి 1 అంకె వేసి చూపించాడట. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి ఆరోగ్యానికి సంబంధించి చూపిన కేటాయింపులు కూడా అలాగే ఉన్నాయని విశ్లేషకులు పెదవి విరుస్తున్నారు. మునుపెన్నడూ ఊహించని కరోనా భూతాన్ని ఎదుర్కొన్న దేశంలో ఆ రంగంలో మౌలిక వసతుల కల్పనకు, ప్రభుత్వరంగంలో వైద్యాన్ని బలోపేతం చేసేందుకు భారీగా కేటాయింపులు లేకపోవడం గమనార్హం.

'ఒక ప్రాంతం లేదా దేశం ఎదుర్కొనే విపత్తుల గురించి మనకు తెలుసు. కానీ కోవిడ్‌ మహమ్మారి కారణంగా 2020లో మనం ఊహించని, మునుపెన్నడూ లేని విపత్కర పరిస్థితులను భరించాం. ఎంతోమంది ఆప్తులను కోల్పోయాం. ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కొన్నాం' అని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. ఈ సంక్షోభాన్ని ఎదుర్కొని, సరైన సదుపాయాలు లేకపోయినా ప్రాణాలకు తెగించి ప్రజలకు సేవచేసిన ప్రభుత్వ వైద్య రంగంలోని వైద్యులు, ఇతర సిబ్బందికి పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించి, ఆ రంగాన్ని బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకోలేదు.
 

వాస్తవానికి పెరిగింది అరకొరే
ప్రజారోగ్యం కోసం రూ.2.23 లక్షల కోట్లు కేటాయిస్తున్నామని, గత బడ్జెట్‌ కేటాయింపులతో పోలిస్తే ఇది 137 శాతం అదనమని ఘనంగా ప్రకటించారు. 'ప్రధానమంత్రి ఆత్మనిర్భర్‌ స్వస్థ్‌ భారత్‌ యోజన' పథకం కింద రానున్న ఆరేళ్లలో రూ.64,180 కోట్లు ఖర్చు చేస్తామని ప్రకటించారు. ఈ నిధులతో ప్రాథమిక, మధ్యస్థ, ప్రాంతీయ ఆరోగ్య వ్యవస్థలను బలోపేతం చేస్తామని తెలిపారు. ప్రకటించిన రూ.2.23 లక్షల కోట్లలో రూ.35 వేల కోట్లు ఈ ఏడాది వ్యాక్సినేషన్‌కు వెచ్చించనున్నారు. అవసరమైతే మరింత కేటాయిస్తామని చెప్పారు. ఒకసారి ఇచ్చే వ్యాక్సినేషన్‌ గురించి, ఆరేళ్లలో చేసే ఖర్చు గురించి ఘనంగా చెప్పడం మినహాయిస్తే... మౌలిక వసతుల కోసం ఈ ఏడాది కేటాయింపులు భారీగా పెంచడంపై మాట్లాడలేదు. ఐసిడిఎస్‌ పరిధిలోకి వచ్చే పోషకాహార లోపాన్ని నివారించే ప్రత్యేక మిషన్‌ను కూడా ఆరోగ్యరంగం పద్దులోనే చూపించారు. పోషణ్‌ అభియాన్‌, సప్లిమెంటరీ న్యూట్రిషన్‌ ప్రోగ్రామ్‌ను కలిపి మిషన్‌ పోషణ్‌ 2.0ను త్వరలో ప్రారంభించనున్నారు. ఇందుకోసం రూ.2,700 కోట్లు కేటాయించారు. ఆరోగ్య రంగంలో పరిశోధనలకు రూ.2,600 కోట్లు, ఆయుష్‌ విభాగానికి రూ.2,970 కోట్లు కేటాయించారు. ఇవన్నీ దాదాపు గత ఏడాదితో పోలిస్తే కొద్దిగానే పెరిగాయి. మంచినీరు, పారిశుధ్యానికి ఫైనాన్స్‌ కమిషన్‌ చేసిన గ్రాంటు రూ.36 వేల కోట్లు, ఆరోగ్యానికి ఫైనాన్స్‌ కమిషన్‌ ఇస్తున్న రూ.13,192 కోట్ల గ్రాంటును కూడా ఈ పద్దులోనే కలిపేశారు. గతంలో ఎప్పుడూ ఆరోగ్యంలో ఇవి చూపలేదు. ఇవి కాకుండా డ్రింకింగ్‌ వాటర్‌, శానిటైజేషన్‌కు ప్రభుత్వం రూ.60,030 కోట్లు కేటాయించింది. ఇది కూడా ఆరోగ్యరంగంలోనే చూపింది. వ్యాక్సినేషన్‌, వాటర్‌, శానిటైజేషన్‌ నిధులను తీసెస్తే గత ఏడాది రూ.72,934 కోట్లు కేటాయించారని, ఈ ఏడాది రూ.79,602 కోట్లకు పెంచారని కేంద్ర మాజీ ఆర్థికమంత్రి చిదంబరం పేర్కొన్నారు. ఈ అరకొర కేటాయింపులతో ఎలాంటి అదనపు మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తారని ప్రశ్నించారు. పలువురు ఆరోగ్యరంగ ప్రముఖులు ఈ అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు.