
న్యాయం కోరడం, దాని కోసం పోరాడడం నేరమా? అలా చేయడం కుట్ర అవుతుందా? సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్, గుజరాత్ మాజీ డీజీపీ ఆర్‌బి శ్రీకుమార్ లను గుజరాత్ పోలీసులు అరెస్ట్ చేయడం ఈ ప్రశ్నలకు తావిస్తోంది. 2,000 మందికి పైగా ప్రాణాలను బలిగొన్న నరమేధం సమయంలో చేష్టలుడిగినట్లు వ్యవహరించిన గుజరాత్ పోలీసులు ఇప్పుడు...బాధితులకు న్యాయం చేయాలని పిలుపునిచ్చిన వారి నోరు మూయించేందుకు తక్షణ చర్యలు చేపట్టారు.
గుజరాత్ పోలీసులు ప్రతీకారం తీర్చుకునేలా వ్యవహరిస్తున్నారు. ఆ దారుణ మారణకాండ జరిగినప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ, అమిత్ షా లపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేసిన తీస్తా సెతల్వాద్ తదితరులను జైల్లో పెట్టేందుకు బిజెపి ఒక పథకం ప్రకారం యత్నిస్తున్నదనడంలో సందేహం లేదు. ప్రతీకారం కూడా ఫాసిజానికి సంకేతం. అయితే న్యాయ వ్యవస్థే బాధితుల పట్ల ప్రతీకారంతో వ్యవహరిస్తే? హిందూత్వ రాజకీయాలు ప్రబలుతున్న కాలంలో భారత న్యాయ వ్యవస్థ స్వరూపం కూడా మారిపోతోందని అయోధ్య కేసు తీర్పు నుంచి అనేక ఉదాహరణలు చెప్పవచ్చు. అయితే బాధితులపై చర్యలు తీసుకోవాలని సుప్రీం కోర్టు స్వయంగా ఆదేశించడంతో దేశం పెను ప్రమాదంలో పడిందని చెప్పక తప్పదు. ప్రజలను చైతన్యవంతులను చేసి కాపాడాల్సిన ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్...తీస్తా తదితరుల అరెస్టుకు వ్యతిరేకంగా బయటకు రావడానికి వెనుకాడుతోంది.
గుజరాత్ అల్లర్లలో భాగంగా గుల్బర్గ్ సొసైటీకి నిప్పు పెట్టడంతో ఎహసాన్ జాఫ్రీతో సహా కనీసం 69 మంది చనిపోయారు. పార్లమెంటు సభ్యుడిగా ఉన్న ఎహసాన్ జాఫ్రీని దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన 2002 ఫిబ్రవరి 28న జరిగింది. దీని వెనుక మోడీ ప్రభుత్వ కుట్ర దాగి ఉందని ఎహసాన్ భార్య జకియా జాఫ్రీ ఆరోపించారు. వారికి సహాయం చేయాలని కాంగ్రెస్ గోల పెట్టినప్పుడు, వారికి అన్ని విధాలా సాయం చేశారు తీస్తా సెతల్వాద్. 2012లో, తీవ్ర ఒత్తిడి ఫలితంగా గుజరాత్ అల్లర్లపై విచారణకు సుప్రీం కోర్టు స్వయంగా ప్రత్యేక విచారణ బృందాన్ని నియమించింది. అయితే అల్లర్ల కుట్రలో రాష్ట్ర ప్రభుత్వం ప్రమేయం ఉందన్న జకియా జాఫ్రీ ఆరోపణలను వారు తిరస్కరించారు. దీంతో ఆవిడ మళ్లీ విచారణను కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ అభ్యర్థనను ఇప్పుడు సుప్రీంకోర్టు చెత్తబుట్టలో వేసింది.
జకియా జాఫ్రీ డిమాండ్‌ను తిరస్కరించడం సహజమైన చర్య కాదు. న్యాయం కోరే వారిపై ప్రతీకారం తీర్చుకోవాలని కోర్టు స్వయంగా పిలుపునివ్వడం న్యాయ చరిత్రలో కనీవినీ ఎరుగని విడ్డూరం. ప్రముఖ న్యాయవాది, న్యాయ నిపుణుడు గౌతమ్ భాటియా పేర్కొన్నట్లుగా, ఫిర్యాదు చేసిన వ్యక్తిని అరెస్టు చేయాలని కోర్టే ఆదేశించడం విచిత్రంగా వుంది. ఈ వింత పోకడ ప్రపంచ న్యాయ వ్యవస్థకు సుప్రీంకోర్టు అందించిన కొత్త సహకారం అని భాటియా చమత్కరించారు. రెండు దశాబ్దాలుగా సాగుతున్న న్యాయ పోరాటాన్ని...స్వేచ్ఛను దుర్వినియోగపరిచే ఎత్తుగడ అని సుప్రీం కోర్టు చెప్పినప్పుడు... స్వాతంత్య్ర కాంక్ష ఉన్న ప్రతి ఒక్కరు అవమానానికి గురవుతారు. అదొక్కటే కాదు. గుజరాత్ నరమేధం వెనుక ఎలాంటి కుట్ర లేదని, భారత న్యాయ వ్యవస్థను దెబ్బతీసే విధంగా అమాయక ప్రజలను (మోడీ అండ్ కో ను) జైల్లో పెట్టే కుట్ర ఉందని సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఎలా చెప్తుంది? మారణ హోమం జరుగుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం అభినవ 'నీరో'లా వ్యవహరించిందని మొన్నటి వరకు చెప్పిన సుప్రీంకోర్టు ఇప్పుడు ఒక్కసారిగా స్వరం మార్చింది. మతపరమైన ఉద్రిక్తతలను సృష్టించే ప్రభుత్వాలను ఉత్తేజపరిచే విధంగా వ్యవహరించడానికి భారత న్యాయవ్యవస్థ సిద్ధమవుతున్నప్పుడు, బాధితులు ఇప్పుడు దేనిపై ఆధారపడాలనే తీవ్రమైన ప్రశ్న తలెత్తుతుంది.
( బెంగాలీ దినపత్రిక 'గణశక్తి' సంపాదకీయం )