- హౌసింగ్ అధికారుల్లో గడువు గుబులు
- కలెక్టర్ల ఒత్తిళ్లు.. లబ్ధిదారుల నుంచి వ్యతిరేకత
- చాలని సాయం.. పెరిగిన ధరలు
ప్రజాశక్తి-చిత్తూరు ప్రతినిధి : డిసెంబర్ 12వ నాటికి రాష్ట్ర వ్యాప్తంగా సామూహిక గృహప్రవేశాలు నిర్వహించాలనే ప్రభుత్వ నిర్ణయం హౌసింగ్ అధికారుల్లో గుబులు రేగుతోంది. నిర్ణీత లక్ష్యాలు పూర్తి చేయాలని కిందిస్థాయి అధికారులపై కలెక్టర్లు ఒత్తిడి తెస్తున్నారు. అత్తెసరు సాయంతో ఇల్లు ఎలా కట్టుకోవాలంటూ అధికారులను లబ్ధిదారులు నిలదీస్తున్నారు. పైగా గడువు విధించడం ఎంత వరకు న్యాయం అంటూ ప్రశ్నిస్తున్నారు. దీంతో అటు ఉన్నతాధికారులకు చెప్పుకోలేక, ఇటు లబ్ధిదారులను ఒప్పించలేక హౌసింగ్ సిబ్బంది సతమతమవుతున్నారు.
వైసిపి ప్రభుత్వం రాష్ట్రంలో 15.58 లక్షల ఇళ్లు నిర్మించాలని నిర్ణయించింది. వీటిల్లో 13.66 లక్షల ఇంటి స్థలాలు మంజూరు చేసింది. ఇందులో 2.49 లక్షల ఇళ్లలో నిర్మాణం ఇప్పటికీ ప్రారంభమే కాలేదు. 1.33 లక్షల ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయి. బేస్‌మెంటు లెవల్ కన్నా అధికంగా ఉన్న గృహాలు వివిధ దశల్లో 5.62 లక్షలున్నాయి.
- నాలుగు లక్షల ఇళ్ల పూర్తికి ప్రణాళిక
ఈ ఇళ్ల నిర్మాణంలో పురోగతి సాధించాలనే ఉద్దేశంతో తొలి విడతలో రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షల గృహాలు పూర్తి చేయాలని నిర్ణయించింది. అల్లూరి సీతారామరాజు జిల్లా మినహా మిగిలిన 25 జిల్లాల్లో నిర్ణీత గృహాలు లక్ష్యంగా పెట్టుకుంది. వీటన్నింటినీ డిసెంబర్ 21వ తేదీ నాటికి గృహప్రవేశాలు నిర్వహించాలని ప్రణాళికలు రూపొందించింది. ఇందులో సెప్టెంబర్ 22వ తేదీ వరకు పూర్తి చేసిన 1.31 లక్షల గృహాలతో పాటు మొత్తం నాలుగు లక్షల ఇళ్లు పూర్తి చేయాలని నిర్ణయించింది. సెప్టెంబర్ నాటికి 9,500, అక్టోబర్ 1.08 లక్షలు, నవంబర్ 92,800, డిసెంబర్ నాటికి 58,817 గృహాలు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
గడువులోగా వీటిల్లో ఇప్పటి వరకు 39 శాతం మాత్రమే పూర్తయ్యాయి. 1.57 లక్షల ఇళ్లు మాత్రం పూర్తయ్యాయి. 2.43 లక్షల ఇళ్లుకట్టాల్సి ఉంది. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో 44,297 గృహాలు మాత్రమే పూర్తి కావడం గమనార్హం. దీనిపై ఆయా జిల్లాల్లో కలెక్టర్ల నుంచి హౌసింగ్ సిబ్బందిపై ఒత్తిళ్లు ఎక్కువయ్యాయి. ప్రతి రోజూ సమీక్షలు నిర్వహించి లక్ష్యాలు సాధించని ఎఇ, డిఇలను అందరి ముందూ కలెక్టర్లు కేకలేస్తున్నారు. ఇటీవల చిత్తూరు జిల్లాలో ఒక అధికారి ముఖంపై కలెక్టర్ పేపర్లు విసిరి గొట్టినట్లు సమాచారం.
- లబ్ధిదారుల నుంచి వ్యతిరేకత
ప్రభుత్వం నిర్ణయించిన ఈ గడువు వల్ల క్షేత్రస్థాయి సిబ్బందికి ఇక్కట్లు ఎదురవుతున్నాయి. నిర్మాణ సామగ్రి ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఊరికి దూరంగా లే అవుట్లు ఉన్నాయి. కాలనీల్లో కనీస వసతుల కల్పనపైన లబ్ధిదారులకు నిర్థిష్టమైన హామీ ఇవ్వడం లేదు. దీంతో వారు ఇళ్ల నిర్మించుకునేందుకు వెనకడుగు వేస్తున్నారు. అంతేకాకుండా నిర్మాణ సామగ్రి ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. సిమెంటు, ఇనుము ధరలు ఉక్కిరిబిక్కిరి చేసినా ప్రభుత్వమే కొంత రాయితీతో సరఫరా చేస్తుండడంతో లబ్ధిదారులకు ఊరట కలుగుతోంది. అయితే ఇటుకలు ఏ రోజు ఆరోజు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఏడాది క్రితం వరకు ఒక్కో రాయి రూ.నాలుగు చొప్పున ఇళ్లకే సరఫరా చేసేవారు. ప్రస్తుతం ఇది రూ.తొమ్మిది నుంచి రూ.పది వరకు పలుకుతోంది. మెటీరియల్‌తో కలిపి చదరపు అడుగుకు రెండేళ్ల కిందట రూ.1250 తీసుకునే వారు. ప్రస్తుతం రూ. రెండు వేల వరకు పెరిగింది. ఇందులో ప్రభుత్వం ఇస్తున్న రూ.1.80 లక్షలు పునాదాలు వేసేందుకు కూడా సరిపోవని లబ్ధిదారులు వాపోతున్నారు.











