Jun 24,2023 08:10

పీడ కలలు ఆపుటెలా?
చీడపురుగును చంపుటెలా?
క్రీడలలో గెలుచుటెలా?
నీడ పొడవు మారునెలా?

ఊడ విస్తరించుటెలా?
దూడ పాలు తాగుటెలా?
గూడ కొంగ వలసలెలా?
చూడకుండ నమ్ముటెలా?

కాడలేని సుమముందా?
పాడలేని పికముందా?
ఆడలేని శిఖి ఉందా?
వీడక గ్రహణము ఉందా?

కడవలెలా చేస్తారు?
పడవలెలా తోస్తారు?
పిడకలేల చేస్తారు?
పుడకలేల తెస్తారు?

కుండలెవరు చేశారు?
కొండనెవరు తొలిచారు?
బండనెవరు మలిచారు?
ఎండనెవరు ఇస్తారు?

గడగడమని ప్రశ్నలడుగు
తడబడకనె జవాబివ్వు
ఎడతెగకుండా ఎగసే
కడలి అలల వోలె సాగు !
 

- గుడిపూడి రాధికారాణి,
మచిలీపట్నం.