
- షేర్‌వాల్ టెక్నాలజీతో అమరావతిలో మూడు నెలల్లో 30 వేల ఇళ్ల పూర్తికి చర్యలు
- గుంటూరు, ఎన్‌టిఆర్ జిల్లాల పేదలకు 47 వేల ఇళ్లు
- రేపు శంకుస్థాపన చేయనున్న సిఎం జగన్
ప్రజాశక్తి- గుంటూరు జిల్లా ప్రతినిధి : రాజధాని అమరావతి ప్రాంతంలోని ఆర్-5 జోన్‌లో పేదలకు ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన సన్నాహాలు చేస్తోంది. గుంటూరు, ఎన్‌టిఆర్ జిల్లాలకు చెందిన 54 వేల మంది పేదలకు కేటాయించిన స్థలాల్లో ఇళ్ల నిర్మాణాలకు ఈ నెల 24న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శంకుస్థాపన చేయనున్నారు. షేర్‌వాల్ టెక్నాలజీతో తక్కువ ఖర్చుతో వేగంగా నిర్మాణాలు పూర్తి చేసేందుకు గృహ నిర్మాణ శాఖాధికారులు చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే మంగళగిరి మండలం కృష్ణాయపాలెంలో నమూనా గృహ నిర్మాణాలను అధికారులు ప్రారంభించారు. ఒక్కో ఇల్లు మూడు రోజుల్లో పూర్తి చేసేలా కాంట్రాక్టు సంస్థకు బాధ్యత అప్పగించారు. మొత్తం 47 వేల ఇళ్లకుగానూ 30 వేల ఇళ్లను మూడు నెలల్లో పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించారు. అనంతరం వాటినినేరుగా లబ్ధిదారులకు అప్పగించనున్నారు. మిగతా 17 వేల ఇళ్లను లబ్ధిదారులు నిర్మించుకునేలా ప్రణాళిక రూపొందించారు. ఒక్కొక్క ఇంటికీ రూ.2.11 లక్షలు కేటాయించారు. మొత్తం 25 లేఅవ్లుటలో 54 వేల మందికి ఇళ్ల స్థలాలు కేటాయించగా, తొలి దశలో 47 వేల ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. రాజధానికి భూములు ఇచ్చిన రైతులు ఇతర ప్రాంతాల్లోని వారికి ఇక్కడ ఇళ్ల స్థలాలు కేటాయించడాన్ని, ఇళ్ల నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టు, సుప్రీంకోర్టులలో కేసులు దాఖలు చేశారు. ఇవి విచారణలో ఉన్న నేపథ్యంలో తుది తీర్పునకు లోబడి స్థలాలు కేటాయించాలని సుప్రీంకోర్టు సూచించింది. ఈ మేరకు ఇళ్ల పట్టాలపై సుప్రీంకోర్టు నిర్ణయాన్ని ముద్రించారు. ఇళ్ల నిర్మాణంపై న్యాయస్థానం స్టే ఇవ్వకపోవడంతో ప్రభుత్వం స్పీడ్ పెంచింది. రాజధానిలో పేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వడాన్ని సిఎం జగన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎప్పటికప్పుడు గృహ నిర్మాణ శాఖాధికారులతో సమీక్షలు చేసి వీలైనంత త్వరగా 30 వేల ఇళ్లను పూర్తి చేసేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ నెల ఎనిమిదిన ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామని తొలుత ప్రకటించినా, కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో ఇళ్ల నిర్మాణానికి తాము నిధులు ఇవ్వలేమని కేంద్ర ప్రభుత్వం చెప్పడంతో అప్పట్లో ఈ కార్యక్రమం వాయిదా పడింది. ఈ నెల 24న సిఎం జగన్ తొలుత కృష్ణాయపాలెంలో ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేసిన అనంతరం ఇప్పటికే నిర్మించిన నమూనా గృహాలను, ఇళ్ల నిర్మాణాన్ని పరిశీలిస్తారు. తరువాత తుళ్లూరు మండలం వెంకటపాలెంలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ నేపథ్యంలో శనివారం మంత్రులు జోగి రమేష్, మేరుగు నాగార్జున, ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర ఉన్నతాధికారులు శంకుస్థాపన ఏర్పాట్లను పరిశీలించారు.