దీర్ఘకాలంగా రైతాంగం సాగిస్తున్న పోరాటంలోని ప్రధానమైన అంశాల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు, రైతు సంఘాల ప్రతినిధుల మధ్య బుధవారం జరిగిన చర్చలు మరోసారి విఫలమయ్యాయి. ఈ వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న అంశాన్ని పరిశీలించడానికే కేంద్ర ప్రభుత్వం తిరస్కరిస్తోంది. అయితే విద్యుత్ (సవరణ) బిల్లును పున:పరిశీలించడానికి, కాలుష్యచట్టం నుండి రైతులను తొలగించడానికి అంగీకరించినట్లు కనిపిస్తోంది. మరో దఫా చర్చలు జనవరి 4 జరగాల్సి వున్నాయి.
ఆ మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయడానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అస్పష్టత కొనసాగిస్తున్నందున ప్రస్తుతం జరుగుతున్న శాంతియుత రైతాంగ నిరసనలపై ప్రతిష్టంభన ఇంకా కొనసాగుతునే వుంది.
ఢిల్లీ సరిహద్దుల్లో , ఢిల్లీలోకి ప్రవేశించే జాతీయ రహదారులపై మోహరించిన రైతుల సంఖ్య పెరుగుతుండడం చూస్తుంటే తమ డిమాండ్ల సాధనకు రైతులు ఎంత కృత నిశ్చయంతో, అకుంఠిత దీక్షతో వున్నారో తెలుస్తోంది. ఢిల్లీ పొరుగు రాష్ట్రాల నుండి రైతులు ఈ పోరాటానికి తరలి వస్తున్నారు. అంతేకాదు, సుదూర ప్రాంతాలైన మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాల నుండి కూడా వస్తున్నారు. చాలా ప్రాంతాల్లో - పాట్నా, రారుపూర్ నుండి గుల్బర్గా, తంజావూరు వరకు దాదాపు ప్రతి రాష్ట్రంలో రైతాంగం నిరంతరంగా ఆందోళనలను నిర్వహిస్తూనే వుంది.
రైతాంగం సాగిస్తున్న ఈ పోరాటానికి యావత్ కార్మిక లోకం, కార్మిక సంఘాలు క్రియాశీలమైన మద్దతును, సంఘీభావాన్ని ప్రదర్శిస్తున్నాయి. సమాజంలోని ఇతర వర్గాలైన - మహిళలు, విద్యార్ధులు, యువత, అందరూ కూడా దేశ అన్నదాతలైన రైతులకు మద్దతుగా కదిలివచ్చారు.
కనివినీ ఎరుగని రీతిలో రైతులు చేపట్టిన ఈ పోరాటం వెనుక గల డిమాండ్లు పూర్తిగా సమర్ధనీయమైనవే. సహేతుకమైన రీతిలో ఆలోచించే ఏ ప్రభుత్వమైనా వీటిని ఆమోదించి తీరాల్సిందే. ఈ వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దు చేయాలని మాత్రమే రైతులు కేంద్రాన్ని కోరుతున్నారు. ఇటువంటి ఒత్తిళ్ళను నివారించేందుకే కేంద్రం శీతాకాల సమావేశాలను రద్దు చేసింది. తద్వారా ప్రజలకు జవాబుదారీగా వుండాలన్న తన బాధ్యతను త్యజించింది. వ్యవసాయ చట్టాలను రద్దు చేసిన తర్వాత రైతులతో, వ్యవసాయ కమ్యూనిటీతో, కార్పొరేట్లతో, సంబంధిత పక్షాలందరితో చర్చలు జరపాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఆ చర్చల ప్రాతిపదికన కొత్త వ్యవసాయ చట్టాలను రూపొందించాలని, వ్యవస్థీకృతమైన చర్చ సాగిన తర్వాత పార్లమెంట్‌లో వాటిని ఆమోదించాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ ప్రధాని మోడీ ఇందుకు మొండిగా తిరస్కరిస్తున్నారు.
ఇంత తీవ్రమైన చలిలో, ప్రతికూలంగా వున్న పరిస్థితులను తట్టుకుంటూ అత్యంత శాంతియుతంగా, క్రమశిక్షణాయుతంగా సాగుతున్న ప్రజా ఉద్యమాన్ని అప్రతిష్టపాల్జేసేందుకు గానూ బిజెపి, మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం విషపూరితమైన తప్పుడు ప్రచారాన్ని ప్రారంభించాయి. మొదటగా, ఆందోళనకారులను ఖలిస్తానీలు, పాకిస్తానీలు, చైనా ఏజెంట్లు, పట్టణ ప్రాంతాల్లోని నక్సల్స్, అల్లరి గ్యాంగ్‌లుగా వారు అభివర్ణిస్తున్నారు. తర్వాత, రైతులను తప్పుదారి పట్టిస్తున్నది ప్రతిపక్ష పార్టీలంటూ నిందలు వేస్తున్నారు. వాస్తవమేమంటే ఇందులో ఏ రాజకీయ పార్టీ ప్రమేయం లేదు. దేశవ్యాప్తంగా 500కి పైగా రైతు సంఘాల కూటమి అయిన సంయుక్త కిసాన్ మోర్చా ఈ ఆందోళనలను నిర్వహిస్తోంది. ఇటువంటి నిందాపూర్వకమైన ఆరోపణలు, ప్రచారానికి ప్రధాని మోడీ వ్యక్తిగతంగా నేతృత్వం వహిస్తున్నారు. తమ ఎన్నికల ప్రణాళికల్లో వ్యవసాయ సంస్కరణలు గురించి మాట్లాడిన ఈ ప్రతిపక్షాలే ఇప్పుడు వ్యతిరేకించాలి కాబట్టి వ్యతిరేకిస్తున్నాయన్నది అన్నిటికంటే దిగజారి చేస్తున్న నిందారోపణ. నిజమే, సిపిఎంకి సంబంధించినంతవరకు, వ్యవసాయ సంస్కరణలు కావాలని ఎప్పుడూ మేం కోరుతూనే వచ్చాం. ఇతర పార్టీలు కూడా చాలావరకు ఇలాగే డిమాండ్ చేశాయి. కానీ ఏ తరహా సంస్కరణలు? భారతదేశ ఆహార భద్రతను పటిష్టపరిచేలా సంస్కరణలు తీసుకురావాలని సిపిఎం కోరుతోంది. మన ప్రజలకు సక్రమంగా, ఆరోగ్యవంతంగా పోషకాహారం అందేందుకు హామీ కల్పిస్తూ తగిన ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేయాలని కోరుతోంది. ప్రజా పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా వినియోగదారులకు సహేతుకమైన ధరలో అందేలా, రైతులకు సరైన మద్దతు ధర వచ్చేలా సంస్కరణలు తీసుకురావాలని కోరుతోంది. మన వ్యవసాయ రంగాన్ని మరింతగా అభవృద్ధిపరిచేందుకు ఉపయోగపడేలా ఈ సంస్కరణలు వుండాలన్నది సిపిఎం అభిమతంగా వుంది.
అయితే, ప్రస్తుత చట్టాల్లో వున్న మోడీ సంస్కరణలు, భారత వ్యవసాయ రంగాన్ని, దాని మార్కెట్లను, ఉత్పత్తులను బహుళజాతి ఆగ్రో బిజినెస్ దిగ్గజాలకు, విదేశీ, దేశీయ కార్పొరేట్లకు అప్పగించడానికి ఉద్దేశించబడ్డాయి. భారతదేశ ఆహారభద్రతను తీవ్రంగా దెబ్బతీయడానికి, నిత్యావసర సరుకులను పెద్ద మొత్తంలో అక్రమ నిల్వ చేయడాన్ని అనుమతించడానికి ఉద్దేశించబడ్డాయి. ఆ రకంగా, కృత్రిమంగా ఆహార కొరత సృష్టిస్తే అది, పెద్ద ఎత్తున ధరల పెరుగుదలకు దారి తీస్తుంది. ప్రజా పంపిణీ వ్యవస్థను ధ్వంసం చేస్తుంది. అందరికీ అందుబాటు ధరల్లో ఆహార ధాన్యాలు అందే పరిస్థితులను దెబ్బతీస్తుంది. ఈ వ్యవసాయ చట్టాలు భారత వ్యవసాయ రంగాన్ని నాశనం చేస్తాయి. మన ప్రజలకు తీవ్ర ఇబ్బందులను కలగచేస్తాయి. అందుకే చాలా లౌకిక ప్రతిపక్ష పార్టీలు ఈ బిల్లులను వ్యతిరేకిస్తున్నాయి. రైతులు సాగిస్తున్న ఆందోళనలకు మద్దతును, సంఘీభావాన్ని ప్రదర్శిస్తున్నాయి. ఈ డిమాండ్లను ఆమోదించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. భారత ప్రజలకు సంక్షేమ, సౌభాగ్యాలను అందచేసే సంస్కరణలు తీసుకురావాలి కానీ విదేశీ, దేశీయ కార్పొరేట్లకు మిక్కిలి లాభాలు అందించే సంస్కరణలు కాదని పేర్కొంటున్నాయి.
స్వామినాథన్ కమిషన్ నివేదిక అమలు?
కనీస మద్దతు ధరపై స్వామినాథన్ కమిషన్ సిఫార్సును అమలు చేస్తున్నామని ప్రధాని మోడీ చెప్పుకుంటున్నారు. కానీ వాస్తవమేమంటే, సి టు ప్లస్ 50శాతంగా కనీస మద్దతు ధర వుండాలని స్వామినాథన్ కమిషన్ సిఫార్సు చేసింది. కానీ ప్రభుత్వం ఉత్తమంగా, ఎ టు ప్లస్ 50శాతం ఇస్తోంది. ఈ రెండింటి మధ్య వ్యత్యాసం గణనీయంగా వుంది. ఎ టు అంటే వాస్తవంగా అయిన వ్యయం, సి టు అంటే సొంత భూమి రెంటల్ విలువ, మరియు స్వంత నిర్ధారిత పెట్టుబడి ఆస్తుల విలువపై వడ్డీ. ఆ రకంగా, కనీస మద్దతు ధరపై స్వామినాథన్ కమిషన్ సిఫార్సును కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇతర సూచనలనూ పక్కనపెట్టింది.
సిపిఎం 2019 ఎన్నికల ప్రణాళికలోని వ్యవసాయ సంస్కరణల సెక్షన్‌లో వున్నదేమంటే, రైతులందరికీ కనీస మద్దతు ధరకు అమ్ముకునే చట్టబద్ధమైన హక్కు వుండాలని డిమాండ్ చేస్తోంది. 2017 నుండి, సిపిఎం ఎంపీలు పార్లమెంట్‌లో ఈ విషయాన్ని లేవదీస్తూనే వున్నారు. కానీ ఈ రోజు వరకు, కేంద్ర ప్రభుత్వం అటువంటి చట్టమేదీ తీసుకురాలేదు. పైగా, కనీస మద్దతు ధర అన్ని వ్యవసాయ పంటలకు, రైతులందరికీ వర్తించాల్సి వుంది. ప్రస్తుతం, ఇది కేవలం ఆరు శాతం మంది రైతులకు మాత్రమే వర్తిస్తోంది. పైగా, సమర్ధవంతమైన రీతిలో సేకరణ యంత్రాంగం లేకుండా కనీస మద్దతు ధర అంటే అర్ధరహితం. అందువల్ల ప్రభుత్వ సేకరణ వ్యవస్థ అయినా లేదా ప్రైవేటు వ్యవస్థ అయినా దేశవ్యాప్తంగా సార్వజనీనం కావాలి.
ప్రతిపక్ష పార్టీల పాలనలోని రాష్ట్ర ప్రభుత్వాలపై దాడి
ప్రతిపక్షాల పాలనలో వున్న రాష్ట్ర ప్రభుత్వాలపై ముఖ్యంగా కేరళలో ఎల్‌డిఎఫ్ ప్రభుత్వంపై పూర్తిగా తప్పుడు ప్రచారంతో దాడికి ప్రధాని మోడీ పాల్పడుతున్నారు. ఆ ప్రభుత్వాలు రైతుల ప్రయోజనాలు పట్టించుకోవడం లేదని విమ ర్శిస్తున్నారు. కేరళకు సంబంధించి ప్రధాని ప్రచారం చేస్తున్న అసత్యాలను అఖిల భారత కిసాన్ సభ సమర్ధవంతంగా తిప్పి కొట్టింది. ధాన్యం, కూరగాయలు, పప్పుధాన్యాలు, అరటిపం టలకు కేరళ ప్రభుత్వం హెక్టారుకు ఆకర్షణీయమైన రాయితీలు అందిస్తోంది. కేరళలో 82శాతం సాగు ప్రాంతంలో వాణిజ్య పంటలు వేస్తున్నారు. వీటి ధరలకు కమోడిటీ బోర్డులు హామీ కల్పిస్తాయి. రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో వేలం వ్యవస్థ వుంది.
దృష్టి మళ్లించేందుకు మతపరమైన చీలికలు
పెద్ద ఎత్తున శాంతియుతంగా సాగుతున్న ఈ ఆందోళనలు, నిరసనల నుండి ప్రజల దృష్టిని మళ్ళించేందుకు బిజెపి తన రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా మతపరమైన వ్యక్తీకరణలకు పదును పెడుతోంది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు తీసుకువచ్చిన లవ్ జిహాద్ చట్టాలను, గో రక్షణ చట్టాలను ప్రజలను వేధించడానికి, వారిని అడ్డగించడానికి, మతోన్మాదాన్ని రెచ్చగొట్టడానికి ఉపయోగిస్తోంది. మధ్యప్రదేశ్‌లో ఉజ్జయిని, ఇండోర్, ఇంకా చాలా ప్రాంతాల్లో మతోన్మాద ఉద్రికత్తలు రెచ్చగొట్టబడ్డాయి. ఇవి, దేశాన్ని తీవ్రంగా అస్థిరీకరించేలా ప్రభావాన్ని కలుగజేేస్తాయి.
దూకుడుగా నయా ఉదారవాద వైఖరి అమలు
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నిరంతరంగా మాంద్యంలో కొనసాగుతుండడంతో, నయా ఉదారవాద సంస్కరణల పంథా ఈ సంక్షోభాన్నుండి బయటపడేందుకు పరిష్కారాన్ని చూపడంలో పూర్తిగా దివాళా తీసింది. పైగా, పెట్టుబడిదారీవాదంలో ప్రధానంగా గరిష్ట స్థాయిలో లాభార్జన మరింత ఉధృతమైంది. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం నయా ఉదారవాద సంస్కరణల పంథాను దూకుడుగా అనుసరిస్తూ కార్పొరేట్‌వర్గాల గరిష్ట లాభార్జనకు మరిన్ని అవకాశాలు కల్పిస్తోంది. ఇందుకు గానూ, ఆర్ధిక కార్యకలాపాలకు సంబంధించి కొత్త రంగాలు, కొత్త మార్కెట్లను స్వాధీనం చేసుకోవడం అవసరం. వ్యవసాయ రంగంపై పూర్తిగా కార్పొరేట్ శక్తులు (విదేశీ, స్వదేశీ) నియంత్రణ సాధించేందుకు ప్రస్తుతం చేస్తున్న ప్రయత్నాలు ఈ లక్ష్య సాధన కోసమే. వాటికోసమే ఈ వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చారు.
ఆ రకంగా, భారతదేశంలోని పాలక వర్గాలను సంఘటితపరిచే ప్రధాన ఏజెంటుగా కేంద్ర ప్రభుత్వం మారింది. తమ వర్గ ప్రయోజనాలను నెరవేర్చుకు నేందుకు సంస్కరణలను అమలు చేస్తోంది.
వర్గపరమైన చిక్కులు
అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక సంక్షోభానికి తోడు, భారత ఆర్థిక వ్యవస్థ కూడా తీవ్రంగా దెబ్బతిని వుంది. పెద్ద నోట్ల రద్దు, జిఎస్‌టి అమలు వంటి చర్యల కారణంగా గత కొద్ది సంవత్సరాలుగా జిడిపి వృద్ధి రేటు నిలకడగా తగ్గుతూ వస్తోంది. కోవిడ్ మహమ్మారి, ఏమాత్రమూ ప్రణాళిక లేని రీతిలో ప్రకటించిన లాక్‌డౌన్ వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ మాంద్యంలో పడింది. అయినా తమ లాభాల స్థాయిని గరిష్టంగా అలాగే కొనసాగించేందుకు భారత పాలక వర్గాలు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నాయి.
బడా బూర్జువా వర్గాల నాయకత్వంలో భారతదేశంలోని భూస్వామ్య పాలక వర్గాలు తమ నయా ఉదారవాద సంస్కరణల పంథాను ఉపయోగించి తమ లాభార్జన ప్రయత్నాలను మరింత సంఘటితం చేసుకున్నాయి. జాతీయ ఆస్తులను కొల్లగొట్టడం, పెద్ద ఎత్తున ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటీకరించడం, గనులు వంటి ప్రజల సంపదను అప్పగించడం తదితర చర్యలు ఆ కోవలోకే వస్తాయి. కార్మిక చట్టాలను రద్దుచేయడంతో పాటు ప్రైవేటు రంగానికి ప్రభుత్వ సేవలు ఈ క్రమంలో భాగమే.
గరిష్ట స్థాయిలో లాభాలు ఆర్జించేందుకు గానూ వ్యవసాయ రంగంపై కార్పొరేట్ నియంత్రణ సాధించేందుకు భారత పాలక వర్గం పావులు కదుపుతోంది. రైతాంగం చారిత్రకంగా సాగిస్తున్న పోరాటంతో ఆ ప్రయత్నాలు, చర్యలేంటన్నది వెలికివచ్చాయి.
ఆ రకంగా, అంతర్జాతీయ ఆర్థిక పెట్టుబడి శక్తులతో కుమ్మక్కైన బడా బూర్జువా వర్గాలు, రైతాంగం, సంపన్నులైన రైతులు, భూస్వాములు మధ్య సరికొత్తగా వర్గ సంఘర్షణ తలెత్తింది.
ఇక రెండవది: పాలక వర్గాల భాగస్వాముల్లో తలెత్తుతున్న ఘర్షణలు బడా బూర్గువా వర్గాల మధ్య కూడా తలెత్తుతున్నాయి. ఇది ఒకవైపు వుంటే మరోవైపు బడా బూర్జువాలు కానీ వర్గాలు, ముఖ్యంగా ఎంఎస్‌ఎంఇ రంగానికి చెందిన వారు వున్నారు.
మూడవది: మన రాజ్యాంగం కల్పించిన ఫెడరల్ వ్యవస్థను ధ్వంసం చేయడం ద్వారా దేశంలో పూర్తి రాజకీయ గుత్తాధిపత్యాన్ని నెలకొల్పడానికి బిజెపి ప్రయత్నిస్తోంది. ఆ స్థానంలో ఏకీకృత ప్రభుత్వ వ్యవస్థను స్థాపించాలని చూస్తోంది. దీంతో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాల ప్రభుత్వాల మధ్య ఘర్షణలు తలెత్తుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలకు నాయకత్వం వహిస్తున్న కొన్ని ప్రాంతీయ పార్టీలు పార్లమెంట్‌లో బిజెపికి మద్దతుదారులుగా వున్నాయి. పార్లమెంట్‌లో బిజెపికి మద్దతిచ్చే విషయంలో చాలావరకు తటస్థంగా వున్న పార్టీలు కొన్ని వున్నాయి. వీరందరూ కూడా ప్రస్తుతం సాగుతున్న రైతాంగ పోరాటానికి సంబంధించి వ్యతిరేకతను వ్యక్తం చేయాలని బిజెపి ఒత్తిడి తెస్తోంది.
పాలక వర్గ భాగస్వాముల మధ్య తలెత్తే ఇటువంటి ఘర్షణలను దోపిడీకి గురయ్యే వర్గాలు ముఖ్యంగా కార్మిక లోకం, పేద రైతులు, వ్యవసాయ కూలీలు వంటి వారు కచ్చితంగా ఉపయోగించుకునే అవకాశాలు ఏర్పడతాయి. బూర్జువా భూస్వామ్య వర్గాలకు వ్యతిరేకంగా వర్గ పోరాటాలను ఉధృతం చేసేందుకు ఈ అవకాశాలను వారు ఉపయోగించుకుంటారు. కార్మిక లోకం, కార్మిక సంఘాలు, రైతాంగం, వ్యవసాయకూలీలు మధ్య సమన్వయం పెరుగుతుండడంతో ఈ వర్గ పోరాటాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు అవకాశాలు పెరుగుతున్నాయి. ఇటువంటి పరిణామాలు చాలా ముందుగానే ప్రారంభమయ్యాయి, 2018 నుండి ఈ వర్గాలు సంయుక్త ఉద్యమాల ద్వారా గణనీయంగా ముందుకు సాగుతున్నాయి. నవంబరు 26న కేంద్ర కార్మిక సంఘాలు అఖిల భారత సార్వత్రిక సమ్మెకు పిలుపివ్వడం, నవంబరు 26, 27 తేదీల్లో రైతు సంఘాలు ఆందోళనలకు, ఢిల్లీ చలోకు పిలుపివ్వడం అందులో భాగమే. ఉద్యమాలు, పోరాటాల్లో పెరుగుతున్న ఈ ఐక్యత కచ్చితంగా రాబోయే కాలంలో బలోపేతమవుతుంది. అదే సమయంలో, పాలక వర్గాలు సాగిస్తున్న ఈ ఉధృత వర్గ దాడి, దానితో పాటు మతపరమైన చీలికలకు మరింత పదును పెట్టడం, భారత రాజ్యాంగాన్ని దెబ్బతీసే చర్యలు, ఇవన్నీ కలిసి ఉధృత ప్రజా పోరాటాలకు పునాది వేస్తున్నాయి. ఇటువంటి సంయుక్త ఐక్య పోరాటాలు, అలాగే మహిళలు, విద్యార్ధులు, యువత, దళితులు, గిరిజనులు వంటి వివిధ వర్గాల ప్రజల వేర్వేరు డిమాండ్ల సాధనకై పోరాటాలు రాబోయే కాలంలో మరింత పెరగనున్నాయి. వీటిని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతైనా వుంది. భారత ప్రజలపై వర్గ దాడులను ఉధృతం చేసేందుకు బిజెపి చేస్తున్న యత్నాలను దోపిడీకి గురవుతున్న వర్గాలు సమర్ధవంతంగా రీతిలో దీటుగా ఎదుర్కొనాలి.

- సీతారాం ఏచూరి










