Jan 05,2023 06:42

ఫోర్త్‌ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ మామూలుగానే కోలాహలంగా ఉంటుంది. కానీ ఈ రోజు మరీ మరీ అతి కోలాహలంగా ఉంది. ఒక్కో వ్యాన్‌లో డజను, అర డజను మందిని చొప్పున తెచ్చి పడేస్తున్నారు. పైకి తిట్టుకోలేక, లోలోపలే సణుక్కుంటూ వచ్చిన వాళ్ల పేర్లు, చిరునామాలు రాసుకుంటున్నారు ఇద్దరు కానిస్టేబుళ్లు. మొత్తానికి అక్కడ అందరి కంటే పోలీసులకే బాధ ఎక్కువగా ఉన్నట్టుంది.
'' నీదే కేసు '' ? అని సుబ్బారావు పక్కనున్న అప్పారావుని అడిగేడు. '' ఉచిత యోగా శిక్షణ ఇస్తున్నాం, అందరూ రండి అని అహ్వానిస్తూ మా యోగా సెంటర్‌ నుంచి పదిమందిమి వలంటీర్లం కరపత్రాలు పంచుతున్నాం. ఇంతలో పోలీసు వ్యాను వచ్చింది. మమ్మల్ని ఎక్కించీసేరు. ఎందుకో, ఏమిటో తెలియదు. బహుశా సిఎం సభకు జనాలు చాల్లేదేమో, అందుకని పట్టుకుపోతున్నారేమో అనుకున్నాం. ఇదిగో, ఇక్కడ తెచ్చి పడీసేరు.'' అని అప్పారావు వివరిస్తున్నాడు. ఇంతలో పక్కనున్న ఓ ముసలాయన కల్పించుకున్నాడు. '' మిమ్మల్ని ఇప్పుడు తెచ్చేరు. మమ్మల్ని తెల్లారకుండానే తెచ్చి పడీసేరు.'' అన్నాడు. ''ఎందుకు సార్‌ ?'' అడిగేడు సుబ్బారావు.'' ధనుర్మాసం కదా, తెల్లారకుండా నగర సంకీర్తన చేయడం మా భజన సమాజం ప్రతీ ఏడూ చేస్తూంటుంది. మరి ఈ పోలీసులకేమైందో, మమ్మల్ని వ్యాన్‌లో ఎక్కించి ఇక్కడకి తెచ్చేరు. అప్పటికీ మెల్లిగా పాడుకుందామర్రా అని మొత్తుకుంటూనేవున్నాను. ఇదిగో, మా వీరాస్వామి వీరభక్తితో రెండు, మూడు గొంతుకలతో ఘాట్టిగా రామనామము రామనామము రమ్యమైనది రామనామము అనగానే వచ్చేరు వీళ్లు '' అని ఆ ముసలాయన గాభరాగా.
''మేము ప్రభువు శాంతి ప్రవచనాలను ప్రకటించుచూవుంటే ఈ రక్షకభటులు మమ్మల్ని ఇచ్చటకు తెచ్చితిరి. ఓ తండ్రీ ! వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమింపుడీ, మమ్మల్ని విడుదల చేయించుడీ '' అని అందుకున్నాడు ఫాదర్‌ మరియదాసు.
లోపల సిఐ రూమ్‌లో మెల్లిగానే మాట్లాడుతున్నాననుకుని గట్టిగా అరుస్తున్నాడు సిఐ. '' టూ టౌన్‌ లోనూ ఇలాగే ఉందిట. ఈ గవర్నమెంటుకి పనీ పాటూ లేదేమో. తలా, తోకా లేని జీవోలు తేవడం, వాటిని అమలు చేయడానికి మా తల ప్రాణాలు తోకకి రావడం'' అంటున్నాడు.
షేక్‌ ఆలీ టీ కొట్టు సెంటర్‌ ఆ ఏరియాకే ఫేమస్‌. అక్కడ ఎప్పుడూ సందడిగా ఉంటుంది. అక్కడికొచ్చి టీ తాగడం దాదాపు అందరికీ ఆనవాయితీ. మామూలుగానే వచ్చేడు పచ్చలరావు అక్కడికి. పార్టీలు వేరైనా, షేక్‌ ఆలీ టీ మాత్రం అందరికీ మహా ఇష్టం. అందుచేత అక్కడికొచ్చినవాళ్లెవ్వరూ పోట్లాడుకోరు. మర్యాదపూర్వకంగానే అభిప్రాయాలు ప్రకటిస్తారు. అసెంబ్లీలో తన్నుకునేవాళ్లంతా ..షేక్‌ ఆలీ టీ తాగితే సభా మర్యాదను కాపాడడం తేలిక అని అక్కడి మేథావుల అభిప్రాయం. '' ఇదేటిది ? పున్నేనికి పోతే పాపం ఎదురైనట్టు అయింది మావోడికి ? ఇదేటి కర్మరా బాబూ అని అందరవూు కలిసి దుక్కపడ్డానికి ( ద్ణుఖ పడడానికి) ఎల్తే అదేటి కరమవోు గాని ముగ్గురు సచ్చిపోనారు. ఆ ముందురోజు గావోులు ఆరుగురో, మరెంతమందో కాలవలో బడి సచ్చిపో నారు. ఇప్పుడది సాల దన్నట్టు మావోల్లమీద కేసులెడతన్నారు. సిస్సీ! పనికిమాలిన పాలన!'' అంటున్నాడు పచ్చలరావు.
''ఇలా ప్రజల హక్కుల్ని కాలరాసే చట్టాలు చేయడం దుర్మార్గం. ప్రజాస్వామ్యవాదులంతా తీవ్రంగా ఖండించాలి'' అంటున్నాడు అరుణకుమార్‌ . ఆ కుర్రాడు ఈ మధ్యనే కొత్తగా కమ్యూనిస్టు అయాడు. ఆ పక్కనే ఉన్న సామాన్యరావు ''బాబూ! పెజాస్వామ్య వాదులంతే ఎవులు బాబూ? ఆలెక్కడుంతారు ? ఆలెందుకు కండించాల? మావుు ఎందుకు ఆ పని సెయ్యకూడదు ?'' అని అరుణకుమార్‌ని అడిగేడు. అప్పుడు అరుణకుమార్‌ తమాయించుకుని ''మనమంతా ప్రజాస్వామ్యవాదులమే. మనమందరమూ ఖండించాలి'' అని క్లారిఫికేషన్‌ ఇచ్చేడు. ''అదిగదీ, అలగ సెప్పు మాకు అరదం అయేలాగ'' అని మెచ్చుకున్నాడు సామాన్యరావు. తన కొట్టుముందు జనం రద్దీ గనుక పెరిగితే తన కొట్టునే మూయించేస్తారేమో అని మరోపక్క కంగారు పడుతున్నాడు షేక్‌ ఆలీ. కంగారు తగ్గదు, వ్యాపారం మానుకోలేడు. అదీ అతడి సంకట పరిస్థితి. ఈలోపే అక్కడికొచ్చేడు నవరత్నారావు. అక్కడ జరుగుతున్న చర్చను ఫాలో అయేడు. అందరూ తమ నేత తీసుకున్న నిర్ణయాన్ని, జారీ చేసిన జివోని గురించే తిట్టుకుంటున్నట్టు గ్రహించేడు. లోలోపల కొంత గాభరా పడ్డాడు. కానీ తమాయించుకుని '' మావోడెవుడను కున్నావు ? ఎలాటోడనుకున్నావు? కడగమృగం లాటోడు. మరంచేతనే ఇలాటి జివో తెచ్చేడు '' అని సగర్వంగా ప్రకటించే డు. '' ఓరదేటి పోలికరా ? మీ నాయకుడిని మృగంతో పోలుసా ్తవేటిరా ?'' అని సామాన్యరావు అడిగేడు. '' మరదే ఇసయం. నీ బోటి సామాన్యులకి అరదం కాదంతే. కడగ మృగం ఏటి సేత్తాది? ఆకులలమలే తింటాది. కానీ అడివిలో పెమాదం వొస్తే ముందుండేది ఆ కడగ మృగమే. టివీలో నిన్న రాతిరే జంతువుల చానెల్లో సూయిస్సేను గదా నేను ? అందుకే నాకరదమైపోనాది మావోడు సేసిన పని ఎనక రగస్యం.'' అని మరింత గర్వంగా చెప్పేడు నవరత్నారావు.
''ఓరి! నీకింతకీ ఏటరదమైనాదిరా ?'' అని రెట్టించేడు సామాన్యరావు. ''ఐతే మరి ఇనుకో. అడివికి పెమాదం ఎక్కడినుంచొత్తాది? '' అని నవరత్నారావు అంటూండగానే అరుణకుమార్‌ ''అడివికి కార్పొరేట్ల మితిమీరిన ధనదాహం వల్లనే ప్రమాదం వస్తుంది'' అని జోక్యం చేసుకోబోయేడు. ''బాబూ! నివ్వు కాసేపు పల్లకో. ఆడిని సెప్పనీ. ఆర్డరేసింది ఆల్ల నాయకుడే కదా . ముందు ఆడిని సెప్పనీ'' అని వారించేడు సామాన్యరావు. మళ్ళీ నవరత్నారావు అందుకున్నాడు. '' అడివికి కార్చిచ్చు నుంచి వస్తది పెమాదం. అప్పుడు తతిమ్మా జంతువులన్నీ లగెత్తుతాయి. కానీ మన కడగ మృగం అలా కాదు. ఇంకా కార్చిచ్చు పెద్దదవకమునుపే, చిన్న చిన్న మంటలుగా ఉన్నప్పుడే గబుక్కున ఆడికెల్లిపోయి కాల్లతో దానిని తొక్కీసి ఆరిపేత్తాది. మావోడూ అంతే. ఎక్కడా జనాలలో చిచ్చు తలెత్తనివ్వడు. అది పెద్దది కాకుండానే దానిని ఎలాగో ఒకలాగ ఆరిపేత్తాడు. అప్పుడు అంతా పెశాంతంగా ఉంటాది కదా. నవరత్నాలూ బెమ్మాండంగా వచ్చేత్తాయి కదా ! ఆ ఎర్రచొక్కాలోల్లు ఎప్పుడూ రోడ్లమీదకొచ్చి గొడవలు సేత్తూనేవుంటారు. మనలో మాట! అలు సెప్తున్నవన్నీ మన మంచికేననుకో. కానీ మావోడు ఎన్నని సేయగలడు సెప్పు? అటు అదానీని, అంబానీని సూసుకోవాల, ఇటు తన పారిటీ ఎమ్మెల్యేలనీ సూసుకోవాల, మజ్జెలో మోడీగోరికి కోపం రాకుండా కాసుకోవాల, అటు పచ్చసొక్కాలవాల్లనీ ఓ ఆటాడించాల, గబ్బర్‌సింగ్‌కీ అత్తారిల్లు సూపించాల. మరి ఇన్ని పనులు జరగాలంటే అంతా పెశాంతంగా ఉండాల. అంటే ఎక్కడా అల్లర్లు జరగకూడదు. అందుకే ఆ ఎర్రసొక్కాలవోల్లని ఎంబడెంబడే వేనులెక్కించేత్తూంటారు. ఆల్లని మాటాడని య్యరు. ఆల్లు గనుక పూరాగా మాటాడితే మావోడి కొంప మునిగిపోద్ది. అదిగది, అదన్నమాట సంగతి. అందుకే మొన్న ఆ జివో తెచ్చేడు మావోడు. '' అని నవరత్నారావు వివరించేడు. '' మరెవ్వుర్నీ మాటాడనివ్వకపోతే ఎలాగరా ? ఇది ఊరా ? అడివా ?'' అని సామాన్యరావు అడిగేడు. '' ఇది ఊరైతే మావోడు కింగు. అడివే అయితే మావోడు కడగమృగం.'' అన్నాడు నవరత్నారావు.
అంతవరకూ ఆ పక్కనే కూచుని వీళ్ల మాటలు వింటున్న సత్యారావు అప్పుడు నోరిప్పేడు. ''ఓ నవరత్నం ! అడివిలో చిన్న, చితక మంటలు లేచినప్పుడు ఖడ్గమృగం తన కాళ్ళతో ఆ మంటలని ఆర్పేస్తుంది. దానికి బేసిక్‌గా మంట అంటే భయం. అది పెరిగి పెద్దదైతే దానికి దూరంగా వేగంగా పరిగెత్తలేదు కనకనే చిన్నగా ఉన్నప్పుడే ఆర్పేస్తుంది. అదే కార్చిచ్చు చెలరేగితే? అప్పుడు దానిలో పడి భస్యం అయిపోవడమే తప్ప ఖడ్గమృగానికి మరో దారి లేదు. నీకు కార్చిచ్చు అంటే తెలియదు. నీ నాయకుడికి ప్రజాస్వామ్యం అంటే తెలియదు. అదీ అసలు సమస్య'' అని లేచి షాపు బైటికి నడిచేడు. '' ఇదీ సత్యం'' అన్నాడు సామాన్యరావు.

- సుబ్రమణ్యం