- స్వయం సమృద్ధి దిశగా టిడ్కో భవన సముదాయాలు
- అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశం
- గృహ నిర్మాణశాఖపై సమీక్ష
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గృహ నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. గృహ నిర్మాణశాఖ పురోగతిపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో గురువారం అధికారులతో సిఎం సమీక్షించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో గృహ నిర్మాణాల పరిస్థితిని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.
ఇప్పటి వరకు రాష్ట్రంలో 4,24,220 ఇళ్లు పూర్తయ్యాయని, ఆగస్టు ఒకటి నాటికి మరో ఐదు లక్షల ఇళ్లు పూర్తవుతాయని తెలిపారు. రూఫ్‌లెవల్, ఆ పైస్థాయిలో 5,68,517 ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయని, వివిధ స్థాయిల్లో 9,56,369 ఇళ్లు ఉన్నాయని వివరించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో హౌసింగ్ కోసం రూ.2,201 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు.
సిఆర్‌డిఎ పరిధిలో 45,101 మంది ఆప్షన్-3 ఎంపిక చేసుకున్నారని, ఈ మేరకు కాంట్రాక్టర్ల ఎంపిక కూడా పూర్తయిందని అధికారులు వివరించారు. లబ్ధిదారులతో బ్యాంకు ఖాతాలు తెరిచే ప్రక్రియ ప్రారంభమైందన్నారు. నీటి సరఫరా, అప్రోచ్ రోడ్లు, విద్యుత్ సరఫరా తదితర పనులపై దృష్టిపెట్టామని వివరించారు. ప్రాంతంలో పేదలకు ఇళ్ల నిర్మాణంపై పిటిషన్లు, కోర్టు విచారణలో అంశాన్ని అధికారులు ప్రస్తావించారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ.. కాలనీలు పూర్తవుతున్న కొద్దీ మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులకు సూచించారు. ఇళ్ల నిర్మాణ వేగాన్ని ఇదే రీతిలో ముందుకు తీసుకెళ్లాలని, కోర్టు కేసులున్న ప్రాంతాల్లో తక్షణం ప్రత్యామ్నాయ భూముల సేకరణపై దృష్టి సారించాలని ఆదేశించారు. విశాఖలో ఇళ్ల నిర్మాణం నిర్దేశిత సమయంలోగా పూర్తికావాలని, ఈ మేరకు అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. డిసెంబరు నాటికి విశాఖలో ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసేందుకు కావాల్సిన సహాయ సహకారాలను ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు.
కొత్తగా ఇళ్లకోసం దరఖాస్తు చేసుకున్నవారికి పట్టాలు ఇచ్చేందుకు భూములు సేకరించాలని ఆదేశించారు. వీటికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చేలా కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు. పేదలకు ఇళ్లు రానివ్వకూడదని నిరంతరం అడ్డంకులు సృష్టిస్తున్నారని, వీటన్నిటినీ అధిగమించి ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాలని, దీనికి అవసరమైన న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
స్వయం సమృద్ధి ప్రాంతాలుగా టిడ్కో భవనాలు
రాష్ట్రంలో టిడ్కో భవన సముదాయాలను స్వయం సమృద్ధి ప్రాంతాలుగా తీర్చిదిద్దేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని సిఎం జగన్ ఆదేశించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 71,452 ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించామని, ఈ నెలలో మరో 29,496 ఇళ్లను, ఆగస్టులో 49,604 ఇళ్లు ఇస్తామని అధికారులు వివరించారు. 300 చదరపు అడుగులు ప్లాట్లను ఉచితంగా ప్రభుత్వం ఇస్తున్నందున మిగిలిన కేటగిరీల్లో 365, 430 చదరపు అడుగుల లబ్ధిదారులకు బ్యాంకుల ద్వారా దాదాపు రూ.2 వేలకోట్లు రుణాలుగా ఇప్పించామని అధికారులు వివరించారు. వందల, వేల సంఖ్యలో గృహాలు టిడ్కో సముదాయాలలో వుంటున్నందున వారి అవసరాలను తీర్చేలా వాణిజ్య సముదాయాలను ఏర్పాటుచేయాలని సిఎం ఆదేశించారు. తొలిదశలో 15 టిడ్కో సముదాయాల్లో మహిళల ఆధ్వర్యాన వ్యాపార, వాణిజ్య సముదాయాలు ఏర్పాటయ్యేలా చూడాలన్నారు. టిడ్కో గృహాలపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు.
ఈ సమావేశంలో రాష్ట్ర గృహ నిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజరు జైన్, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సెక్రటరీ వై శ్రీలక్ష్మి, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ ఎమ్‌డి లక్ష్మీశా, ఛైర్మన్ దవులూరి దొరబాబు, టిడ్కో ఎమ్‌డి శ్రీధర్ పాల్గొన్నారు.










